Monday, May 5, 2025
Homeరాష్ట్రీయంపాలస్తీనా ప్రజలపైఇజ్రాయిల్‌ హత్యాకాండను ఆపాలి

పాలస్తీనా ప్రజలపైఇజ్రాయిల్‌ హత్యాకాండను ఆపాలి

- Advertisement -

– సీపీఐ, సీపీఐ(ఎం) నేతలు అజీజ్‌పాషా, ఎమ్‌డీ అబ్బాస్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ హత్యాకాండను ఆపాలనీ, ఈ విషయంలో ప్రపంచ దేశాలు చొరవ తీసుకోవాలని మాజీ ఎంపీ, సీపీఐ సీనియర్‌ నేత సయ్యద్‌ అజీజ్‌పాషా, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎమ్‌డీ.అబ్బాస్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఉర్దూఘర్‌లోని రాజకీయ పార్టీల సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్‌ చేస్తున్న దాష్టీక దాడులను తీవ్రంగా ఖండించారు.
పాలస్తీనా జాతి హత్యాకాండ జరుగుతున్నదనీ, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో నిరసన వెల్లువ వస్తున్నప్పటికీ అంతర్జాతీయ సమాజం యొక్క అభిప్రాయాన్ని కూడా అమెరికా బేఖాతర్‌ చేస్తూ ఇజ్రాయిల్‌ దుర్మార్గాలకి అండగా నిలబడుతున్నదని విమర్శించారు. అమెరికా తన సామ్రాజ్యవాద నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంటున్నదని విమర్శించారు. గాజా భూభాగం మొత్తం తనకు కావాలనీ, పాలస్తీనా ప్రజలు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళాలని ట్రంపు నిసిగ్గుగా ప్రకటించడం అత్యంత దుర్మార్గమని అన్నారు. పాలస్తీనా ప్రజల మాతృభూమిని లాక్కునే కుట్రలని ప్రజలందరూ ఖండించాలని కోరారు. ఇజ్రాయిల్‌ చర్యలు మానవ హక్కుల ఉల్లంఘన, అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన అన్నారు. పాలస్తీనా ప్రజల ఆత్మగౌరవం, స్వాతంత్య్రం కోసం జరుగుతున్న పోరాటానికి సంఘీభావం తెలిపారు. పిల్లలు, మహిళలు, అమాయక పౌరులపై జరుగుతున్న హింసను వెంటనే ఆపాలనీ, గాజాలో బాంబు దాడులను నిలిపేయాలని డిమాండ్‌ చేశారు. సీపీఎం, సీపీఐ పార్టీలు పాలస్తీనా ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి ఎల్లప్పుడూ మద్దతిస్తాయనీ, ఈ హింసాత్మక దాడులను అంతర్జాతీయ సమాజం ఖండించాలని సదస్సు ద్వారా పిలుపు ఇస్తున్నామని అన్నారు.
ఈ సమస్యపై అంతర్జాతీయ సమాజం తక్షణ చర్యలు తీసుకోవాలనీ, శాంతి న్యాయం కోసం కృషి చేయాలని కోరారు. సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు అఫ్జల్‌, ఖుద్దూస్‌ ఘోరీ, ఉస్మాన్‌ హల్‌ హాజరి, అన్వర్‌ ఖాన్‌, ముజాయిద్‌ హష్మీ, మునీర్‌ పటేల్‌ తదితరులు పాల్గొని పాలస్తీనా ప్రజలకు మద్దతుగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఇజ్రాయిల్‌ దాడులను నిలిపివేయాలని, పాలస్తీనా ప్రజలకు న్యాయం చేయాలని సమావేశంలో ఒక తీర్మానం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -