Sunday, November 9, 2025
E-PAPER
Homeచైల్డ్ హుడ్పిల్లలుగా ఉండటం పసివారి హక్కు

పిల్లలుగా ఉండటం పసివారి హక్కు

- Advertisement -

బాల్యమంటే – అందం, ఆనందం, అమాయకత్వం, ఆటలు, పాటలు, కుప్పలు తెప్పలుగా ఉన్న ఊహలు, చిన్నిచిన్ని ఆశలు, భాషకందని భావాలు… ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఇంకెన్నో… బాల్యమనేది మానవజీవితంలోని ఒక మధురమైన అవస్థ. తమ మధురమైన బాల్యాన్ని తలచుకోని మనిషే ఉండడంటే అతిశయోక్తి కాదేమో.. అయితే బాల్యం అందరికీ మధురమైన అనుభూతుల్ని పంచుతుందనీ చెప్పలేం.

బాల్యం అంటే .. ఎంత వయసు? అనే ప్రశ్న మొలకెత్తక మానదు. బాలల హక్కులపై అంతర్జాతీయ చట్టం ప్రకారం, పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వారిని బాలలుగా పరిగణించవచ్చు. ఈ బాలల దినోత్సవం సందర్భంగా, బాలల సాహిత్యాన్ని, సాహిత్యంతో బాలలకున్న అవసరాన్ని, అనుబంధాన్ని ఒక్కసారి గుర్తుకుతెచ్చుకుందాం. అయితే ఇక్కడ బాలసాహిత్యం మాత్రం రెండు నుండి పదహారు సంవత్సరాల వయసు గల పిల్లలకోసం రాసే సాహిత్యంగా చెప్పబడుతోంది. మానవ జీవన ప్రస్థానం గర్భస్థశిశువుగా ఉన్న దశ నుంచే ఆరంభమౌతుంది. అనగా తల్లిమాటను గుర్తించటం మొదలు తల్లి ఆలోచనా ధోరణి నుంచే బిడ్డ వికాసం ఆరంభమౌతుందనేది జగమెరిగిన సత్యం. ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టిన బిడ్డ, శ్రవణం, స్పర్శ, దృశ్యం, పఠనం అనే అంశాల ద్వారా కొత్త విషయాలను ఆకళింపు చేసుకొంటారు.

తల్లి స్పర్శ, ఆమె చెప్పే కబుర్లు, లాలిపాటలు.. ఇవన్నీ మొదటి దశ. ఆ తర్వాత దృశ్యం. అనగా వివిధ రంగులు, ఆకారాలు, బొమ్మలు చూడటం ద్వారా తెలుసుకుంటారు. ఆ దశలో చూస్తూ, వింటూ ప్రేరణపొంది, తమ శరీర కదలికలతో, వచ్చీరాని మాటల ద్వారా ఏవేవో విషయాలు వ్యక్తపరిచే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత పాఠశాలకు వెళ్తున్న క్రమంలో నెమ్మదిగా అక్షరాలను గుర్తించటం, కూడబలుక్కొని చదవటం ఆరంభమౌతుంది. ఆ క్రమంలోనే బాలల గేయాలు, చిట్టిపొట్టి కథలు, పాటలు, పాఠ్యాంశాలూ నేర్చుకుంటారు. నిజానికి ఇది అనాదిగా మనం ప్రత్యక్షంగా చూస్తూ వస్తున్న క్రమ వికాస పద్ధతి. ఇప్పుడు ఆ క్రమవికాసం ఎలాంటి పోకడలకు లోనయిందో, అవుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రాచీన సాహిత్య కాలం నుంచే బాల సాహిత్య ఛాయలు మనం చూడవచ్చు. బాలల ఆటల ప్రసక్తి, వాటిని గురించిన పాటలు, బాలల పాత్రలు గల అంశాలు కోకొల్లలు. ఉదాహరణకు రామాయణ, భారత, భాగవతాల్లో మనం చూడవచ్చు. ముఖ్యంగా శ్రీకృష్ణుని బాల్యమంతా కూడా పిల్లలకు సంబంధించిన ఆటలు, పాటలు, వర్ణనలకు సంబంధించినదే అయినప్పటికీ, ప్రత్యేకంగా వారికోసమంటూ రచనలు రాలేదనే చెప్పవచ్చు.

అనగా బాలలనే శ్రోతలుగా గుర్తించి, వారికోసమే రచించబడిన రచనలు అని ఇక్కడి భావం. అటువంటి బాలసాహిత్యం 19వ శతాబ్దానికి పూర్వం రాలేదని, ఆ తర్వాత ఆంగ్లేయ సాహిత్య పరిచయంతో ఆరంభమైనట్లు, దానికి ఆద్యులు కందుకూరి వారని, ‘తెలుగు బాలగేయ సాహిత్యం- సమగ్ర పరిశీలన’ అనే గ్రంథంలో డా|| ఎం.కె. దేవకిగారు అభిప్రాయపడ్డారు. ఆ తర్వాతి నుంచి, నేటివరకూ ఎన్నో కొత్తపోకడలతో కొంగొత్త హంగులు దిద్ది, బాలసాహిత్యాన్ని పలువురు ప్రముఖులు ఆసక్తితో, బాధ్యతగా గుర్తించి ముందుకు తీసుకురావటం జరిగింది. సాధారణంగా ఏదైనా ఒక మార్పు చోటుచేసుకున్నప్పుడు దాని ప్రభావం ముఖ్యంగా బాలలు, వృద్ధులు, స్త్రీలపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. అయితే ఏ మార్పయినా ఆశాజనకంగా, ప్రయోజనకరంగా ఉందంటే దాన్ని ఆహ్వానిస్తాం. కానీ అది విపరీతాలకు దారి తీస్తుంటే మాత్రం, చూస్తూ కూర్చోవటం చాలా పెద్ద తప్పు.

ఒక దశలో బాలసాహిత్యం ఎంతో దేదీప్యమానంగా వెలుగొందిందన్న మాట వాస్తవం. బాలల్లో పుస్తక పఠనాశక్తిని రేకెత్తించి, మంచి చెడు విచక్షణను కలిగించిందనటంలో ఏమాత్రం సందేహం లేదు. వాటిలో క్లాసిక్స్‌గా పంచతంత్ర కథలు, అక్బర్‌-బీర్బల్‌ వినోద కథలు, బొమ్మల బాలభారత కథలు, బేతాళ కథలు వంటివాటిని నేటికీ చూస్తున్నాం. వార్తాపత్రికలు, రేడియోలు, టెలివిజన్లు, బాలల సంఘాల్లో నిర్వహించే కార్యక్రమాలూ, ప్రత్యేకంగా బాలల మాస పత్రికలు (చందమామ, బాలమిత్ర) అంటూ ఓ వెలుగు వెలిగిందనటంలో ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. కథలు, కవితలు, గేయాలు, సామెతలు, ఆటలు, ఆహారం, ఆలోచన, వాతావరణం- ఇలా ఒకటేమిటి, బాలలకు సంబంధించిన ప్రతీ అంశంలోనూ ఓ స్వచ్ఛత తొణికిసలాడుతూ ఉండేది. పసితనపు ఛాయలు మిసమిసలాడేవి.

ఒక్క మాటలో చెప్పాలంటే, నాటి తరానికి ప్రతినిధులుగా నేటి తల్లులు, నేటి తరానికి ప్రతినిధులుగా వారి వారసులు. నేటి తరం ఆలోచనలు కూడా అంతుబట్టని విధంగా పెను మార్పులు మానవజీవితంలో చోటుచేసుకున్నాయన్నది వాస్తవం. ఆ మార్పుకు ఆరంభం దగ్గరే నిలబడి వింత చూసిన, చూస్తున్న తరంలో మనం ప్రత్యక్షంగా ఉన్నాం. నేటి ఉరుకులు పరుగుల జీవితంలో, పరుగెత్తక తప్పటంలేదు. ఆగి నిలబడి ఆలోచించే శక్తి, సమయమూ రెండూ దొరకని తరుణంలో నిస్సహాయంగా నిలబడిన బాల్యానికి, ఊరడింపుగా కంప్యూటర్లు, మొబైల్‌లు నిలబడ్డాయి, తోడయ్యాయి. అలా చూస్తూచూస్తూనే బాల్యాన్ని కబళించేస్తున్నాయి. నెమ్మదిగా సోషల్‌ మీడియా ఊపందుకుంది. ప్రతీ విషయంలోనూ మంచి-చెడు అనే రెండు పార్శ్వాలు ఉంటాయి. అది మనం ఉపయోగించుకునే తీరును బట్టి ఉంటుంది. విచక్షణ అంటే తెలియని బాల్యం చేతిలో టెక్నాలజీని ఉంచితే, దానిని వాడుకునే పద్ధతి తెలియని ఆ అమాయకత్వం దానికి బానిసయ్యే అవకాశం కల్పించింది కూడా మనమే.

ఆమధ్యకాలంలో నన్ను బాగా ఆకర్షించిన ఒక స్లోగన్‌ గురించి ఇక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ‘రైట్‌ ఆఫ్‌ ఎ చైల్డ్‌ టూ బీ ఎ చైల్డ్‌’. ఇందులో ఎంతో చక్కటి భావం ఉంది. టూకీగా చెప్పాలంటే… పసిపిల్లలుగా ఉండటం పసివారి హక్కు. ఇక్కడే ఉంది అసలు చిక్కు. క్షణకాలం ఆలోచిస్తే, అసలు పసివారిని పసివాళ్ళుగా మనం ఉండనిస్తున్నామా? ఆరోగ్యకరమైన, అందమైన, అమాయకమైన బాల్యాన్ని మనం మన పిల్లలకు అందించటంలో ఎంతవరకూ సఫలమయ్యాము. అసలు ఈ కాలంలో పిల్లలు పిల్లల్లానే ప్రవర్తిస్తున్నారా? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇక్కడ మనం శాస్త్రీయ సంగీతాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే… శాస్త్రీయ సంగీతం రెండు విధాలు. ఒకటి గాత్రం, రెండు వాద్యం. అయితే పుస్తక పఠనాన్ని వాద్యంగా, శ్రవణాన్ని గాత్రంగా మనం చెప్పుకోవచ్చు. శ్రవణంలో భాగంగా నాటి కథలు, పాటలను పెద్దల ద్వారా వింటూ, ఆడుతూ పాడుతూ, దృశ్యంలో భాగంగా పుస్తక పఠనం ద్వారా ఒక క్రమశిక్షణతో కూడిన విజ్ఞానం- ఇవి రెండూ నాటి బాల్యానికి దొరికాయి.

దానికి తోడు అమ్మమ్మ, తాతయ్యల మంచి మాటలు, బుజ్జగింపులతో… రెండు రకాలుగానూ వికసించిన బాల్యం నాటిది. ఇప్పుడు కనీసం తీరిగ్గా కూర్చొని మాట్లాడే స్థితిలో పెద్దలు లేరు. ఒకవేళ ఉన్నా వినే స్థితిలో పిల్లలు లేరు. కేవలం కళ్ళు అప్పగించి చూడటానికి అలవాటుపడిన మెదడు ఆలోచనాశక్తి కోల్పోతే, వేళ్ళు టకటకలాడిస్తూ ఆటలు కూడా వేళ్ళకే పరిమితం అయిపోయాయి. ఇక్కడ భీతి కలిగించే విషయం ఏంటంటే… ఆ పరిస్థితి పిల్లలదే కాదు. పెద్దలది కూడా… ఆవు పొలంలో మేస్తే, దూడ గట్టున మేస్తుందా అనే సామెత చందంగా ఉంది నేటి జీవనం. కాబట్టి పుస్తకపఠనం బలం పుంజుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇక్కడ ముఖ్యంగా పరిశీలించవలసిన అంశం ఒకటుంది. అది 2024లో జాతీయ అక్షరాస్యతా ట్రస్టు (నేషనల్‌ లిటరసీ ట్రస్ట్‌) నిర్వహించిన ఒక సర్వే. ‘8 నుండి 18 సంవత్సరాల మధ్య వయస్కులైన పిల్లల్లో 34.6% మంది మాత్రమే తమ ఖాళీ సమయంలో పుస్తకపఠనాన్ని ఆస్వాదిస్తున్నారు’. ఈ సర్వే కోసం సుమారు 76,000 మందిని ప్రశ్నించారు.

పిల్లల పఠన అలవాట్లు ఒక సంక్షోభ స్థాయిని చేరుకున్నట్లు తాజా సర్వే వెల్లడించింది. గత రెండు దశాబ్దాల కాలంలో చూసుకుంటే, ప్రస్తుతం విద్యార్థులు పుస్తకాలు చదివే శాతం బాగా తక్కువ స్థాయికి చేరుకుంది. గత సంవత్సరంలో పుస్తక పఠనాసక్తి నాటకీయంగా పడిపోయింది. ఇందులో పుస్తకపఠనాన్ని ఆస్వాదించటం, తరచుగా పుస్తకాలు చదవడం, మోటివేషన్‌ వంటివాటిని లింగభేదం, సామాజిక ఆర్థిక నేపథ్యం, భౌగోళిక పరిస్థితులు వంటివాటి ఆధారంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వేను ఆ సంస్థ 2005 నుంచి నిర్వహిస్తోంది. అయితే 2024లో మాత్రం పుస్తక పఠనం బాగా పడిపోయినట్లు నిర్ధారణకు వచ్చింది. ప్రతీ ముగ్గురిలో ఒక్కరు మాత్రమే పుస్తకాలను చదివేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. పుస్తక పఠనాన్ని ఆస్వాదించే స్థాయి 2024లో 8.8 శాతం పడిపోయింది. 2024లో తాము ఏదో ఒకటి చదువుతున్నట్లు ప్రతి ఐదుగురిలో ఒక్కరు మాత్రమే చెప్పారు. 2005 నుంచి చూస్తే ఒక్క 2024లోనే 7.5 శాతం పడిపోయింది. ఈ నిర్ధారణలు నిజంగా దిగ్భ్రాంతికరంగా, నిరాశాజనకంగా ఉన్నాయి.

పిల్లల్లో పఠనాసక్తిని కలిగించేందుకు ప్రయత్నాలు ఇప్పటికే ఆరంభమయ్యాయి. పిల్లలు రాసిన పుస్తకాలను సంకలనాలుగా ముద్రించి, తీసుకువస్తున్న ఒక కొత్త అధ్యాయం కూడా ఆరంభమైంది. ఓ రకంగా ఇది ఒక శుభసూచకం. ఇటువంటివి ఇంకాఇంకా రావాల్సిన అవసరం ఉంది. అది ఒక నిర్బంధంలా కాకుండా, ఆసక్తిని కూడా పెంపొందించగలిగే మార్పులు బాలసాహిత్యంలో రావాల్సి ఉంది. కాబట్టి పుస్తకపఠనం బలం పుంజుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అసలు పుస్తకానికి స్వస్తి చెప్పేంతగా సోషల్‌మీడియాలో ఉండి బాలసాహిత్యంలో లేనిదేంటి, అది తిరిగి బలం పుంజుకోవాలంటే మన తక్షణ కర్తవ్యం ఏంటి? అనేదిశగా బాలసాహితీవేత్తలంతా ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. భవనానికి కావలసింది పునాదుల బలం, మనిషికి కావలసింది బలమైన, ఆరోగ్యకరమైన బాల్యం. కాబట్టి బాల్యాన్ని పదిలపరచి, కాపాడాల్సిన బాధ్యత ముందుగా తల్లిదండ్రులది, ఆ తర్వాత బాలసాహితీవేత్తలది, ఒక్క మాటలో చెప్పాలంటే మన అందరిదీ.

  • సింహాద్రి నాగశిరీష
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -