Saturday, March 21, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుజనాకర్షణే తప్ప వాస్తవికత ఏది?

జనాకర్షణే తప్ప వాస్తవికత ఏది?

- Advertisement -

ప్రజా సంఘాలు
బడ్జెట్‌లో విద్యకు సరిపోని కేటాయింపులు
పెండింగ్‌ బిల్లులు, పీఆర్సీ ప్రస్తావన లేకపోవడం విచారకరం
ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ఉచిత వైద్యం స్వాగతిస్తున్నాం : టీఎస్‌ యూటీఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర బడ్జెట్‌లో జనాకర్షక పథకాలకే తప్ప ప్రస్తుత వ్యవస్థను బాగుచేసే విధంగా విద్యారంగానికి కేటాయింపులు లేవని టీఎస్‌ యూటీఎఫ్‌ అభిప్రాయపడింది. ఈ మేరకు శుక్రవారం టీఎస్‌ యూటీఎఫ్‌ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి చావ రవి, ఎ.వెంకట్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ.3,24,234కోట్ల బడ్జెట్‌ లో విద్య, మానవ వనరులకు రూ.26,674కోట్లు మాత్రమే కేటాయించిందనీ, ఇది మొత్తం బడ్జెట్‌లో 8.2 శాతమని తెలిపారు. ఉదయం అల్పాహారం, ఇంటర్‌ వరకు మధ్యాహ్నభోజనం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను ఆహ్వానిం చారు.

గతేడాది కంటే రూ.3,566 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ పెంచిన మొత్తం బ్రేక్‌ ఫాస్ట్‌, ఇంటర్‌ వరకు మధ్యాహ్న భోజన పథకం విస్తరణ, తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు కోసమే సరిపోవచ్చన్నారు. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల గురించి, మధ్యాహ్న భోజనం నాణ్యత పెంపు గురించి అదనపు నిధుల కేటాయింపు ప్రస్తావన లేదని అసంతప్తి వ్యక్తం చేశారు. గతేడాది 7.58 శాతం కేటాయించగా, ఈ ఏడాది 8.22 శాతం కేటాయించారు. విద్యకు 15 కేటాయి స్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చినా వరుసగా 3వ బడ్జెట్‌లో కూడా నెరవేరలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను సమీక్షించి విద్యకు కనీసం 15శాతం కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

ఉద్యోగుల ఆరోగ్య పథకానికి రూ.1,056 కోట్లు కేటాయింపును స్వాగతిస్తున్నాం
మరి పీఆర్సీ సంగతేంటి?
ఉద్యోగుల ఆరోగ్య పథకానికి అయ్యే ఖర్చు మొత్తం రూ.1,056 కోట్లు రాష్ట్ర ప్రభుత్వమే భరించి ఉద్యోగులకు, పెన్షనర్లకు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు డిజిటల్‌ హెల్త్‌ కార్డులపై నగదు రహిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించడాన్ని వారు స్వాగతించారు. అదే సందర్భంలో తెలంగాణ రెండో పీఆర్సీ అమలు గురించి గానీ, అదనపు నిధుల కేటాయింపు గురించి గానీ బడ్జెట్‌లో మాట మాత్రం గానైనా ప్రస్తావించకపోవడం ఉద్యోగ, ఉపాధ్యాయులను నిరాశకు గురిచేసిందని చెప్పారు.

ఇప్పటికే పిఆర్సీ అమలు 33 నెలలు ఆలస్యమైందనీ, అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో మంచి పిఆర్సీ అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని 27 నెలలు గడుస్తున్నా నిలబెట్టుకోకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. పెండింగ్‌ డీఏలు, పెండింగ్‌ బిల్లులు, 2024 మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు గురించిన ప్రస్తావనే లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ, పెండింగ్‌ బిల్లులు, బకాయిల గురించి కూడా స్పష్టత ఇవ్వాలని వారు డిమాండ్‌ చేశారు.

విద్యారంగానికి మొండిచెయ్యి
నేడు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌ ప్రతులు దహనం : ఎస్‌ఎఫ్‌ఐ
రాష్ట్ర ప్రభుత్వం 2026-27 బడ్జెట్‌లో విద్యారంగానికి మొండి చెయ్యి చూపించిందని ఎస్‌ఎఫ్‌ఐ విమర్శించింది. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌.రజనీ కాంత్‌, రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా బడ్జెట్‌ ప్రతులు దహనం చేపడుతున్నట్టు వారు తెలిపారు. విద్యారంగానికి 15 శాతం కేటాయిస్తామని అధికారంలోకి వచ్చి కనీసం 10 శాతం కూడా కేటాయించకపోవడం మాటలకు, చేతలకు మధ్య ఉన్న తేడా చూపిస్తోందని వారు విమర్శించారు. కోఠి మహిళా యూనివర్సి టీకీ గతంలో నిధులు కేటాయించి ఖర్చు చేయకుండా, మరోసారి రూ.400 కేటాయించారని తెలిపారు. ఒయూకు సీఎం ప్రకటించిన రూ.1,000 కోట్లు తప్ప కొత్త కేటాయింపులు లేవని పెదవి విరిచారు. మండలానికి ఒక ఇంటర్నేషనల్‌ స్కూల్‌ అనీ, మళ్లీ కేవలం తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ అన్నారనీ, విద్యా కమిషన్‌ సిఫారసులను పట్టించుకోకుండా రూ.5 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని పెదవి విరిచారు.

బడ్జెట్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలపై ప్రభుత్వం రూ. 4,343కోట్లు కేటాయింపు చేస్తామని చెప్పినప్పటికీ, సుమారు రూ. 9,500 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయని విమర్శించారు. నియామకాల సంఖ్యలు గతంలో ప్రారంభమైన ప్రక్రియలే తప్ప కొత్త అవకాశాలు కావని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో హాస్టల్స్‌ ఎలా బాగుపడతాయని వారు ప్రశ్నించారు. గురుకుల అద్దె భవనాలు, కేజీబీవీ అదనపు బిల్డింగ్స్‌, సంక్షేమ వసతి గృహాల మౌళిక సదుపాయాలపై సరైన ప్రస్తావన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్‌ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం., 118 ఏసీటీ విద్యార్థులకు నెలకు రూ.2000 స్కాలర్‌ షిప్స్‌ ఆచరణలో అమలు చేయాలని కోరారు. తక్షణమే బడ్జెట్‌ సవరించి విద్యారంగానికి కనీసం 30 శాతం నిధులు కేటాయించాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్‌ చేశారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిల చెల్లింపులు, ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధుల విడుదల, ఖాళీగా ఉన్న టీచర్‌, అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

ప్రభుత్వ బడిని బాగు చేయలేని బడ్జెట్‌
తెలంగాణ పౌర స్పందన వేదిక
రాష్ట్ర బడ్జెట్‌లో విద్యకు కేటాయించిన 8.2శాతం నిధులు తీవ్ర సంక్షోభంలో ఉన్న ప్రభుత్వ బడిని రక్షించడానికి ఏ మాత్రం సరిపోవని తెలంగాణ పౌర స్పందన వేదిక విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం వేదిక రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, ప్రధాన కార్యదర్శి యం.రాధేశ్యాం ఒక ప్రకటన విడుదల చేశారు. పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ ఫాస్ట్‌ పథకం, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఐటీఐ విద్యార్థులకు నెలకు రూ.2 వేల స్కాలర్‌ షిప్‌ ఉపయోగపడతాయని తెలిపారు. గతేడాది 1,300 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగుతులను ఎక్కడ ప్రారంభించారని ప్రశ్నించారు. గతేడాది ప్రీ ప్రైమరీ కింద యూకేజీ మాత్రమే ప్రారంభించారనీ, దీంతో ఉపయోగముండదని తెలిపారు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రారంభించాలని కోరారు. ప్రజల కదలిక లేకుండా ప్రభుత్వ బడులు నిలబడవని పేర్కొన్నారు.

కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకారం వృత్తిదారులకు బడ్జెట్‌ లేకపోవడం అన్యాయం
రజక వృత్తిదారుల సంఘం
కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ ప్రకారం వృత్తి దారులకు బడ్జెట్‌ లేకపోవడం అన్యాయమని రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య విమర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 26 రకాల చేతివృత్తులపై ఆధారపడిన 70 లక్షల మంది వృత్తిదారులకు బీసీ సంక్షేమ నిధులు కేవలం రూ.2,470 కోట్లు మాత్రమే వివిధ ఫెడరేషన్లకు, బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లకు కేటాయించారని విమర్శించారు. మొత్తం బీసీల బడ్జెట్‌ రూ.12,512 కోట్లు మాత్రమే తప్ప పెరగలేదని తెలిపారు.

ప్రతి ఏటా రూ.25 వేల కోట్లు కేటాయిస్తామనీ, సంక్షేమ వృత్తుల ఆధునీకరణ, ఉపాధి కల్పనకు నిరుద్యోగ యువతకు ప్రత్యేక ఆర్థిక సహకారం, వృత్తిదారుల ఆధునిక టెక్నాలజీతో కూడినటువంటి పనిముట్లు, ప్రతి జిల్లాలో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు తదితర హామీలు అటకెక్కించిందని చెప్పారు. గతేడాది ఉచిత విద్యుత్‌ పథకానికి కేటాయించిన రూ.250 కోట్లు ఖర్చు చేయకపోవడంతో రజక, నాయి బ్రాహ్మణులను విద్యుత్‌ బిల్లులకోసం అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెపారు. 2026-27లోనూ ఈ పథకం కింద రజక సొసైటీలకు రూ.150 కోట్లు, దోభీఘాట్లకు రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారని వారు విమర్శించారు.

సంక్షేమానికి సరిపోవు
చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ
రాష్ట్ర బడ్జెట్‌లో బీసీలకు కేటాయించిన రూ.12,511 కోట్లు వారి సంక్షేమానికి సరిపోవని చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ యం.వి.రమణ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో వృత్తిదారుల సంక్షేమానికి కేవలం రూ. 2,470 కోట్లు మాత్రమే కేటాయించారని విమర్శించారు. ఈ నిధులతో బీసీల సంక్షేమం తో పాటు వృత్తిదారుల సంక్షేమం ఎలా సాధ్యమవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. ఇచ్చిన హామీ ప్రకారం వృత్తిదారుల సంక్షేమానికే రూ.25 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మార్పులు చేయాలి
టీఎస్‌ఆర్టీసీ ఎస్‌డబ్ల్యూఎఫ్‌
టీజీఎస్‌ఆర్టీసీకి రీఎంబర్స్‌మెంట్‌ కోసం రూ.6,040 కోట్లు ఇచ్చేలా బడ్జెట్‌లో మార్పులు చేయాలని టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌(సీఐటీయూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు వీరాంజనేయులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్‌.రావు ఒక ప్రక టన విడుదల చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం రూ.6,040 కోట్ల ప్రొవిజన్‌కు బదులుగా రూ.4,305 కోట్లు కేటాయించి చేతులు దులుపు కుందని వారు విమర్శించారు. పెరిగిన ప్రయాణికుల అవసరాల కోసం కొత్త బస్సుల కొనుగోలుకు నిధుల కేటాయింపు, విద్యుత్‌ బస్సులు ఆర్టీసీయే నిర్వహించేలా విధానంలో మార్పులు, ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న 2021, 2025 పే స్కేల్స్‌, పీఎఫ్‌, ఎస్‌ఆర్బీఎస్‌, ఎస్బీటీ, సీసీఎస్‌ సంస్థలకు ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వాలిసిన డబ్బులు గురించి ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ నిర్వహణ కోసం ఫైనాన్స్‌ సంస్థల నుంచి తెచ్చిన అప్పులకు వడ్డీల భారం లేకుండా ఆ అప్పులను ప్రభుత్వ ఈక్విటీగా మార్చే అంశాలు బడ్జెట్‌లో లేవని విమర్శించారు.

ఉపాధి హామీకి 40శాతం నిధులివ్వని బడ్జెట్‌
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం
రాష్ట్ర బడ్జెట్‌లో ఉపాధి హామీ చట్టానికి 40శాతం నిధులను కేటాయించలేదని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు జి.నాగయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌.వెంకట్‌ రాములు ఒక ప్రకటన విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న, కొత్త ఇందిరమ్మ ఇండ్ల కోసం ఒక్క పైసా కూడా ఈ బడ్జెట్‌లో చూపులేదని వారు విమర్శించారు. భూమిలేని వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల చొప్పున ఇచ్చేందుకు కేవలం రూ.6 వేల కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని తెలిపారు. కౌలు రైతులకు రూ.15 వేలు, ప్రతి మహిళకు రూ.25 వేలు, తులం బంగారం గురించి మాట మాత్రం ప్రస్తావించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 లక్షల కొత్త రేషన్‌ కార్డులు, 19 లక్షల పాత కార్డుల్లో పేర్లను చేర్చామని చెప్పిన సర్కారు గతంలో మాదిరిగానే రూ.3 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని అసంతప్తి వ్యక్తం చేశారు. భూ నిర్వాసితులను ఆదుకోవడం పునరావాస ప్యాకేజీ గురించి ప్రస్తావించలేదని విమర్శించారు.

వ్యవసాయ రంగానికి కనీసం 6 శాతం నిధులు కేటాయించాలి
తెలంగాణ రైతు సంఘం
రాష్ట్ర బడ్జెట్‌ను సవరించాలనీ, వ్యవసాయ రంగానికి కనీసం 6 శాతం నిధులు కేటాయించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ ప్రకటనలకు, లక్ష్యా లకు అనుగుణంగా బడ్జెట్‌ కేటాయింపులు లేకపోవడంతో వ్యవసాయ రంగంలో మాంద్యం పెరుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో వ్యవసాయరంగం బీమా సౌకర్యం, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, మార్కెట్‌ జోక్యం పథకం కింద నిధుల కేటాయించలేదని విమర్శించారు.

పాల ఉత్పత్తి దార్లకు లీటరుకు రూ.5 ప్రోత్సాహకానికి బడ్జెట్‌ నిధులు కేటాయించ లేదని తెలిపారు. భూభారతి అమల్లో రెవెన్యూ కోర్ట్‌ల పునరుద్ధరణ, 11 అంశాల పహాణి పత్రికలో వాస్తవ సాగుదార్లు (కౌలు దార్లు) పేరు నమోదు, పంటల బోనస్‌, మ్యానిఫెస్టోలో ప్రకటించిన పంటల కనీస మద్ధతు ధరల నిర్ణయానికి సంబంధించిన బడ్జెట్‌ కేటాయింపులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూభారతి అమలుతో కౌలుదార్లకు ఆర్థిక రక్షణ లేకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గిరిజనులను దగా చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం
తెలంగాణ గిరిజన సంఘం
హామీల అమలుకు మూడో ఏడాది బడ్జెట్‌లో నిధులు కేటాయించకుండా రాష్ట్రంలోని 40 లక్షల మంది గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని తెలంగాణ గిరిజన సంఘం విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.ధర్మ నాయక్‌, ఆర్‌.శ్రీరాం నాయక్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన 15 రకాల హామీల అమలుకు రూ.25వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా రూ.7,937 కోట్లు మాత్రమే కేటాయించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రూ.10,158 కోట్లు కేటాయించి రూ.3,700 కోట్లు ఖర్చు చేసి రూ.6 వేల కోట్లను దారి మళ్లించిందని విమర్శించారు. ట్రైకార్‌ సంస్థకు ఒక్క రూపాయి కేటాయించకుండా రద్దు చేసేందుకు కుట్ర చేసిందని ఆరోపించారు.

గిరిజన యువ వికాసం పేరుతో గతేడాది రూ.1,360 కోట్లు కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు చేయలేదని తెలిపారు. దీంతో ఈ ఏడాది కేటాయించిన రూ.1,360 కోట్లు ఖర్చు చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. ఐటీడీఏలకు ఒక్క రూపాయి పెంచకుండా గతేడాది మాదిరిగానే రూ.75 కోట్లు కేటాయించిందనీ, గిరిజన గూడేలు, తండాల గ్రామపంచాయతీలు, ఆవాసాల మౌలిక సదుపాయాల పేరుతో గతేడాది రూ.600 కోట్ల రూపాయల కేటాయించి ఖర్చు చేయలేదని తెలిపారు. ఈ ఏడాది ఆ మొత్తాన్ని చూపించి అంకెల గారడికి పాల్పడిందని విమర్శించారు. గిరిజన సబ్‌ ప్లాన్‌ నిధులను గతేడాది రూ.17,168 కోట్లు కేటాయిస్తే, ఈ ఏడాది రూ.15,274 కోట్లు కేటాయించిందన్నారు. ఈ నిధులను కూడా ఖర్చు చేయకుండా దొంగలెక్కలతో మోసం చేస్తున్నదన్నారు.

బడ్జెట్‌లో దళితులకు భారీ కోత
నేడు రాష్ట్ర వ్యాప్త నిరసనలు : కేవీపీఎస్‌
రాష్ట్ర బడ్జెట్‌లో దళితులకు భారీ కోత విధించారని కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌ బాబు శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం రాష్ట్ర వ్యాప్త నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. రూ.40 వేల కోట్ల నుంచి రూ.11,784 కోట్లకు తగ్గించి మోసం చేశారనీ, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ ఊసెత్తలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రూ.40 వేల కోట్లు కేటాయించినట్టు చూపించి రూ.19 వేల కోట్లు విడుదల చేసి, అందులో రూ.14 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు చూపించారని తెలిపారు.

ఇందులోనూ 9 శాఖలు నయాపైసా ఖర్చు చేయలేదని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎక్స్‌ గ్రేషియోల కోసం వేలాది మందిబాధితులు బడ్జెట్‌ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. కులాంతర వివాహితుల ప్రోత్సాహకాలు రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఎస్సీ జనాభా 18 శాతం ఉండగా ప్రభుత్వ కేటాయింపులు జనాభా దామాషా ప్రకారం లేవని తెలిపారు. గత మూడేళ్ల కాలంలో కేటాయించిన బడ్జెట్‌, పెట్టిన ఖర్చు మొత్తం దళితుల బడ్జెట్‌పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

మైనార్టీ సంక్షేమాన్ని విస్మరించిన బడ్జెట్‌ : ఆవాజ్‌
మైనార్టీ సంక్షేమాన్ని రాష్ట్ర బడ్జెట్‌ విస్మరించిందని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌ అబ్బాస్‌ శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. మైనార్టీలకు లోన్ల కోసం కేటాయించిన రూ.150 కోట్లు ఏ మాత్రం సరిపోవన్నారు. గతంలో రూ.150 కోట్లు కేటాయించి రూ.90 కోట్లకు తగ్గించారని తెలిపారు. మైనార్టీల స్కాలర్‌ షిప్స్‌ కోసం రూ.120 కోట్లు వారి సంఖ్యతో పోల్చుకుంటే చేకూరే ప్రయోజనం నామమాత్రమని కొట్టిపారేశారు. మైనార్టీ రెసిడెన్షియల్‌ స్కూళ్ల కోసం గతంలో రూ.300 కోట్లు కేటాయించి, రూ.244 కోట్లకు కుదించారనీ, ఎంత ఖర్చు చేశారో తెలియదన్నారు.

ఈ ఏడాది మళ్లీ రూ.300 కోట్లు కేటాయించారని చెప్పారు. గతేడాది రాజీవ్‌ యువ వికాసానికి రూ.840 కోట్లు కేటాయించి రూ.420 కోట్లకు తగ్గించి, తిరిగి ఈ ఏడాది రూ.790 కోట్లు ప్రతిపాదించారని తెలిపారు. ఇమామ్‌, మోజన్లకు ఆర్థిక సహకారం నిమిత్తం గతంలో వక్ఫ్‌ బోర్డుకు 120 కోట్లు కేటాయించి, ఈ బడ్జెట్లో రూ.20 కోట్లకు తగ్గించారని చెప్పారు. గతేడాది మైనార్టీ సంక్షేమానికి రూ.2,845 కోట్లు ప్రతిపాదించి, రూ.2,266 కోట్లకు సవరించి, ఈ ఆర్థిక సంవత్సరం మళ్ళీ రూ.2,893 కోట్లు ప్రతిపాదించినట్టు తెలిపారు. అన్ని రంగాల్లో వెనుకబడిన మైనార్లటీ సంక్షేమంపై ఇకనైనా దృష్టి సారించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

వికలాంగుల సంక్షేమానికి నిధుల కేటాయింపులేవి?
ఎన్పీఆర్డీ
వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర బడ్జెట్లో నిధుల కేటాయింపులేవి? అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) రాష్ట్ర కమిటీ ప్రశ్నించింది. ఎన్పీఆర్డీ ఆధ్వర్యంలో నిధుల కేటాయింపులో నిర్లక్ష్యానికి నిరసనగా శుక్రవారం హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ పత్రాలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ వేదిక రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె. వెంకట్‌, యం.అడివయ్య మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమనికి 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం నిధులు కేటాయించాలని గుర్తుచేశారు. అయితే గతేడాది రూ.77 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ ఏడాదిలో ఎలాంటి పురోగతి చూపించలేదన్నారు. మహిళా, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖకు 3143 కోట్లు కేటాయించిందని, ఇందులో వికలాంగుల సంక్షేమనికి ఎంత కేటాయించారో ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

చేయూత పెన్షన్స్‌ కోసం 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే బడ్జెట్‌లో కేవలం రూ.232.09 కోట్లు అదనంగా కేటాయించిందని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన 2 లక్షల మందికి కొత్తగా పెన్షన్స్‌ మంజూరు చేస్తామని ప్రకటించడం అంటే చేయూత లబ్ధిదారులను మోసం చేయడమేనని వారు విమర్శించారు. పుట్టిన బిడ్డ నుండి 5 ఏండ్ల లోపు వయస్సున్న పిల్లలో పుట్టుకతో వచ్చే వైకల్యాలను గుర్తించి, శాశ్వత అంగవైకల్యంగా మారకుండా నీవరించడానికి ప్రకటించిన బాలభరోసా పథకానికి బడ్జెట్లో నిధులు కేటాయించకుండా ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. సహాయ పరికరాల కొనుగోలుకు, అనుకూలంగా లేని 95 శాతం ప్రభుత్వం కార్యాలయాలను వికలాంగులు వినియోగించుకునే విదంగా మార్చడానికి బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదని చెప్పారు.

వికలాంగుల మధ్య వివాహాల ప్రోత్సహాలకు నిధులు కేటాయించలేదన్నారు. 18 వేల వికలాంగుల స్వయం సహాయక సంఘాలకు నిధుల ప్రస్తావన లేదన్నారు. ఆరోగ్యశాఖ మానసిక ఆరోగ్య సమస్యను నిర్లక్ష్యం చేసిందన్నారు. బడ్జెట్‌ను సవరించి వికలాంగుల సంక్షేమనికి నిధులు పెంచాలని డిమాండ్‌ చేశారు. మార్చి 21న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో బడ్జెట్‌ పత్రాలను దహనం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఆర్‌.వెంకటేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు జి.బాలయ్య, నాయకులు ఎస్‌.రాజు, శివకుమార్‌, రాఘవేంద్ర, శంకర్‌ గౌడ్‌, రజిత తదితరులు పాల్గొన్నారు.

యువతను దగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం : డీవైఎఫ్‌ఐ
రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో యువతను దగా చేసిందని డీవైఎఫ్‌ఐ విమర్శించింది. ఈ మేరకు శుక్రవారం డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్‌, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు జాబ్‌ క్యాలండర్‌, నిరుద్యోగ భృతి, యూత్‌ కమిషన్‌ను ఏర్పాటు చేస్తామని హమీలు ఇచ్చి విస్మరించారని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకా శాలు కల్పించేంత వరకు ప్రతి నిరుద్యోగికి రూ.4 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామని ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు.

ప్రతి ఏటా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ఇప్పటి వరకు 67 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసిందనీ, అందులోనూ 12 వేల ఉద్యోగాలు మాత్రమే కాంగ్రెస్‌ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్స్‌ ద్వారా భర్తీ చేసినవి ఉన్నాయని తెలిపారు. స్వయం ఉపాధి రుణాల కోసం 16.27 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. రాజీవ్‌ యువ వికాస పథకానికి రూ.6 వేల కోట్లు కేటాయించి అమలు ప్రస్తావనే చేయలేదన్నారు. కార్మిక, ఉపాధి శాఖకు కేవలం రూ.998 కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు వారు పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -