Friday, February 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంజీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయడం అన్యాయం

జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లు చేయడం అన్యాయం

- Advertisement -

హైకోర్టులో పిటీషన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జీహెచ్‌ఎంసీకి సమీపంలోని 26 మున్సిపల్‌, ఇతర స్థానిక సంస్థలను విలీనం చేసి మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల11న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 55ను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన దారం గురవారెడ్డి వేసిన పిటిషన్‌ను చీఫ్‌ జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన బెంచ్‌ గురువారం విచారించింది. జీవో అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చేందుకు నిరాకరించింది.

జనాభా గణాంకాల ప్రక్రియను కొనసాగించవచ్చునని స్పష్టం చేసింది. జీహెచ్‌ఎంసీని సైబరాబాద్‌, మల్కాజిగిరి, గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ల పేరుతో మూడుగా విభజిస్తూ ప్రభుత్వం ఫిబ్రవరిలో జీవో 55 జారీ చేసింది. కేంద్ర జనాభా గణాంకాల కమిషనర్‌ 2025 జూన్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం జనాభా గణాంకాలు జరగాల్సివుంది. 2025 జులై 1 నుంచి డిసెంబరు 31 నాటి వరకు ఉన్న స్థానిక సంస్థల పరిధులను మార్పు చేయడానికి వీల్లేదని పిటిషనర్ల వాదన. జీహెచ్‌ఎంసీ పునర్విభజన చర్య జనాభా లెక్కల సేకరణ ప్రారంభానికి అడ్డంకి కాదనీ, జనాభా గణాంకాలను సేకరణ కొనసా గింపు వ్యవహారంలో జోక్యం చేసుకునేందుకు కోర్టు నిరాకరించింది.

ఓట్లు ఎందుకు తొలగించారు?
జూబ్లీహిల్స్‌ కో ఆపరేటీవ్‌ హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల ఓటర్ల జాబితాలో పిటిషనర్ల పేర్లను ఎందుకు తొలగించారో చెప్పాలని సొసైటీ అధ్యక్షుడు, సహకార శాఖ ముఖ్య కార్యదర్శి, రిజిస్ట్రార్‌, రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీలను హైకోర్టు ఆదేశించింది. విచారణ ఈ నెల 23కు వాయిదా వేసింది. సహకార శాఖ రిజిస్ట్రార్‌, జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ ఈ నెల 9న ప్రచురించిన తాత్కాలిక ఓటర్ల జాబితాలో తమ పేర్లను చేర్చకపోవడాన్ని సవాల్‌ చేస్తూ హరినాథ్‌బాబు ఇతరులు వేసిన పిటిషన్‌ను జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి గురువారం విచారించారు. ఇదే కేసుకు సంబంధించి సొసైటీలో అనర్హులను ఓటర్లుగా చేర్చారనీ, సొసైటీ అధ్యక్షుడు రవీంద్రనాథ్‌పై ఆరు వారాల్లో చర్యలు తీసుకోవాలని గతంలో హైకోర్టు ఆదేశించినా.. చర్యలు లేవంటూ దాఖలైన కోర్టుధిక్కరణ పిటిషన్‌ ను మరో న్యాయమూర్తి జస్టిస్‌ మాధవీదేవి తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.

ఆ కౌన్సిలర్‌కు రెండు ఓట్లు
ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కౌన్సిలర్‌ బుగ్గ రాములుకు రెండు ఓట్లు ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్‌ను గురువారం హైకోర్టు విచారించింది. ప్రతివాదులైన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి, కలెక్టర్‌, ఆర్డీవోలతోపాటు కౌన్సిలర్‌ బుగ్గా రాములకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేస్తూ జస్టిస్‌ శ్రవణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు ఓట్లు ఉన్నప్పటికీ బుగ్గరాములు (బీఆర్‌ఎస్‌) నామినేషన్‌ను తిరస్కరించలేదనీ, ఆయన కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారంటూ రాములు అనే వ్యక్తి వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

సీఎంకు కోర్టు హాజరు నుంచి మినహాయింపు
జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి, భూపాలపల్లి పీఎస్‌ల్లో సీఎం రేవంత్‌రెడ్డిపై నమోదైన క్రిమినల్‌ కేసుల్లో ఆయనకు ఉపశమనం లభించింది. 2023లో దాఖలైన కేసులో ట్రయల్‌ కోర్టుకు విచారణకు హాజరుకాకుండా హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. ఎంపీగా, పీసీసీ చీఫ్‌గా ఉండగా రేవంత్‌రెడ్డి ప్రసంగాలపై బీఆర్‌ఎస్‌ నేత గండ్ర వెంకటరమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను కొట్టేయాలని రేవంత్‌రెడ్డి వేసిన పిటిషన్లపై విచారణ మార్చి 5కు వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -