– కులం, మతం ప్రాతిపదికన వివక్ష రాజ్యాంగ విరుద్ధం
– సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్
నవతెలంగాణ-సిటీబ్యూరో
భారత రాజ్యాంగం.. సమానత్వం, సౌభ్రాతృత్వం పునాదుల మీద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రూపొందించారనీ, ఆ రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిది అనీ, న్యాయమూర్తులు మరింత బాధ్యతగా వ్యవహరించి రాజ్యాంగ స్ఫూర్తితో న్యాయం అందేలా చూడాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ అన్నారు. శనివారం తెలంగాణ న్యాయమూర్తుల సంఘం, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్‌్ అకాడమీలో సెమినార్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ‘రాజ్యాంగ నైతికత-జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర’ అనే అంశంపై ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులకు పలు సూచనలు చేశారు. కులం, మతం ప్రాతిపదికన వివక్షత రాజ్యాంగ విరుద్ధమనీ, ఓ ఎస్సీ అంగన్‌వాడీ టీచర్ భోజనం వండితే తమ పిల్లలు తినరని కొందరు పేర్కొన్న ఉదంతాన్ని చూశామన్నారు. ఇంకా ఇలాంటి పరిస్థితి ఉండటం బాధాకరమన్నారు. న్యాయ వ్యవస్థ ఓ పిరమిడ్ లాంటిదనీ, అందులో కింద ఉండే బేస్ కిందిస్థాయి కోర్టులని తెలిపారు. అవి ఎంత బలంగా ఉంటే న్యాయ వ్యవస్థ అంత బలోపేతంగా పని చేస్తుందని అన్నారు.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ప్రజా విశ్వాసం, న్యాయం మధ్య అంతరాన్ని తగ్గించడంలో జిల్లా న్యాయవ్యవస్థ పాత్ర ఉంటుందని తెలిపారు. జ్యుడీషియరీ అంటే ట్రయల్ కోర్టులన్నారు. ఇది న్యాయవ్యవస్థకు వెన్నెముక లాంటిదనీ, తక్కువ భావన కూడదని సూచించారు. ముందుగా హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్ మౌషుమి భట్టాచార్య స్వాగత ఉపన్యాసం చేశారు. అదనపు జిల్లా న్యాయమూర్తి, న్యాయమూర్తుల సంఘం ప్రధాన కార్యదర్శి కె.మురళీ మోహన్ గౌరవ అతిథులను వేదికపైకి ఆహ్వానించి సమన్వయం చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా సెషన్స్ జడ్జి, తెలంగాణ న్యాయమూర్తుల సంఘం అధ్యక్షులు జి.రాజగోపాల్, సంఘం జనరల్ సెక్రెటరీ కె.మురళి మోహన్, సభ్యరాలు పూజ, రిజిస్ట్రార్ జనరల్, తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్ ఎస్.ఎన్ శ్రీదేవి, సీనియర్ ఫాకల్టీ మెంబర్స్ డాక్టర్ సున్నం శ్రీనివాస రెడ్డి, రాధాకృష్ణ చాహవాన్, జస్టిస్ నవీన్‌రావు, టీజీఎల్‌ఎస్‌ఏ సభ్యకార్యదర్శి సీహెచ్ పంచాక్షరీ, న్యాయమూర్తుల సంఘం నేతలు, రాష్ట్రంలోని న్యాయమూర్తులందరూ ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా, వర్చ్‌వల్‌గా పాల్గొన్నారు.
రాజ్యాంగ విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



