నగరంపై పట్టు కోసం అనేక దుశ్చర్యలు
ఇప్పటికే వైమానిక దాడులతో వీరంగం
భూతలదాడులతో భయోత్పాతం
యుద్ధట్యాంకులను మోహరించిన సైన్యం
భయంతో గాజాను వీడుతోన్న లక్షలాది మంది ప్రజలు
ఇజ్రాయిల్ చర్యలపై ప్రపంచ దేశాల నుంచి ఖండనలు
65 వేలు దాటిన పాలస్తీనియన్ల మరణాలు
కైరో, జెరూసలేం : గాజాపై ఇజ్రాయిల్ జరుపుతోన్న అమానుష దాడుల కారణంగా అక్కడి ప్రజలు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోన్న భయం గాజా పౌరులను వెంటాడుతున్నది. హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా చెప్తున్న ఇజ్రాయిల్.. ఆ వంకతో గాజాపై పూర్తి పట్టుకోసం ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం అనేక అమానుష చర్యలకు పాల్పడుతున్నది. హమాస్‌పై దాడి సాకుతో ఇప్పటికే వైమానికదాడులు జరిపిన ఇజ్రాయిల్.. ఇప్పుడు భూతల దాడులతో గాజాపై విరుచుకుపడుతున్నది. గాజా నగదానికి దగ్గరగా యుద్ధట్యాంకులను మోహరింపజేసింది. తాజా చర్యలపై అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. ఇజ్రాయిల్ చర్యలతో లక్షలాది మంది ప్రజలు నగరాన్ని వీడి బలవంతంగా తరలివెళ్లాల్సిన పరిస్థితులు అక్కడ ఏర్పడ్డాయి. వేలాది మంది ప్రజలు ప్రమాదకరమైన పరిస్థితుల్లో, ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకొని గాజా నుంచి దక్షిణ ప్రాంతంలోని తీర ప్రాంతాలకు తరలుతున్నారు. కాగా పాలస్తీనియన్లు గాజా నగరాన్ని విడిచి వెళ్లేందుకు ఉపయో గించుకో గల అదనపు నిష్క్రమణ మార్గాన్ని 48 గంటల పాటు తెరిచామని ఇజ్రాయిల్ సైన్యం ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. పౌరులను తరలించటం ద్వారా నగరాన్ని ఖాళీ చేయించటం, హమాస్‌ను ఎదుర్కోవటంలో తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు ఇజ్రాయిల్ చెప్పింది.
లక్షలాది మంది ప్రజలు తమ సొంత నగరాన్ని వీడి వెళ్లాల్సిన పరిస్థితులు గాజాలో ఏర్పడ్డాయి. గాజా నగరంలో దాదాపు పది లక్షల మంది ఉంటారని గణాంకాలు చెప్తున్నాయి. వీరిలో ఇప్పటికే 30 నుంచి 40 శాతం మంది నగరాన్ని వీడినట్టు తెలుస్తున్నది. ఇజ్రాయిల్ తెరిచినటువంటి అదనపు నిష్క్రమణ దారి వెంట ప్రమాదాలు, భయంకరమైన పరిస్థితులు, ఆహార కొరత వంటి అనేక కఠిన పరిస్థితులు ఉండటం నగర ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నది. సొంత ప్రాంతాన్ని వీడి శాశ్వతంగా తరలివెళ్లాలా అని అనేక మంది ఆందోళన చెందుతున్నారు. ”మేము గాజా నగరాన్ని వదిలి వెళ్లాలనుకున్నా.. మేము తిరిగి రాగలమని ఏదైనా హామీ ఉందా? యుద్ధం ఎప్పుడైనా ముగు స్తుందా? అందుకే నేను ఇక్కడే.. చనిపోవడానికి ఇష్టపడతాను” అని ఓ పాఠశాల ఉపాధ్యాయుడు అహ్మద్ తెలిపారు.
65 వేలు దాటిన మరణాలు
గాజా స్ట్రిప్ వెంట ఇజ్రాయిల్ మారణహోమానికి మాత్రం ఫుల్‌స్టాప్ పడటం లేదు. ఇజ్రాయెల్ బుధవారం జరిపిన దాడులు, కాల్పుల్లో కనీసం 63 మంది మరణించారు. గాజా నగరంలో ఎక్కువ ప్రాణనష్టం సంభవించిందని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. తాజా మరణాలతో ఇజ్రాయిల్ రెండేండ్లుగా జరుపుతోన్న యుద్ధంలో పాలస్తీనియన్ మరణాల సంఖ్య 65,000 దాటిందని వారు చెప్పారు. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద అనేక అవశేషాలు చిక్కుకున్నందున వాస్తవ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని పాలస్తీనియన్ అధికారులు, రెస్క్యూ టీం బృందాలు చెప్తున్నాయి. ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారిలో స్థానిక టీవీ జర్నలిస్ట్ మొహమ్మద్ అలా అల్-సవాల్హి ఉన్నారు. అలాగే రఫాలోని ఒక సహాయ కేంద్రం సమీపంలో ఇజ్రాయిల్ జరిపిన కాల్పుల్లో మరో ఐదుగురు మరణించారు. డజన్ల కొద్దీ ప్రజలు గాయపడ్డారని స్థానిక ఆరోగ్య అధికారులు తెలిపారు. అక్టోబర్ 7, 2023 నుంచి ఇజ్రాయిల్- హమాస్ మధ్య నెలకొన్న యుద్ధం ఇప్పటికీ కొనసాగుతున్నది.
అంతర్జాతీయంగా ఖండనలు
పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ జరుపుతోన్న మారణహోమంపై అంతర్జాతీయంగా మానవ హక్కుల సంఘాలు, అనేక దేశాల నుంచి ఖండనలు వెల్లువెత్తుతోన్న విషయం విదితమే. యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఇజ్రాయిల్‌పై ఆంక్షలను విధించింది. గాజాపై ఇజ్రాయిల్ భూతలదాడిని పలు దేశాలు ఖండించాయి. గాజాలో ఇజ్రాయిల్ మారణహోమం సృష్టిస్తోందనీ, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఐక్యరాజ్య సమితి ఓ నివేదికను సైతం అందించింది. అయినప్పటికీ అవేమీ పట్టని ఇజ్రాయిల్ అమానుష చర్యలతో పాలస్తీనియన్లను వారి సొంత ప్రాంతాల నుంచి బలవంతంగా తరలించే చర్యలకు దిగుతున్నది. హమాస్‌పై దాడుల పేరుతో అమాయకపు ప్రజలను ప్రాణాలను బలిగొంటున్నది. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు, పలు దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
హమాస్ అంతమే లక్ష్యం : ఇజ్రాయిల్
హమాస్ అణచివేతే లక్ష్యమంటూ ఇజ్రాయిల్ మానవహక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోంది. గాజాలో మూడు వేల మంది వరకు హమాస్ మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయిల్ అంచనా వేస్తోంది. వారిని అంతం చేయటాన్ని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా భూతలదాడులను మంగళవారం ప్రారంభించింది. కాగా గాజాను వీడి దాదాపు 400,000 మంది(40 శాతం మంది) ఇప్పటికే పారిపోయారని ఇజ్రాయిల్ అంచనా వేసింది. అయితే 190,000 మంది దక్షిణం వైపు వెళ్లారనీ, 350,000 మంది నగరం మధ్య, పశ్చిమ ప్రాంతాలకు తరలివెళ్లారని గాజా మీడియా కార్యాలయం తెలిపింది. సైనిక కార్యకలాపాలు పౌరులను దక్షిణం వైపునకు తరలించడంపై దృష్టి సారించాయని, రాబోయే రెండు నెలల్లో పోరాటం మరింత తీవ్రమవుతుందని ఇజ్రాయిల్ అధికారి ఒకరు చెప్పారు. నగరంలో దాదాపు 100,000 మంది పౌరులు ఉంటారని ఇజ్రాయిల్ అంచనా వేసిందనీ, హమాస్ మిలిటెంట్ గ్రూప్‌తో కాల్పుల విరమణ కుదిరితే ఆపరేషన్ నిలిపివేయబడవచ్చని వివరించారు.
ప్రాణభయంతో తరలివెళ్తున్న ప్రజలు
గాజా నుంచి ప్రజలు తరలి వెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రజలు తమ సామాన్లను వెంటబెట్టుకొని వెళ్తున్నారు. కొందరు వాహనాలపై పైకప్పులపై కూడా కూర్చొని వెళ్తున్నారు. ఇటు గాజాను మూడు వైపుల నుంచి ఇజ్రాయిల్ సైన్యం యుద్ధట్యాంకులతో మోహరించింది. వైమానిక దాడులతో పెద్ద పెద్ద ఇండ్లు, వాణిజ్య భవనాలను కూల్చివేస్తున్నది. మొత్తానికి గాజాను చేజిక్కించుకునే వ్యూహంతోనే ఇజ్రాయిల్ ఈ దాడులకు పాల్పడుతోందనీ, ఈ దాడులను ఆపకపోతే పాలస్తీనియన్లు చాలా మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదమున్నదని మానవ హక్కుల కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు.
పిల్లల ఆస్పత్రిపై గ్రెనేడ్లతో దాడి
రాంటిస్సీ పిల్లల ఆస్పత్రిలోని ఒక అంతస్తుపై బుధవారం ఇజ్రాయిల్ డ్రోన్ గ్రెనేడ్లను పడవేసిందని హమాస్ ప్రభుత్వ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోయినా.. దాదాపు 40 కుటుంబాలు తమ పిల్లలను తీసుకెళ్లాయని మంత్రిత్వ శాఖ వివరించింది. కాగా పాలస్తీనియన్లు కొత్తగా తెరిచిన సలాహుద్దీన్ రోడ్డును ఉపయోగించి దక్షిణం వైపు తప్పించుకోవచ్చనీ, శుక్రవారం భోజన సమయం వరకు వారికి అలా చేయడానికి సమయం ఉందని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఇటీవలి రోజుల్లో కాలినడకన, గాడిద బండ్లు, ఇతర వాహనాల్లో పారిపోతున్న పౌరుల పరిస్థితి గందరగోళంగా, ప్రమాదకరంగా మారింది.