Monday, December 29, 2025
E-PAPER
Homeజాతీయంచరిత్ర మార్చేది శ్రామికులే

చరిత్ర మార్చేది శ్రామికులే

- Advertisement -

అంతిమ విజయం వారిదే.. :
శ్రమ కవనంలో కవులు, రచయితలు, గాయకులు
విశాఖ:
చరిత్రను మార్చేది శ్రామిక వర్గమేనని, ఎప్పటికైనా అంతిమ విజయం వారిదేనని పలువురు కవులు, గాయకులు ఉద్ఘాటించారు. శ్రమ నుంచే సంపద సృష్టిజరుగుతుందని, దాన్ని పెట్టుబడిదారులు లాభంగా చెప్పుకుంటున్నారని వివరించారు. సీఐటీయూ అఖిల భారత 18వ మహాసభ సందర్భంగా విశాఖ బీచ్‌ రోడ్డులోని ఎయు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న శ్రామిక ఉత్సవ్‌ రెండవ రోజైన ఆదివారం శ్రమ కవనం పేరిట శతాధిక కవి, గాయక సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి చీకటి దివాకర్‌ అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సాహితీ స్రవంతి ఏపీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి మాట్లాడుతూ ప్రజా సమస్యలు, వాటిపై పాలకవర్గాలు, ప్రజల మధ్య పరస్పర వర్గ సంఘర్షణ ఉన్నచోటే సాహిత్యం మరింతగా పెరుగుతుందన్నారు.

అందుకు ఉత్తరాంధ్రను నిదర్శనంగా చెప్పుకోవచ్చని తెలిపారు. సంఘర్షణ, సమస్యలు ఉన్నచోటే కళలు, సాహిత్యం పుట్టుకొస్తాయన్నారు. పుట్టెడు సమస్యలతో సతమతమవుతున్న ఉత్తరాంధ్ర నుంచి నవయువ సాహితీవేత్తలు ముందుకొస్తున్నారని వివరించారు. ఈ ప్రాంతంలో స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు కుట్రలు సాగుతున్నాయని, విలువైన భూములు, కొండలు, చివరకు చారిత్రక బౌద్ధారామాలు కూడా ఆక్రమణకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటివాటికి వ్యతిరేకంగా పోరాడిన రైతు సంఘం నేత అప్పలరాజుపై పీడీ చట్టం మోపి జైలుకు పంపారని అన్నారు. గురజాడ, శ్రీశ్రీ వంటి కవులు విశాఖ ప్రాంతవాసులేనని, వీరి వారసత్వం ఉత్తరాంధ్రలో అడుగడుగునా కనిపిస్తోందని వివరించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నింపే బౌద్ధ అవశేషాలు ఈ ప్రాంతంలో ఎక్కడికక్కడా కనిపిస్తాయని, వాటిని కూడా కబ్జా చేయడం ద్వారా మంచిని మంటగలుపుతున్నారని తెలిపారు. అలనాటి కవులు, రచయితలు సొంతలాభం కొంతమానుకుని పొరుగువారికి పాటుపడమని గొంతు వినిపించినప్పటికీ నేడు ఆక్రమణలు, దురాక్రమణలు పెరిగిపోతున్నాయని తెలిపారు. కవులు, కళాకారులు ప్రజా సమస్యలపై నిత్యం గొంతు విప్పాలని ఆకాంక్షించారు. అభ్యుదయ కవి, రచయిత గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ పని, పాట కవల పిల్లలని, వాటికి ఎల్లలు లేవని అన్నారు.

దుర్మార్గమైన వ్యవస్థలో బతుకుతున్నామని, మన ఆలోచనలను పసిగట్టి, నిఘాపెట్టి, అణచివేసే వ్యవస్థలో ఉన్నామని తెలిపారు. అయినా, మన గొంతు మూగబోవడానికి వీల్లేదన్నారు. సమాజానికి కవులు, గాయకులు, రచయితలు మార్గనిర్దేకులుగా ఉండాలని కోరారు. చాలామంది కవులు కనిపించకుండానే సమాజ చైతన్యాన్ని రగిలిస్తున్నారని తెలిపారు. సాహితీ ప్రస్థానం వర్కింగ్‌ ఎడిటర్‌ సత్యాజీ మాట్లాడుతూ శ్రామికులు, కవులు, గాయకుల మధ్య నిరంతర మైత్రి కొనసాగాలని ఆకాంక్షించారు. రచయిత గార రంగనాథం రాసిన ‘అమెరికాలో ఆరంగేట్రం’ అనే పుస్తకాన్ని తెలకపల్లి రవి, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్‌.శర్మ తదితరులు ఆవిష్కరించారు. ప్రముఖ కవులు, రచయితలు గంటేడ గౌరునాయుడు, నల్లి ధర్మారావులకు శ్రమ అవార్డులను సీఐటీయూ ఏపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నర్సింగరావు అందజేశారు. కార్యక్రమంలో అరసం నాయకులు ఉప్పల అప్పలరాజు, కవి, రచయిత ఫ్రాన్సిస్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -