డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్
నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ
మౌలిక వసతులు లేని ప్రభుత్వ పాఠశాలలను నాలుగైదు కలిపి ఒకే సముదాయంలో నిర్వహించాలని తద్వారా ఉపాధ్యాయుల కొరత తీరుతుందని విద్యార్థులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తామని ప్రభుత్వం చేసే ఆలోచన సరైనది కాదని పరోక్షంగా ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడమేనని వెంటనే ప్రభుత్వం ఈ ఆలోచనను విరమించుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ప్రతి ప్రభుత్వ పాఠశాలకు అన్ని మౌలిక వసతులను కల్పించి ప్రతి సంవత్సరం డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టి విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చేలాగా ఉదయం అల్పాహారం , మధ్యాహ్నం నాణ్యమైన బలవర్ధక భోజనం, సాయంత్రం స్నాక్స్ తో సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చాలని అన్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్లో విద్యకు ప్రాధాన్యం ఇచ్చి కనీసం 20 శాతం నిధులు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలందరికీ విద్యనందించే బాధ్యతల నుండి ప్రభుత్వం తప్పుకోవద్దని అన్నారు.
విద్యను వ్యాపారంగా నిర్వహించుకోవచ్చని రాజ్యాంగంలో ఎక్కడ చెప్పబడలేదు. కేవలం సామాజిక కోణంలో సేవా దృక్పథంతో మాత్రమే విద్యాసంస్థలు నెలకొల్ప వచ్చని మాత్రమే రాజ్యాంగంలో ఉంది. నేడు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా విద్యపై కోట్లల్లో వ్యాపారం నిర్వహించడం అందుకు ప్రభుత్వం (అనుమతులు ఇస్తూ) సహకరించడం తద్వారా ప్రజల సంపాదనలో అధిక భాగం విద్యకు కేటాయించుకోవలసి రావడం ఒకరకంగా ప్రభుత్వ విధానాలు రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది అని , ప్రైవేట్ పాఠశాలలకు ఇస్తున్న అనుమతులను నిలిపివేసి దశల వారిగా ఇట్టి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని నడపాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.