యూరప్‌వ్యాప్తంగా వెల్లువెత్తిన నిరసనలు
వేలాదిమందితో ప్రదర్శనలు
రోమ్ : గాజాకు మానవతా సాయాన్ని తీసుకెళుతున్న అంతర్జాతీయ నౌకలు, బోట్ల బృందాన్ని ఇజ్రాయిల్ అడ్డగించడంపై యూరప్‌వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, బ్రిటన్ తదితర దేశాల్లో వేలాదిమందితో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. గాజా వెళుతున్న ఆ నౌకల్లోని తమ పౌరుల భద్రతకు హామీ కల్పించాలంటూ పలు దేశాల ప్రభుత్వాలు ఇజ్రాయిల్‌కు విజ్ఞప్తి చేశాయి. గాజాకు సాయాన్ని తీసుకెళుతున్న గ్లోబల్ సముద్ ఫ్లోటిల్లా (జిఎస్‌ఎఫ్)ను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నట్లు ఇజ్రాయిల్ నావికా దళం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ జిఎస్‌ఎఫ్‌లో 50 వరకు బోట్లు, నౌకలు వున్నాయి. 41కి పైగా దేశాలకు చెందిన 500మందికి పైగా వలంటీర్లు వున్నారు.
పాలస్తీనియ న్లకు ఆహారం, వైద్య సాయం అందకుండా ఇజ్రాయిల్ నావికాదళం అమలు చేస్తున్న ఆంక్షలను సవాలు చేస్తూ జిఎస్‌ఎఫ్ బయలుదేరింది. తాజా పరిణామాలతో మధ్యధరా సముద్రంలో సహాయక బోట్లన్నీ నిలిచిపో యాయి. ఒకే ఒక్క నౌక ఇంకా గాజాకు చాలా దూరంలో వుందని పేర్కొంది. గ్రీక్ పార్లమెంట్ సభ్యు లు గురువారం ఈ చర్యలను ఖండించారు. సిట్టింగ్ ఎంపితో సహా పలువరు గ్రీక్ పౌరులు ఆ నౌకల్లో వున్నారని, వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రీస్ కమ్యూనిస్టు పార్టీ సహా పలు పార్టీల ప్రతినిధులు కూడా ఈ సంఘటనను విమర్శించారు. ఇజ్రాయిల్ తక్షణమే దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇటలీ రక్షణ మంత్రి గెయిడొ క్రాసెటొ కూడా ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.
ఇజ్రాయిల్ దుశ్చర్యపై భగ్గుమన్న ప్రపంచం
గాజాకు మానవతా సహాయాన్ని తీసుకెళ్తున్న వారిని ఇజ్రాయిల్ సైన్యం అడ్డుకున్న తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుపై బలమైన ఆంక్షలు విధించాలని ప్రదర్శనకారులు డిమాండ్ చేశారు.బ్యానర్లు, ప్లకార్డులతో ఇజ్రాయిల్‌కు వ్యతిరేకంగా ప్రజలు నినాదాలు చేశారు. యూరప్ నుంచి ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికా వరకు ఉన్న ఖండాలతో పాటు మధ్యప్రాచ్యదేశాల్లోనూ నిరనసలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బార్సిలోనాలో సుమారు 15 వేల మంది ప్రదర్శనకారులు ”గాజా, మీరు ఒంటరివారు కాదు,” ”ఇజ్రాయిల్‌ను బహిష్కరించండి” , ”పాలస్తీనాకు స్వేచ్ఛ” ఇవ్వాలని నినాదాలు చేస్తూ కవాతు చేశారు. అడ్డంకులను అధిగమించడానికి ప్రయత్నించిన నిరసనకారులను అణచివేయటానికి పోలీసులు తీవ్రంగా ప్రయత్నం చేయక తప్పలేదు. సముద్రంలో అడ్డగించబడిన వారిలో బార్సిలోనా మాజీ మేయర్ అడా కోలావ్ కూడా ఉండటం గమనార్హం. ఇప్పుడు నెల్సన్ మండేలా మనవడు ”మాండ్లా” మండేలాతో సహా తోటి కార్యకర్తలతో పాటు బహిష్కరణను ఎదుర్కొంటున్నారు.
డబ్లిన్‌లోనూ..
డబ్లిన్‌లోని ఐర్లాండ్ పార్లమెంట్ వెలుపల అనేక వందల మంది నిరసనకారులు కూడా గుమిగూడారు, ఇక్కడ పాలస్తీనియన్ సంఘీభావం తరచుగా బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా ఐర్లాండ్ యొక్క చారిత్రక పోరాటంతో ముడిపడి ఉంటుంది. ఫ్లోటిల్లాలో చేరిన తన కుమార్తె మిరియం మెక్‌నాలీ గురించి ఇలా అన్నారు: ”నా కుమార్తె పట్ల నేను చాలా గర్వపడుతున్నాను. ఆమె తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నా మానవత్వం కోసం నిలబడుతోంది.” అని మెక్‌నాలీ పేర్కోన్నారు.
పారిస్‌లో..
పారిస్ ప్లేస్ డి లా రిపబ్లిక్‌లో నిరసనకారులు గళమెత్తారు. ఇజ్రాయిల్‌కు సైనిక భాగాలను విక్రయించి నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయుధ తయారీదారు యూరోలింక్స్‌కు ప్రాప్యతను నిరోధించడానికి ప్రయత్నిం చారు.భారీ సంఖ్యలో ప్రదర్శనకారులను అరెస్టు చేశారు.
ఇటలీతో పాటు ప్రధాన నగరాల్లోనూ..
ఫ్లోటిల్లాకు సంఘీభావంగా ప్రధాన యూనియన్లు శుక్రవారం సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన ఇటలీలో, ప్రధాన నగరాల్లో ప్రదర్శనలు వ్యాపించాయి. పోలీసుల ప్రకారం, రోమ్‌లో పదివేల మంది మంది పాల్గొన్నారు. నిరసనకారులు గాజాలో జాతి విధ్వంసాన్ని వెంటనే ఆపాలి” అంటూ నినాదాలు చేశారు. బెర్లిన్, ది హేగ్, ట్యూనిస్, బ్రెసిలియా, బ్యూనస్ ఎయిర్స్, సిడ్నీ , ఇస్తాంబుల్‌లలో భారీ నిరసనలు కోనసాగాయి. అక్కడ ప్రదర్శనకారులు ”ఆక్రమణపై పూర్తి ఆంక్షలు” విధించాలని పిలుపునిచ్చే బ్యానర్‌లతో ఇజ్రాయిల్ రాయబార కార్యాలయానికి కవాతు చేశారు. బ్రస్సెల్స్‌లో, సుమారు 3,000 మంది యూరోపియన్ పార్లమెంట్ వెలుపల గుమిగూడి, పొగ బాంబులు , బాణసంచా పేలుళ్ల మధ్య యూరోపియన్ యూనియన్(ఈయూ) జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. గాజాపై ఇజ్రాయిల్ దురాక్రమణను విచ్ఛిన్నం చేయమని” నినదించారు.