నవతెలంగాణ-హైదరాబాద్: ఏండ్ల తరబడి గాజాపై ఇజ్రాయిల్ దేశ సైన్యం దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు చర్యలపై ప్రపంచ దేశాలు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నాయి. గాజాకు ఆహార పదార్థాలు, నిత్యావసర సరుకులు సరఫరా కాకుండా నిర్భందాలు విధించారు. ఇతర దేశాల నుంచి అందే మానవత సాయం అందకుండా అడ్డుకులు సృష్టించారు. గాజాలో వేలమంది ప్రజలు ఆకలి చావులకు బలైపోతున్నారు. దీంతో నెతన్యాహు నిర్ణయాలపై సొంత దేశంలో నిరసనలు మిన్నంటుతున్నాయి. అంతర్జాతీయంగా ఇజ్రాయిల్ పరువు తీస్తున్నారని ఆదేశ వాసులు నెతన్యాహుపై దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రపంచ దేశాలు కూడా పలు ఆంక్షలు విధించడానికి సన్నాహాలు చేస్తున్న సమయంలో..ఇజ్రాయిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
గాజాలోకి స్థానిక వర్తకుల ద్వారా క్రమబద్ధమైన, నియంత్రిత వస్తువుల ప్రవేశాన్ని అనుమతిస్తుందని ఇజ్రాయిల్ సైన్యం మంగళవారం తెలిపింది. గాజాస్ట్రిప్‌లోకి మానవతా సాయాన్ని పెంచేందుకు, యుఎన్, అంతర్జాతీయ సంస్థల నుండి సహాయ సేకరణను తగ్గించడం లక్ష్యంగా ఈ చర్య చేపట్టినట్లు సాయాన్ని సమన్వయం చేసే ఇజ్రాయిల్ సైనిక సంస్థ సిఒజిఎటి పేర్కొంది.
గాజాలో మానవతా సాయాన్ని అందించేందుకు రోజుకు సుమారు 600 సహాయ ట్రక్కులు అవసరమని పాలస్తీనియన్, ఐరాస అధికారులు తెలిపారు. యుద్ధానికి ముందు ఇజ్రాయిల్ గాజాలోకి అనుమతించే సంఖ్య ఇది. ఇజ్రాయిల్ కొన్ని షరతులను అంగీకరిస్తే, గాజాలో తమ వద్ద బందీలుగా ఉన్న వారికి సాయం అందించడానికి రెడ్‌క్రాస్‌తో సమన్వయం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు హమాస్ ఆదివారం ప్రకటించింది.