మూడు వారాల్లో 2వేల మందికి పైగా మృతి
పదివేల మందికి పైగా నిరాశ్రయులైన వైనం
పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలు నిలిచిపోవాలి : జర్మనీ, ఫ్రాన్స్ స్పష్టీకరణ
టెహ్రాన్, టెల్ అవీవ్, వాషింగ్టన్ : టెహ్రాన్, బీరుట్ నగరాలపై శనివారం ఇజ్రాయిల్ భీకరంగా దాడులు జరిపింది. గత మూడు వారాలుగా సాగుతున్న ఈ దాడుల్లో ఇప్పటివరకు 2వేలమందికి పైగా మరణించారు. కేవలం లెబనాన్‌లోనే వెయ్యిమందికి పైగా మృతి చెందారు. పది లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. బీరుట్‌లోని హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా తాము దాడులు జరుపుతున్నామని ఇజ్రాయిల్ ప్రకటించింది. వచ్చే వారం ఈ దాడులు మరింత గణనీయంగా, ఉధృతంగా మారతాయని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి కట్జ్ హెచ్చరించారు. మరోవైపు పశ్చిమాసియాకు వేలాదిమంది నావికా బలగాలను అమెరికా పంపుతోంది. కాగా తక్షణమే కాల్పుల విరమణను ఇరాన్ కోరుకోవడం లేదని, యుద్ధాన్ని శాశ్వతంగా, సంపూర్ణంగా, సమగ్రంగా ముగించడానికి చర్యలు తీసుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అరగ్చి పేర్కొన్నారు.
ఇరాన్‌లో లక్ష్యాలు దాదాపుగా సాధించాం : ట్రంప్
ఇరాన్‌పై సాగించిన యుద్ధంలో తమ లక్ష్యాలను దాదాపుగా సాధించామని ట్రంప్ చెప్పుకున్నారు. ఇరాన్ సైనిక పాటవాన్ని నిర్మూలించడం, అణ్వాయుధాన్ని అభివృద్ధిపరచకుండా అడ్డుకోవడం తమ కీలక లక్ష్యాలని వాటిని నెరవేర్చామని చెప్పారు. అందువల్ల ఇరాన్‌లో యుద్ధాన్ని ముగించే విషయమై ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ఇరాన్ విషయంలో ట్రంప్ పలురకాలుగా ప్రకటనలు చేస్తున్నారు. ఒకపక్క పశ్చిమాసియాకు 2500మంది అదనపు నావికులను పంపిస్తున్నారు. యుద్ధం కోసం అదనంగా నిధులు కావాలని కాంగ్రెస్‌ను కోరుతున్నారు. వీటన్నింటికీ మించి ఇరాన్‌పై ఇక యుద్ధాన్ని ముగిస్తామంటున్నారు. పైగా హార్ముజ్ జలసంధిని పరక్షించుకోవాల్సిన బాధ్యత నాటో దేశాలదేనని, అమెరికాకు దానితో సంబంధం లేదని వ్యాఖ్యానించారు.
ముందు యుద్ధం ఆగాలి
హార్ముజ్ జలసంధి ధ్వారా నౌకల రవాణా నిలిచిపోవడంతో ముడి చమరు సరఫరా ఆగిపోయి పలు దేశాల్లో ఇబ్బందులు తలెత్తాయి. చమురు ధరలు 50శాతం మేరా పెరిగాయి. ఈ నేపథ్యంలో హార్ముజ్ ద్వారా నౌకల రాకపోకలు సురక్షితంగా జరిగేలాచూసేందుకు అవసరమైన ప్రయత్నాలు చేయడానికి చేతులు కలుపుతామని పలు అమెరికా మిత్రపక్షాలు ప్రకటించాయి. పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభించడానికి ముందు తమని మాట మాత్రంగానైనా సంప్రదించలేదని ఈ దేశాలు ఇప్పటికే పేర్కొన్నాయి.
తాజాగా పరిస్థితులు ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో ఈ దేశాలు ముందుకొచ్చాయి. అయితే వీటన్నింటికంటే ముందుగా పశ్చిమాసియాలో యుద్ధం తక్షణమే నిలిచిపోవాలని జర్మనీ, ఫ్రాన్స్ స్పష్టం చేస్తున్నాయి. ముందుగా అది జరిగితేనే తర్వాత ఏ చర్యలైనా చేపట్టడానికి వీలు వుంటుందని పేర్కొంటున్నాయి. ఈ వారాంతంలో ట్రంప్‌తో మాట్లాడనున్నట్టు జర్మనీ ఛాన్సలర్ ప్రెడ్‌రిక్ మెర్జ్ చెప్పారు. కాగా హార్ముజ్ గుండా జపాన్‌కు సంబంధించిన నౌకలు వెళ్ళడానికి ఇరాన్ అనుమతించడానికి సిద్ధంగా వుందని క్యోడో వార్తా సంస్థ శనివారం తెలిపింది.



