Friday, November 14, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుఇద్దరికీ కీలకమే

ఇద్దరికీ కీలకమే

- Advertisement -

సీఎం రేవంత్‌రెడ్డికి, కేటీఆర్‌కు జూబ్లీహిల్స్‌ ప్రతిష్టాత్మకం
విజయంపై అధికార, ప్రధాన ప్రతిపక్షాల గంపెడాశలు
గెలిచి స్థానికంతోపాటు జీహెచ్‌ఎంసీలో పట్టు సాధించాలన్నది రేవంత్‌రెడ్డి వ్యూహం
బైపోల్‌లో సక్సెస్‌తో వరుస ఓటముల నుంచి బయటపడాలన్నది కేటీఆర్‌ యోచన
విజయం ఎవరిని వరించేనో…?

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇద్దరు నేతలకూ కీలకమే.. రెండు పార్టీలకూ ప్రతిష్టాత్మకమే. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఇటు అధికార పార్టీ కాంగ్రెస్‌కు, అటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు ముచ్చెమటలు పట్టించింది. ఆ రెండు పార్టీలకు వెన్నులో వణుకు పుట్టించింది. ఉప ఎన్నిక ఫలితం శుక్రవారం తేలనుండటంతో రెండు పార్టీలూ గెలుపుపై గంపెడాశలు పెట్టుకున్నాయి. బై పోల్‌లో గెలుపోటములు హస్తం, గులాబీ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపనుండటమే దీనికి కారణం. ఉప ఎన్నిక జయాపజయాలతో రెండు పార్టీల్లో లెక్కలు, సమీకరణాలు మారిపోతాయనే చర్చ ఇప్పుడు సర్వత్రా కొనసాగుతోంది. సీఎం రేవంత్‌…పీసీసీ అధ్యక్షుడి హోదాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను విజయ తీరాలకు చేర్చారు.

దాంతో సీనియర్లను కాదని పార్టీ అధిష్టానం ఆయనకు ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రేవంత్‌కు అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ ఢోకా లేకుండా పోయింది. ఇటీవల మంత్రుల మధ్య విబేధాలు పొడచూపినా… సీఎం తన రాజకీయ చాణక్యంతో వాటిని సున్నితంగా పరిష్కరిం చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు నిధుల కొరత వేధిస్తున్నా…గత బీఆర్‌ఎస్‌ హయాంలోని అప్పులు, వాటికి వడ్డీలు, ఇతరత్రా ఆర్థిక కష్టాల గురించి ప్రజలకు విడమరిచి చెప్పటం ద్వారా అధికార పార్టీ ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్తపడింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక వచ్చింది.

ఇక్కడ గెలవటం సీఎంకు, కాంగ్రెస్‌కు అత్యంత కీలకమైంది. ఎందుకంటే… బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టు పరిధిలో ఉన్నందున, న్యాయస్థానం తీర్పు వెలువడిన వెంటన స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది సీఎం వ్యూహంగా ఉన్నది. మరికొద్ది నెలల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎమ్‌సీ) ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా హైదరాబాద్‌పై పట్టు సాధించటం, తద్వారా జీహెచ్‌ఎమ్‌సీతోపాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఇటీవలే నేతలకు దిశా నిర్దేశం చేశారు. అందుకే ఆయన జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. తన దృష్టినంతా బైపోల్‌పై కేంద్రీకరించి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను రంగంలోకి దించారు. అందువల్ల ఉప ఎన్నిక విజయంపై కాంగ్రెస్‌ నేతలు ధీమాగా ఉన్నారు.

ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌కు కూడా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఒకరకంగా ఇది ఆ పార్టీకి జీవన్మరణ సమస్య అని చెప్పొచ్చు. 2014 నుంచి ఒకటీ అరా మినహా… అన్ని ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించిన ఆ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికలు పెద్ద షాక్‌నిచ్చాయి. ముచ్చటగా మూడోసారి గెలిచి, తెలంగాణలో రికార్డు సృష్టిద్దామనుకున్న గులాబీ దళం ఆశలపై ప్రజలు నీళ్లు చల్లారు. కారు పార్టీని ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఆ షాక్‌ నుంచి తేరుకోకముందే పార్లమెంటు ఎన్నికల రూపంలో బీఆర్‌ఎస్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి (2001) ఎప్పుడూ లేని విధంగా ఒక్క ఎంపీ సీటు కూడా గెలవకుండా చతికిలబడింది.

ఆ తర్వాత సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ తన సిట్టింగు సీటును కోల్పోయి మరింత డీలా పడింది. దీంతో ప్రస్తుత జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో గెలవటం ద్వారా పోయిన ప్రతిష్టను కాపాడుకోవాలని, క్యాడర్‌లో జోష్‌ నింపాలని ఆ పార్టీ భావించింది. అయితే అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ను వదిలి ప్రచారానికి రాకపోవటం, తండ్రి మరణం వల్ల మాజీ మంత్రి హరీశ్‌రావు క్యాంపెయిన్‌కు దూరంగా ఉండటం, గతంలో బీఆర్‌ఎస్‌ ప్రచారకర్తల్లో ఒకరుగా ఉన్న కవితను పార్టీ నుంచి బహిష్కరించటం తదితరాంశాలు గులాబీ పార్టీకి ప్రతికూలంగా మారాయి. దీంతో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆరే… ఉప ఎన్నిక బాధ్యత మొత్తాన్ని భుజాన వేసుకున్నారు. అందువల్ల ఇప్పుడు జూబ్లీహిల్స్‌లో గెలుపోటములు బీఆర్‌ఎస్‌కు, కేటీఆర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకం కానున్నాయి. మరి శుక్రవారం విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -