ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమవుతుందని శారాజిపేట మండల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీ కుమారి పేర్కొన్నారు. గురువారం పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలు పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించే ముఖ్య కేంద్రాలుగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు, మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని సూచించారు.
ప్రైవేట్ పాఠశాలల వైపు కొంతమంది తల్లిదండ్రులు మొగ్గు చూపడం బాధాకరమని పేర్కొంటూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రజలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో చదువుకుని పాఠశాలకు నిరంతరం హాజరవుతూ మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు పి. భాస్కరాచారి మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను నమ్మాలని కోరారు. బడిబాట కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికీ వెళ్లి విద్య ప్రాముఖ్యతను వివరించి, పాఠశాలల్లో చేరికలను పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏ. నరేష్, వార్డ్ మెంబర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.



