నవతెలంగాణ- కంఠేశ్వర్ : వయోవృద్ధులను వేధించటం ప్రభుత్వానికి తగదు అని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ సభ్యులు మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ వద్ద రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ను జిల్లా రిజిస్ట్రేషన్ రిటైర్డ్ అధికారి గంటా నరేందర్ ప్రారంభిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధంగా ఇవ్వవలసిన డిఏలను, ఇవ్వకుండా, 40 సంవత్సరాలకు పైగా ప్రభుత్వానికి ,ప్రజలకు సేవ అందించిన ఉద్యోగులకు ఉచిత వైద్యాన్ని అందించే పరిస్థితి ప్రభుత్వానికి లేదని , ఇది సంక్షేమ రాజ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు.
ఈ ధర్నాకు అధ్యక్షత వహించిన యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఈవీఎల్ నారాయణ మాట్లాడుతూ పి ఆర్ సి అనేది చట్టబద్ధంగా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలని కానీ ప్రభుత్వం 8 సంవత్సరాలు దాటినా దాని గురించి పట్టించుకోవడం లేదని అన్నారు. దీనికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం పెన్షన్ రివిజన్ అనేది పాత పెన్షనర్లకు జరగదని చట్టం తీసుకొచ్చిందని, ఇంత దుర్మార్గమైన పనికి కేంద్ర ప్రభుత్వం పాల్పడటం శోచనీయమని అన్నారు.
నగదు రహిత వైద్యం అన్ని ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రులలో అనుమతించాలని నిజామాబాద్ డివిజన్ అధ్యక్షులు శిర్ప హనుమాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కెటింగ్, లైబ్రరీ, కార్పొరేషన్లకి సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులకు ట్రెజరీ నుండి పెన్షన్ చెల్లించాలని మార్కెట్ కమిటీ రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు బన్షీలాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు లావు వీరయ్య, పురుషోత్తం, వెంకట్రావు బాబా గౌడ్, సాంబ శివరావు , శ్రీధర్, శంతన్, తదితరులు పాల్గొన్నారు. సిర్ప లింగయ్య ఆలపించిన పాటలు అందరినీ అలరించాయి. తదనంతరం జిల్లా కలెక్టర్ కు సమస్యలతో కూడిన మెమొరండాన్ని సమర్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో జార్జ్,దీన సుజన , పుష్ప వల్లి,లలిత, తదితరులు పాల్గొన్నారు.