వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడేలా చేస్తుంది
ఇది అన్నదాతల భవిష్యత్తుకు సంబంధించిన విషయం
కేంద్రం తీరుపై రాహుల్ తీవ్ర ఆగ్రహం
అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ప్రధానికి ఐదు ప్రశ్నలు
న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని కండ్లారా చూస్తున్నామనీ, దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడేలా చేస్తోందని ఉద్ఘాటించారు. ఇది తాత్కాలిక అంశం కాదనీ, రైతుల భవిష్యత్తుకు సంబంధించిందన్న ఆయన.. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి ఐదు ప్రశ్నలు సంధించారు. ”డ్రైడ్ డిస్టిల్లర్స్ గ్రెయిన్స్ (డీడీజీ) దిగుమతి చేసుకోవడం అంటే ఏమిటీ? జన్యుమార్పిడి చేసిన (జీఎం) అమెరికన్ మొక్కజొన్న నుంచి తయారైన దాణాను భారతీయ పశువులకు తినిపించడం కాదా? ఇది మన పాల ఉత్పత్తి అమెరికా వ్యవసాయ పరిశ్రమపై ఆధారపడేలా చేయదా? జన్యుమార్పిడి చేసిన సోయాబీన్ ఆయిల్‌ను అనుమతిస్తే.. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్‌లతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న సోయాబీన్ రైతులపై ప్రభావం పడదా?
మీరు చెబుతున్న ఆ ‘అదనపు ఉత్పత్తులు’ అంటే ఏమిటీ..? కాలక్రమేణా పప్పుధాన్యాలతోపాటు ఇతర అమెరికన్ పంటల దిగుమతులకు ద్వారాలు తెరవడమేనా? వాణిజ్యేతర అడ్డంకులను తొలగించడం అంటే ఏమిటీ? జన్యుమార్పిడి పంటలపై తన వైఖరిని మార్చడం, ధాన్యం సేకరణను తగ్గించడం, కనీస మద్దతు ధర లేదా బోనస్‌లను తగ్గించడంపై భవిష్యత్తులో భారత్ ఒత్తిడిని ఎదుర్కోనుందా? ఒకసారి ద్వారాలు తెరిచిన తర్వాత వీటిలో మరిన్ని పంటలను చేర్చకుండా ఎలా ఆపగలం? వీటికి ఏమైనా రక్షణ చర్యలు ఉన్నాయా? లేదా ఇలాగే ప్రతి ఒప్పందంలో మరిన్ని పంటలను ఈ జాబితాలో చేరుస్తారా?” అని రాహుల్ గాంధీ కేంద్రాన్ని ప్రశ్నించారు. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం పట్టును సాధించేందుకు అనుమతి ఇస్తున్నామా? అని ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు.



