యావత్ ప్రపంచం నిరసిస్తున్నా మారణకాండను కొనసాగిస్తూనే ఉంది ఇజ్రాయిల్. ఇప్పుడు పాలస్తీనాకు చెందిన గాజా ప్రాంతంలో ముందుగా పదిలక్షల జనాభా ఉన్న గాజా నగరాన్ని స్వాధీనం చేసుకొనేందుకు టాంకులు, సాయుధ శకటాలతో మిలిటరీని దించింది. తర్వాత యావత్ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు పథకం వేసింది. ఇదే సమయంలో పాలస్తీనాలో రెండో ముక్క పశ్చిమగట్టు ప్రాంతంలో పాలస్తీనాకు చెందిన తూర్పు జెరూసలెం పరిసరాల్లో వేలాది ఇండ్ల నిర్మాణాలు, తద్వారా యూదులను రప్పించి దాన్ని కూడా తమదిగా చేసుకొనేందుకు కూడా ఇజ్రాయిల్ ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే అనేక ప్రాంతాల ఆక్రమణ, నిర్మాణాలతో జనాభా స్వరూప స్వభావాలను మార్చేందుకు చేయాల్సిందంతా చేసింది. తాజా చర్యలతో రెండు దేశాల ఏర్పాటన్నది మరింత సంక్లిష్టంగా మారనుంది.
గాజాను స్వాధీనం చేసుకొనేం దుకు ఇప్పటికే వైమానిక దాడులతో 60 నుంచి 70వేల మంది అమాయకులను హతమార్చిన ఇజ్రాయెల్ ఇటీవలి కాలంలో ఐరాస శిబిరాల వద్ద సాయాన్ని అందుకొనేందుకు వచ్చిన వారి మీద దాడులు జరుపుతూ ప్రతి రోజూ అనేక మందిని చంపివేస్తున్నది. ఆహారమందక ఆకలితో మరణించిన వారి సంఖ్య 112 మంది పిల్లలతో సహా 269కి చేరింది. గత 22 నెలలుగా హమాస్ తీవ్రవాదులను పట్టుకొనే పేరుతో జరుపు తున్న మారణకాండలో ముందే చెప్పుకున్నట్లు 70వేల మంది వరకు మరణించగా లక్షలాదిమంది గాయపడ్డారు, నివాస గృహాలు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, నిర్వాసితులైన వారి శిబిరాలను కూడా ధ్వంసం చేస్తున్నారు. అమెరికాతో సహా నిత్యం మానవహక్కుల గురించి సుభాషితాలు చెప్పే పశ్చిమదేశాలు ఈ దారుణాన్ని ఆపేందుకు పూనుకోకపోగా భద్రతా మండలిలో పెడుతున్న తీర్మానాలను వీటో చేస్తున్నాయి. ఒక వైపు కొన్ని దేశాలు పాలస్తీనాను గుర్తిస్తాం, ఇజ్రా యిల్ చేస్తున్నదానిని సమర్ధించం అంటూనే గాజా మారణకాండకు అవసరమైన ఆయుధాలను అందిస్తున్నాయి.
ఉక్రెయిన్ సంక్షోభంలో కాల్పుల విరమణకు రష్యా మీద వత్తిడి తెస్తున్న పెద్దలు గాజా గురించి రెండు నాలుకలతో మాట్లాడుతున్నారు. మధ్యవర్తులు చేసిన అరవై రోజుల కాల్పుల విరమణ, బందీలుగా ఉన్నవారిలో సగం మందిని విడుదల చేసేందుకు హమస్ సంస్థ మూడు రోజుల క్రితమే అంగీకరించింది. దాని గురించి ఉలుకూపలుకూ లేకుండా ఇజ్రాయిల్ గాజా ఆక్రమణకు పూనుకొన్నప్పటికీ పశ్చిమ దేశాలు పల్లెత్తు మాటనటం లేదు. ఇప్పటికే మోహరించిన దళాలు అలసిపోతే వారి స్థానంలో మారణకాండ కొనసాగించేందుకు మరో అరవైవేల మంది రిజర్వు దళాలను ఇజ్రాయెల్ సన్నద్దం చేస్తున్నది. ఇరవై నెలలుగా అనేక కట్టుకథలను అల్లుతూ తన దుర్మార్గాన్ని సమర్ధించుకుంటున్న యూదు మూకలు ఇప్పుడు సరికొత్త కబుర్లు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో హమాస్ నిర్వహిస్తున్న సొరంగాలు, కలుగుల్లో ఆయుధాలను కనుగొన్నారట. అదే నిజమైతే వాటిని స్వాధీనం చేసుకోవచ్చు కదా గాజా ఆక్రమణ ఎందుకు ? సొరంగాలు, మద్దతుదార్ల నుంచి హమాస్ సాయుధుల మధ్య ఉన్న సంబంధాలను తెంచేందుకు ఆక్రమణ అవసరమని సమర్ధించుకుంటున్నారు. ఎవరెన్ని చెప్పినా జనంలో భాగంగా ఉన్న పాలస్తీనా యోధులను అంతం చేయటం గత కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయిల్ వల్లకాలేదు, ఇక ముందు కూడా సాధ్యం కాదు. ఒక సంస్థను అంతం చేసి కొంత మందిని హత్య చేస్తే మాతృభూమి వాంఛ ఆగదు. పూవు పుట్టగానే పరిమళించినట్లుగా అక్కడ పుట్టే ప్రతి బిడ్డా కన్ను తెరవగానే మాతృదేశం కోసం ఒక యోధగా మారుతున్నారన్నది జగమెరిగిన సత్యం.
ఇజ్రాయిల్ దుర్మార్గాన్ని నిలువరించటంలో ఐరాస విఫలమైంది. పాలస్తీనా, క్యూబా మీద కుట్రలకు వ్యతిరేకంగా ప్రతియేటా సాధారణ అసెంబ్లీలో ఆమోదించే తీర్మానాలు యావత్ దేశాల వైఖరిని వెల్లడిస్తున్నప్పటికీ భద్రతా మండలిలో వీటో ఖడ్గంతో అమెరికా వాటిని పనికి రాకుండా చేస్తున్నది. ఇప్పటికే పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయిల్ దుండగాలను ఖండిస్తూ లక్షలాది మంది ప్రతి రోజూ ప్రపంచంలో ఏదో ఒకమూల నినదిస్తూనే ఉన్నారు.గాజా మారణకాండను, దురాక్రమణకు వ్యతిరేకంగా మరింతగా ఉద్యమించటం తప్ప శాంతి శక్తుల ముందు మరొక మార్గం లేదు. ఇది ఒక్క పాలస్తీనా సమస్య కాదు. స్వాతంత్య్రం కోరుకొనే ప్రతి ఒక్కరిమీద సామ్రాజ్యవాదశక్తులు చేస్తున్నదాడి. స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎంతటి మహత్తరమైనదో భారతీయులకు చెప్పాల్సినపని లేదు. పాలస్తీనియన్లకు యావత్ జాతి అండగా నిలవాల్సిన అవసరం ఉన్నది.
గాజా ఆక్రమణలో ఇజ్రాయిల్ !
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES