Wednesday, December 10, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎన్‌ఆర్‌డబ్ల్యూ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిల్‌ దళాల దాడి..

యూఎన్‌ఆర్‌డబ్ల్యూ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిల్‌ దళాల దాడి..

- Advertisement -

జెరూసలేం: ఆక్రమిత తూర్పు జెరూసలేంలోని పాలస్తీనా శరణార్థుల కోసం ఏర్పాటుచేసిన యునైటెడ్‌ నేషన్స్‌ రిలీఫ్‌ అండ్‌ వర్క్స్‌ ఏజెన్సీ ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయిల్‌ దళాలు దాడికి పాల్పడ్డాయి. ఈ క్రమంలో అక్కడి సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో పాటు.. కార్యాలయంపై ఉన్న ఐరాస జెండాను తీసేసి ఇజ్రాయిల్‌ జెండాను పెట్టారు. ఈ విషయాన్ని ఆ సంస్థకు చెందిన కమిషనర్‌ జనరల్‌ ఫిలిప్‌ లజారిని ఎక్స్‌ ద్వారా వెల్లడించారు. షేక్‌ జర్రాలోని సంస్థ ప్రాంగణంలోకి ఇజ్రాయిల్‌ దళాలు, మున్సిపల్‌ అధికారులు బలవంతంగా ప్రవేశించారని తెలిపారు. అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేసి.. ఫర్నీచర్‌, ఐటీ పరికరాలతో సహా ఇతర వస్తువుల న్నింటినీ స్వాధీనం చేసుకున్నట్టు వెల్ల్లడించారు. కార్యాలయంపై ఉన్న యూఎన్‌ జెండాను తీసేసి.. దాని స్థానంలో ఇజ్రాయిల్‌ జెండాను ఉంచారన్నారు. ఈ ఘటన ను ఆయన తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయిల్‌ ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని మండిపడ్డారు. ఐరాసలో సభ్యదేశమైన ఇజ్రాయిల్‌ తన బాధ్యతను విస్మరించిందన్నారు. ఐరాస సంస్థ తమ దేశంలో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకూడదని టెల్‌అవీవ్‌ అధికారులు ఆదేశించినప్పటి నుంచి యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ తన భవనాన్ని ఉపయోగించడం లేదు. 2023 అక్టోబరు 7న హమాస్‌ జరిపిన దాడుల్లో ఆ సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారని ఇజ్రాయిల్‌ ఆరోపించింది. ఈ క్రమంలో తమ దేశంలో యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ కార్యకలాపాలను నిలిపివేసింది. అయితే, టెల్‌అవీవ్‌ ఆరోపణల ను ఇది ఖండించింది. అంతర్జాతీయ న్యాయస్థానం కూడా ఈ ఆరోపణలు నిరాధార మైనవిగా పేర్కొంది. యూఎన్‌ఆర్‌డబ్ల్యూ గాజా, వెస్ట్‌ బ్యాంక్‌లో పనిచేస్తున్న అతిపెద్ద మానవతా సహాయ సంస్థ. ఇజ్రాయిల్‌ దాడుల్లో నిరాశ్రయులైన పాలస్తీనియన్లకు ఆశ్రయం కల్పించడం, పాఠశాల విద్య అందించడంతో పాటు వైద్య సేవలు అందిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -