Monday, January 26, 2026
E-PAPER
Homeజాతీయంఅయోమయంలో ఐటీ నిపుణులు

అయోమయంలో ఐటీ నిపుణులు

- Advertisement -

కుటుంబాలు, ఉద్యోగాలకు దూరం
2027 వరకూ తప్పని నిరీక్షణ
మళ్లీ వాయిదా పడిన హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు

న్యూఢిల్లీ : దేశంలోని అమెరికా కాన్సులేట్‌ కార్యాలయాలలో బ్యాక్‌లాగ్‌ల సంఖ్య పెరిగిపోతుండడంతో హెచ్‌-1బీ వీసా ఇంటర్వ్యూలు వచ్చే సంవత్సరం వరకూ వాయిదా పడబోతున్నాయి. ఈ సుదీర్ఘ జాప్యం వేలాది మంది భారతీయ నిపుణులపై ప్రభావం చూపబోతోంది. అనేక మంది నిపుణులు తమ కుటుంబాలకు, అమెరికాలో ఉద్యోగాలకు దూరం కాబోతున్నారు. ఇంటర్వ్యూల బాక్‌లాగ్‌లు గత సంవత్సరం ప్రారంభమయ్యాయి. ఈ సంవత్సరం మార్చిలో ఇంటర్వ్యూలు జరుగుతాయని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత అవి అక్టోబరుకు వాయిదా పడ్డాయి. ఇప్పుడేమో ఏకంగా వచ్చే సంవత్సరానికి వాయిదా వేశారు.

ఇప్పట్లో పరిష్కారం లేదా?
ప్రస్తుతం నెలకొన్న సమస్య ఇప్పుడప్పుడే పరిష్కారం కాబోదని ఇమ్మిగ్రేషన్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న హెచ్‌-1బీ వీసా ఉద్యోగులు వీసా స్టాంపింగ్‌, ప్రాసెసింగ్‌ కోసం భారత్‌ రావాలని వారు సూచించారు. ఎందుకంటే ఇంటర్వ్యూల ప్రక్రియ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. భారత్‌కు ఉద్దేశించిన కొత్త వీసా ఇంటర్వ్యూల స్లాట్లకు సంబంధించి గత యాభై రోజులుగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదని హూస్టన్‌లోని ఓ ఇమ్మిగ్రేషన్‌ సంస్థ భాగస్వామి ఎమిలీ న్యూమాన్‌ తెలిపారు. ‘మీకు వీసా ఇవ్వడానికి వారేమీ తొందరపడడం లేదు. వాటిని నిరాకరించేందుకే ప్రయత్నిస్తున్నారు. బైడెన్‌ ప్రభుత్వ పాలనలో మనం చూసిన దానికి ఇది పూర్తి భిన్నమైన ప్రపంచం. ఈ ప్రభుత్వం మీకు వీసాలు ఇచ్చేందుకు సుముఖంగా లేదు’ అని వివరించారు.

ఇంటర్వ్యూ స్లాట్లు లేవు
వీసా ఇంటర్వ్యూల తేదీలు ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చాయి. గత సంవత్సరం డిసెంబరులో మొదటిసారి వాయిదా పడిన ఇంటర్వ్యూలు ఆ తర్వాత ఈ ఏడాది మార్చికి, అనంతరం జూన్‌కు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత వాటిని అక్టోబరుకు రీషెడ్యూల్‌ చేశారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, హైదరాబాద్‌, కొల్‌కతాలోని కాన్సులేట్లలో ఇంటర్వ్యూ స్లాట్లు లేవు. దీంతో అధికారులు ప్రస్తుత అపాయింట్‌మెంట్లను వచ్చే సంవత్సరానికి రీషెడ్యూల్‌ చేయాల్సి వచ్చింది. గత సంవత్సరం డిసెంబర్‌ 15వ తేదీన ఇమ్మిగ్రేషన్‌ విధానంలో ప్రకటించిన మార్పుల కారణంగా బ్యాక్‌లాగ్‌లు చోటుచేసుకున్నాయని అనేక నివేదికలు చెబుతున్నాయి.

దరఖాస్తుదారుల అసహనం
వీసా అపాయింట్‌మెంట్లలో జాప్యం, ఇంటర్వ్యూల రీషెడ్యూల్‌పై పలువురు దరఖాస్తుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై కాన్సులేట్‌లో అపాయింట్‌మెంట్లను వచ్చే సంవత్సరం మే 24వ తేదీకి వాయిదా వేశారని కొందరు దరఖాస్తుదారులు తెలిపారు. అమెరికాను వదిలి వచ్చిన వారిని అడ్డుకునేందుకు అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పూనుకున్నారని పలువురు అనుమానిస్తున్నారు. వీసా అపాయింట్‌మెంట్లలో తీవ్రమైన జాప్యం జరుగుతుండడంతో కుటుంబాలకు సుదీర్ఘ కాలం దూరంగా ఉండాల్సి వస్తోంది. హెచ్‌-1బీ వీసాదారులు అమెరికా వెలుపలే ఉన్నట్ల యితే పొడిగింపుల కోసం దరఖాస్తు చేసుకోవడంలో యాజమాన్యాలు ఇబ్బంది పడతాయి. దీర్ఘకాల జాప్యం కారణంగా అటు ఉద్యోగులలో కూడా అనిశ్చితి, ఒత్తిడి పెరుగుతోంది. రొటీన్‌గా జరిగే వీసా ప్రక్రియ కూడా చాలా కాలం పాటు సాగుతుండడంతో దీనికి అంతం ఎప్పుడో తెలియని పరిస్థితి నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -