– లౌకికవాదం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం
– ఎన్సీఈఆర్టీ సమావేశంలో కేంద్ర విధానాలు ఎండగట్టా
– కేంద్ర ఎత్తుగడలు చిత్తు చేసేందుకు ఈ నిర్ణయం
– పీఎం-శ్రీ అమలుపై కేరళ విద్యా మంత్రి శివకుట్టి
తిరువనంతపురం : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-శ్రీ పథకంపై కేరళలో రాజకీయ దుమారం రేగుతోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు రాష్ట్రంలోని ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. పథకం అమలు కోసం కేంద్రంతో అవగాహనా ఒప్పందంపై (ఎంఓయూ) సంతకాలు చేసింది. దీనిపై కాంగ్రెస్ సహా పలు పార్టీలు విమర్శలు కురిపించాయి. అయితే పీఎం-శ్రీ అమలుకు సంతకం చేయడమంటే జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) పూర్తిగా అంగీకరించినట్టు కాదని కేరళ విద్యా శాఖ మంత్రి వి.శివకుట్టి వివరణ ఇచ్చారు. కేరళ ప్రాధాన్యతలు, విలువలపై ఆధారపడిన విద్యా ప్రాజెక్టుల అమలు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. గతంలో సమగ్ర శిక్షా యోజన పథకంలో కూడా ఇదే జరిగిందని గుర్తు చేశారు.
రాష్ట్ర విద్యా ప్రాజెక్టులకే ప్రాధాన్యత
‘ఎన్‌ఈపీని రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్ నుంచి సమగ్ర శిక్షను అమలు చేస్తోంది. ఆ పథకం కింద కేరళ 2023 వరకూ నిధులు పొందినప్పటికీ రాష్ట్ర విద్యా సూత్రాలకు అనుగుణమైన ప్రాజెక్టులనే కొనసాగిస్తోంది. ఇప్పుడు కూడా అదే వైఖరి కొనసాగుతుంది’ అని శివకుట్టి అన్నారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఒప్పందంపై సంతకం చేసే సమయంలో ఎన్‌ఈపీ అమలుకు సంబంధించిన క్లాజు విషయంలో స్వతంత్ర వైఖరి అవలంబించామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యా కమిషన్ సిఫారసులకు అనుగుణంగా నడుచుకుంటామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కనీసం 30 శాతం కూడా అమలు చేయడం లేదని చెప్పారు. ఎన్‌ఈపీ-2020లోని పలు అంశాలు అనేక దశాబ్దాలుగా రాష్ట్రంలో అమలవుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. పాఠ్య ప్రణాళికలను రూపొందిం చాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలదేనని స్పష్టం చేశారు. ఎన్‌ఈపీలో కూడా ఇదే ఉన్నదని ప్రస్తావించారు. ఎన్‌ఈపీని ప్రవేశపెట్టిన తర్వాత ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకూ పాఠ్య ప్రణాళికలను, పుస్తకాలను మార్చింది ఒక్క కేరళ మాత్రమేనని తెలిపారు. లౌకికవాదం, రాజ్యాగ విలువలు వంటి అంశాలపై అవి దృష్టి పెట్టాయని అన్నారు.
ఎన్సీఈఆర్టీ తొలగించిన పాఠాల కొనసాగింపు
ఎన్సీఈఆర్టీ తొలగించిన మహాత్మా గాంధీ హత్య, మొఘలుల చరిత్ర వంటి పాఠాలను కేరళ కొనసాగించిందని శివకుట్టి చెప్పారు. వాటిని అనుబంధ పాఠ్య పుస్తకాలలో ఉంచామని, వాటి ఆధారంగా పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అవే పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు ఎలాంటి మార్పులు లేకుండా ఇక ముందు కూడా కొనసాగుతాయని అన్నారు. ‘స్కూల్ కాంప్లెక్స్’ మోడల్ కింద చిన్న చిన్న పాఠశాలలు మూతపడతాయన్న వాదనను ఆయన తోసిపుచ్చారు. గతంలో యూడీఎఫ్ ప్రభుత్వం మూసివేయాలని నిర్ణయించిన పాఠశాలలను పరిరక్షించి పునరుద్ధరించామని గుర్తు చేశారు. పబ్లిక్ ఎడ్యుకేషన్ రిజువనేషన్ మిషన్ ద్వారా గత తొమ్మిది సంవత్సరాల కాలంలో 11 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని అన్నారు. ఢిల్లీలో ఇరవై రాష్ట్రాల మంత్రులు హాజరైన ఎన్సీఈఆర్టీ సర్వసభ్య సమావేశంలో కేంద్ర ప్రభుత్వ లోపభూయిష్ట విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడింది తానొక్కడినేనని చెప్పారు.
కేంద్ర ఎత్తుగడలను తిప్పికొట్టేందుకే…
రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం పాఠ్యపుస్తకాలలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ల అధికారాలు వంటి అంశాలను ప్రవేశపెట్టిన ధైర్యం కేరళ రాష్ట్రానిదని శివకుట్టి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులు అందించకుండా రాష్ట్రాలను ఆర్థికంగా ఇబ్బంది పెడుతోందని ఆయన విమర్శించారు. న్యాయపరంగా లభించాల్సిన వాటా కోసం కేరళ గట్టిగా నిలబడుతుందని చెప్పారు. పీఎం-శ్రీ గురించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు ముందు పీఎం అనే పదాన్ని చేర్చడం సహజంగా జరుగుతున్నదేనని అన్నారు.
82 కేంద్ర పథకాలలో 17 పథకాలు పీఎంతోనే మొదలయ్యాయని పేర్కొన్నారు. ఆర్థికంగా ఒత్తిడి తేవాలన్న కేంద్ర ప్రభుత్వ ఎత్తుగడను తిప్పికొట్టేందుకే వ్యూహాత్మకంగా పీఎం-శ్రీపై సంతకం చేశామని చెప్పారు. పీఎం-శ్రీ పథకంపై సంతకం చేయనందుకు కేంద్రం సమగ్ర శిక్ష నిధులను నిలిపివేసిందని, ఫలితంగా రాష్ట్రం వేల కోట్ల రూపాయలు నష్టపోయిందని వివరించారు. ఇప్పుడు పీఎం-శ్రీపై సంతకం చేయడంతో రాష్ట్రానికి రూ.1,486.13 కోట్ల నిధులు అందుతాయని అన్నారు.
చిన్నారుల భవిష్యత్తుపై రాజీ పడం
నిధుల నిలిపివేతతో 40 లక్షల మంది కేరళ విద్యార్థులపై ప్రభావం పడిందని శివకుట్టి చెప్పారు. రాజకీయ వెసులుబాటు కోసం చిన్నారుల భవిష్యత్తు విషయంలో కేరళ రాజీ పడబోదని తేల్చి చెప్పారు. ఈ నిధులు ఏ రాజకీయ పార్టీకో అనుకూలంగా విడుదలవుతున్నవి కావని, అది విద్యార్థుల న్యాయపరంగా దక్కాల్సిన వాటా అని అన్నారు. విద్య ద్వారా ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను ముందుకు తీసుకుపోయేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిఘటిస్తూనే ఉంటామని తెలిపారు. కేరళ ప్రభుత్వ విద్య యొక్క లౌకిక, ప్రజాతంత్ర, శాస్త్రీయ మూలాల విషయంలో రాజీ పడే ప్రశ్నే లేదని శివకుట్టి స్పష్టం చేశారు.
ఎన్‌ఈపీని అంగీకరించినట్టు కాదు
- Advertisement -
- Advertisement -



