లారీల కొరత తీర్చాలి : రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్
నవతెలంగాణ-జోగిపేట
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలు తక్షణమే పరిష్కరించి, కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం చందంపేట, అల్మాయిపేట, అందోల్ గ్రామాల్లో బుధవారం రైతు సంఘం నాయకులు పర్యటించారు. తడిసిన ధాన్యాన్ని పరిశీలించి.. రైతులతో మాట్లాడి ధైౖర్యంగా ఉండాలని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ.. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనాలని చెప్పినా అమలు కావటం లేదన్నారు. పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా ధాన్యం కాంటా వేయడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తూకం వేసిన ధాన్యాన్ని గోదాములకు తరలించడంలో, సకాలంలో లారీలు పంపించడంలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అనేక కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయిందన్నారు. దీనికి బాధ్యులైన అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్షాలకు తడిసి అనేక కేంద్రాల్లో వడ్లు మొలకెత్తాయని, వెంటనే తడిసిన వడ్లను తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని అన్నారు. తేమ, తాలు, తరుగు పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. తూకం వేసిన ధాన్యం సైతం 15 రోజులకు పైగా కేంద్రాల్లోనే ఉండటం దుర్మార్గమన్నారు.
అధికారుల మధ్య కొరవడిన సమన్వయం
ధాన్యం కొనుగోళ్లలో అధికారుల మధ్య సమన్వయం సరిగ్గా లేదని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు అన్నారు. రైతులు తమ సమస్యలు పరిష్కరించాలనీ, లారీలు పంపించాలని వారం రోజులుగా అడుగుతున్నా అధికారులు స్పందించటం లేదని అన్నారు. లారీలు పంపని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రైస్ మిల్ వారు క్వింటాల్‌కు 6-7 కిలోల తరుగు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతులను నిలువు దోపిడీ చేయడంపై విచారణ జరపాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కె.రాజయ్య, సీపీఐ(ఎం) అందోల్ డివిజన్ కార్యదర్శి డి.విద్యసాగర్, రైతు సంఘం నాయకులు ప్రభాకర్, మల్లారెడ్డి, రైతులు సత్యనారాయణ, వెంకట్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాస్, అర్జున్ తదితరులు ఉన్నారు.
– రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గొల్లపల్లి జయరాజు
కొనుగోలు కేంద్రాల్లో సమస్యలు పరిష్కరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES