43 మంది పాలస్తీనియన్లు మృతి
మృతుల్లో పలువురు చిన్నారులు
గాజా : గాజాపై ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 40 మందికి పైగా పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో పలువురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇప్పటి వరకు క్షిపణిదాడులతో గాజాను అస్తవ్యస్తం చేసిన ఇజ్రాయిల్.. ఆ నగరంపై మిలిటరీ దాడులకు కూడా ఉపక్రమించిన విషయం విదితమే. అటు వైమానిక, ఇటు మిలిటరీ దాడులతో గాజాను తన గుప్పెట్లోకి తెచ్చుకొనే ప్రయత్నాన్ని ఇజ్రాయిల్ చేస్తున్నది. తాజాగా మధ్య, దక్షిణ గాజాపై ఇజ్రాయిల్ జరిపిన మిలిటరీ దాడుల్లో 43 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఇజ్రాయిల్ చర్యలను ఖండిస్తూ అంతర్జాతీయ సమాజం నుంచి చాలా ఒత్తిడి వస్తోంది. అయినప్పటికీ గాజాపై ఇజ్రాయిల్ తన దాడులను మాత్రం ఆపటం లేదు. దీంతో పదుల సంఖ్యలో అమాయకపు పాలస్తీనియన్లు మృతి చెందుతున్నారు.
నెతన్యాహుపై స్లొవేనియా ట్రావెల్ బ్యాన్
గాజాలో మారణహోమం సృష్టిస్తోన్న ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై యూఎస్ కేంద్రంగా పని చేసే కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ (సీఏఐఆర్) ఆగ్రహం వ్యక్తం చేసింది. యూఎన్ జనరల్ అసెంబ్లీలో పాల్గొనటానికి నెతన్యాహు న్యూయార్క్‌కు వచ్చే అవకాశం ఉండటంతో ఆయనపై ట్రావెల్ బ్యాన్ విధించాలని కోరింది. కాగా నెతన్యాహుపై ట్రావెల్ బ్యాన్ విధించిన తొలి ఈయూ దేశంగా స్లొవేనియా నిలిచింది. ఇంర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ (ఐసీసీ) అరెస్ట్ వారెంట్‌ను పేర్కొంటూ నెతన్యాహుపై ఈ నిషేధాన్ని విధించింది. స్లొవేనియా తీసుకున్న నిర్ణయాన్ని సీఏఐఆర్ సమర్థించింది. అమెరికాతో పాటు ఇతర దేశౄలు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకోవాలని కోరింది.