Monday, January 12, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంబరితెగించిన ఇజ్రాయిల్‌ సెటిలర్లు

బరితెగించిన ఇజ్రాయిల్‌ సెటిలర్లు

- Advertisement -

– పాలస్తీనా వృద్ధుడిపై తీవ్ర దాడి
– గాయాలతో ఆస్పత్రిలో చికిత్స
– ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో ఘటన
టెల్‌ అవీవ్‌ :
కొందరు ఇజ్రాయిల్‌ సెటిలర్లు రెచ్చిపోయారు. ఆక్రమిత్‌ వెస్ట్‌బ్యాంక్‌లో ఒక పాలస్తీనా వృద్ధుడిపై ఘోరంగా దాడికి తెగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బటయకు వచ్చింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ముసుగులు ధరించిన కొందరు దుండగులు కర్రలు పట్టుకొని ఒక మొక్కల నర్సరీపై దాడి చేశారు. అందులో పని చేస్తున్న ఒక పాలస్తీనా వ్యక్తిని తీవ్రంగా కొట్టి గాయపర్చారు. కొందరు ప్రత్యక్ష సాక్షులు ఈ విషయాన్ని తెలిపారు. అసోసియేటెడ్‌ ప్రెస్‌ సంపాదించిన వీడియోలో కూడా దృశ్యాలు కనిపించాయి.

నల్లటి దుస్తులు ధరించిన వ్యక్తులు, తమ ముఖాలను కప్పుకొని నేలపై పడిపోయి ఉన్న ఒక వ్యక్తిని కొట్టడం, తన్నడం సీసీటీవీ వీడియోలో రికార్డయ్యాయి. దాడిని ప్రత్యక్షంగా చూసినవారు, నర్సరీ యజమానుల కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు దాడి గురించి వివరించారు. డెయిర్‌ షరఫ్‌ అనే ఉత్తర వెస్ట్‌బ్యాంక్‌ గ్రామంలో ఉన్న నర్సరీ నుంచి పారిపోతుండగా.. బాసిం సలేహ్‌ యాసిన్‌ (67) అనే పాలస్తీనా వ్యక్తిని ఇజ్రాయిలీ సెటిలర్లు కొట్టారని చెప్పారు. చివరకు యాసిన్‌ ఆ దుండగుల దెబ్బలకు తట్టుకోలేక రోడ్డుపై నిస్సహాయ స్థితిలో పడిపోయాడు. కాగా యాసిన్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన చేతి ఎముకలు విరిగాయి. ముఖం, ఛాతీ, వెన్నులో తీవ్ర గాయాలున్నాయి. అలాగే నర్సరీ వద్ద ఉన్న నాలుగు కార్లను దుండగులు తగలబెట్టి పూర్తిగా ధ్వంసం చేశారు.

పెరుగుతున్న సెటిలర్‌ హింస
తాజా దాడి ఘటన వెస్ట్‌బ్యాంక్‌లో మళ్లీ ఆందోళన రేపుతున్నది. ఇది వెస్ట్‌ బ్యాంక్‌లో పెరుగుతున్న ఇజ్రాయిలీ సెటిలర్‌ హింసకు తాజా ఉదాహరణగా చెప్పొచ్చు. గత అక్టోబర్‌, నవంబర్‌లలో జరిగిన పాలస్తీనా ఒలివ్‌ పంట కాలంలో ఈ దాడులు తీవ్రంగా పెరిగాయి. అప్పటి నుంచి ఇవి నిరంతరంగా కొనసాగుతున్నాయి.ఈ దాడి ఘటన లపై ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పందించారు. ఇది కొద్ది మంది అతివాదులు చేసిన పనిగా తెలిపారు. అయితే మానవ హక్కుల సంస్థలు, పాలస్తీనియులు మాత్రం ఇది కొద్ది మంది చేసిన పని కాదనీ, వెస్ట్‌బ్యాంక్‌ అంతటా రోజువారీగా జరుగుతున్న సమస్యగా చెప్తున్నారు.

ఏడాదిలో మూడో దాడి
ఈ నర్సరీపై ఒక ఏడాదిలోనే మూడోసారి జరిగిందని యజమానుల కుటుంబ సభ్యుల్లో ఒకరు తెలిపారు. సెప్టెంబర్‌లో జరిగిన దాడిలో కార్యాలయాలు, సౌకర్యాలు ధ్వంసమయ్యాయనీ, వ్యాపారానికి 6 లక్షల డాలర్లకు పైగా నష్టం వాటిల్లిందని చెప్పారు. గురువారం సెటిలర్లు వస్తున్నారని కార్మికులు గమనించి అక్కడి నుంచి పారిపోయారు. అయితే యాసిన్‌కు వినికిడి లోపం ఉండటంతో ఆయనకు తమ హెచ్చరికలు వినపడలేదని కుటుంబసభ్యుడు తెలిపాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -