నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత పర్యటన మళ్లీ రద్దయ్యింది. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన ఆత్మహుతి బాంబు పేలుళ్ల ఘటనే ఇందుకు కారణమని తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆయన పర్యటన రద్దయినట్లు సమాచారం. ఈ ఏడాదిలో నెతన్యాహు భారత పర్యటన రద్దుకావడం ఇది మూడోసారి కావడం గమనార్హం.
నెతన్యాహు చివరిసారిగా 2018లో భారత్‌కు వచ్చారు. ఆ తర్వాత ఈ ఏడాది పర్యటించాలనుకోగా పలు కారణాలతో రద్దవుతూనే ఉంది. సెప్టెంబర్ 9న ఆయన ఇండియాకు రావాల్సి ఉంది. అయితే అక్కడ బిజీ షెడ్యూల్ ఉండటంతో రాలేకపోయారు. తాజాగా డిసెంబర్ నెలలో ప్రధాని మోడీతో సమావేశం కావాల్సి ఉండగా ఢిల్లీలో భద్రతా కారణాల దృష్ట్యా మరోసారి రద్దైంది.
ఇక ఈ ఏడాది ఆయన భారత్‌లో పర్యటించే అవకాశాలు లేనట్లే. 2026లో ఆయన పర్యటన ఉండేలా ప్రణాళికలు సాగుతున్నాయి. కానీ దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. భారత ప్రధాని మోడీ 2017లో ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో పర్యటించారు. ఆ తర్వాత 2018 జనవరిలో నెతన్యాహు భారత్‌ను సందర్శించారు. దాంతో ఇరు దేశాల ప్రధానుల మధ్య సన్నిహిత సంబంధాలు నెలకొన్నాయి.



