– ముస్లిం అధికారిపై బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు
– కేసు నమోదు చేసిన కర్నాటక పోలీసులు
బెంగళూరు: కర్నాటకలోని కలబురగి జిల్లా డిప్యూటీ కమిషనర్, జిల్లా మెజిస్ట్రేట్ ఫౌజియా తరనమ్‌పై బీజేపీ నాయకుడు, ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ నోరు పారేసుకున్నారు. శాస నమండలిలో ప్రతి పక్షాల చీఫ్ విప్‌గా కూడా వ్యవహరిస్తున్న రవికుమార్ ఆ ముస్లిం అధికారిని ఉద్దేశించి ‘ఆమె పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండవచ్చు’ అంటూ అనుచిత వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో రవికుమార్‌పై కలబురగిలో పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. బీజేపీ నేత వ్యాఖ్యలను కర్నాటక ఐఏఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ‘ఐఏఎస్ అధికారి ఫౌజియా తరనమ్ ప్రజలకు, రాష్ట్రానికి ఎన్నో సేవలు అందిస్తున్నారు. ఆమెపై రవికుమార్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి. అవి న్యాయసమ్మతం కావు. ఇలాంటి వ్యాఖ్యలు ఐఏఎస్ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. వారికి మానసిక ఆందోళన కలిగిస్తాయి. ఈ వ్యాఖ్యలు చేయడమంటే విధి నిర్వహణలో ఉన్న అధికారులను వేధించడమే అవుతుంది’ అని ఆ సంఘం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
బాధ్యతారాహిత్యమైన, అంగీకారయోగ్యం కాని వ్యాఖ్యలు చేసినందుకు రవికుమార్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అధికారుల సంఘం డిమాండ్ చేసింది. జిల్లా మెజిస్ట్రేట్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారిపై ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేసినందుకు ఆయనపై కేసు నమోదు చేయాలని పట్టుపట్టింది. ఈ వివాదంపై తరునమ్ ఇంకా స్పందించలేదు. ఎన్నికల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు కనబరచినందుకు ఆమెకు గతంలో అవార్డు కూడా వచ్చింది. కాగా మధ్యప్రదేశ్ మంత్రి విజరు షా ఇటీవలే ఆపరేషన్ సిందూర్‌లో భాగస్వామి అయిన కల్నల్ సోఫియా ఖురేషీపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా ఆయన అభివర్ణించారు. దీనిపై మండిపడిన సుప్రీంకోర్టు ఆయన క్షమాపణలను తోసిపుచ్చింది. అయినప్పటికీ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం ఆయనపై ఎలాంటి చర్య తీసుకోలేదు.
పాకిస్తాన్ నుంచి వచ్చి ఉండవచ్చు
- Advertisement -
- Advertisement -