Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ను జాతిపిత అనడం సిగ్గుచేటు

కేసీఆర్‌ను జాతిపిత అనడం సిగ్గుచేటు

- Advertisement -

ఎమ్మెల్యే కడియం శ్రీహరి
నవతెలంగాణ – స్టేషన్‌ఘనపూర్‌

దేశానికైనా, రాష్ట్రానికైనా ఉన్నది ఒక్కరే జాతిపిత అని, ఆయనే మహాత్మా గాంధీ అని, కేసీఆర్‌ను జాతిపిత అని చెప్పుకోవడానికి బీఆర్‌ఎస్‌ నాయకులకు సిగ్గుండాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్‌ఘనపూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గురువారం జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. 28మంది కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు రూ.28లక్షలా 3వేలా 248ల విలువైన చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులు అధికారం వాళ్ళ జన్మ హక్కుగా, కల్వకుంట్ల కుటుంబ హక్కుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా విపరీతమైన నీచధోరణితో నోటికొచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ను పట్టించుకోవడం లేదనడానికి మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబ అవినీతి, అక్రమాలతో బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. తెలంగాణకు కేసీఆర్‌ ఏం చేశాడని జాతిపిత అంటున్నారని ప్రశ్నించారు. కేసీఆర్‌ ఒక్కడి వల్లే తెలంగాణ రాలేదని ఎంతో మంది ప్రజలు, విద్యార్థులు, యువకులు, మేధావుల ఉద్యమ ఫలితం వల్లే తెలంగాణ రాష్ట్రం సిద్దించిందని అన్నారు. 2014కు ముందు కల్వకుంట్ల కుటుంబం ఆస్తులు ఎన్ని..? ఇప్పుడు ఉన్న ఆస్తులు ఎన్నో ప్రజల ముందు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మెన్‌ జూలుకుంట్ల లావణ్య శిరీష్‌ రెడ్డి, తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ విజయశ్రీ, మున్సిపల్‌ చైర్మెన్‌ తాటికొండ వినయ్ కుమార్‌, సర్పంచులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -