Thursday, October 30, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంగాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ దాడులు

గాజాపై కొనసాగుతున్న ఇజ్రాయిల్‌ దాడులు

- Advertisement -

103 మంది పాలస్తీనియన్లు మృతి
అయినా కాల్పుల విరమణ ఒప్పందానికి ముప్పేమీ లేదన్న ట్రంప్‌

ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో : ఇజ్రాయిల్‌-హమాస్‌ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చిన ముప్పేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌ విమానంలో ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ తన సైనికులను హతమారిస్తే ఇజ్రాయిల్‌ ఎదురు దాడి చేస్తుందని తెలిపారు. కాగా కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇజ్రాయిల్‌ దళాలు మూడు దాడులు చేశాయని, 103 మంది ప్రాణాలు కోల్పోయారని గాజాకు చెందిన సివిల్‌ డిఫెన్స్‌ ఏజెన్సీ తెలియజేసింది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి తన దళాలపై హమాస్‌ దాడి చేసిందని ఇజ్రాయిల్‌ అంతకుముందు ఆరోపించింది.

‘నాకు తెలిసిందేమిటంటే వారు ఓ ఇజ్రాయిల్‌ సైనికుడిని చంపేశారు. కాబట్టే ఇజ్రాయిల్‌ ప్రతి దాడి జరిపింది. అలా జరపాలి కూడా’ అని ట్రంప్‌ అన్నారు. అయినప్పటికీ కాల్పుల విరమణకు ఎలాంటి విఘాతమూ కలగదని చెప్పారు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న శాంతి ప్రక్రియలో హమాస్‌ పాత్ర చాలా స్వల్పమని తెలిపారు. ‘వారు మంచిగా వ్యవహరిస్తే సంతోషంగా ఉంటారు. లేకుంటే నామరూపాలు లేకుండా పోతారు. వారి జీవితాలు ముగిసిపోతాయి’ అని వ్యాఖ్యానించారు. ఇజ్రాయిల్‌ సైనికుడికి ఏమైందో ఎవరికీ తెలియదని, అయితే సుశిక్షితుడైన వ్యక్తి కాల్పులు జరిపాడని వారు చెబుతున్నారని అన్నారు.

దాడులు చేయండి : నెతన్యాహూ ఆదేశాలు
ఇదిలావుండగా గాజాపై ‘శక్తివంతమైన దాడులు’ జరపాలని ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆదేశాలు జారీ చేశారని ఆయన కార్యాలయం తెలిపింది. గాజాలో తమ దళాలపై హమాస్‌ దాడి చేసిందని ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ చెప్పారు. ‘ఇజ్రాయిల్‌ రక్షణ దళం (ఐడీఎఫ్‌)పై హమాస్‌ ఈ రోజు దాడి చేసింది. ఇది రెడ్‌ లైన్‌ను అతిక్రమించడమే అవుతుంది. ఐడీఎఫ్‌ కూడా గట్టిగానే స్పందించింది’ అని ఆయన అన్నారు.

హమాస్‌ వద్ద బందీలుగా ఉండి చనిపోయిన వారి మృతదేహాల అప్పగింతలో జాప్యం జరుగుతోందని ఇజ్రాయిల్‌ ఆరోపిస్తుండగా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను కనుగొనడం కష్టంగా ఉన్నదని హమాస్‌ తెలిపింది. మంగళవారం రెండు మృతదేహాలను కనుగొన్నామని చెప్పింది. కాగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ గాజాలో దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇక అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు లేనట్లే కన్పిస్తోంది. నగరంలో ఇజ్రాయిల్‌, హమాస్‌ మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని, ఈ పరిస్థితులలో మరో యుద్ధం తప్పేలా లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -