మహిళలకు సద్గుల బతుకమ్మ శుభాకాంక్షలు: స్వరూప
నవతెలంగాణ-పాలకుర్తి
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన ప్రజా ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యతను కల్పించడం అభినందనీయమని మండలంలోని బమ్మెర గ్రామానికి చెందిన మాచర్ల స్వరూప అన్నారు. ఆదివారం ఆమె మాట్లాడుతూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ప్రజా ప్రభుత్వ సహసపేతమైన నిర్ణయానికి కృతజ్ఞతలు అన్నారు. 42 శాతం రిజర్వేషన్లలో బీసీ మహిళలకు స్థానిక సంస్థలలో పోటీ చేసే అవకాశం కల్పించడం మహిళా సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. మహిళా శక్తిని సంఘటితం చేసేందుకు, మహిళలను రాజకీయంగా చైతన్యం చేసేందుకు, చట్టసభల్లో అవకాశం కల్పించేందుకు ప్రజా ప్రభుత్వం చేస్తున్న కృషికి మహిళలందరూ రుణపడి ఉంటారని తెలిపారు.
బీసీ రిజర్వేషన్లలో పాలకుర్తి ఎంపీపీ, జడ్పిటిసిలుగా బీసీ మహిళలకు అవకాశం కల్పించడం, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా బీసీ మహిళలు పోటీ చేసేందుకు రిజర్వేషన్లను ప్రకటించడం మహిళా శక్తి అభ్యున్నతికి దోహదపడుతుందన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లను సద్వినియోగం చేసుకొని మహిళలకు కేటాయించిన స్థానాల్లో విజయం సాధించి పారదర్శకమైన పాలనను అందించేందుకు మహిళలు తెలంగాణ సమాజానికే ఆదర్శం కావాలని సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ఆదర్శంగా నిలిచే సభ్యుల బతుకమ్మను ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకోవాలని, మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.