Thursday, February 26, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాకు ఇది స్వర్ణయుగం

అమెరికాకు ఇది స్వర్ణయుగం

- Advertisement -

భారత్‌, పాక్‌ అణు యుద్ధాన్ని నేనే ఆపా : ట్రంప్‌
స్టేట్‌ ఆఫ్‌ ది యూనియన్‌ ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు

వాషింగ్టన్‌ : అమెరికాకు స్వర్ణయుగం మళ్లీ ప్రారంభమైందని అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని అన్నా రు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలను సమర్థించారు. 2026 స్టేట్‌ ఆఫ్‌ ది యూని యన్‌ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్‌-పాక్‌ యుద్ధాన్ని తానే ఆపినట్టు పునరుద్ఘాటించారు. అలాగే అణు ఒప్పందం చేసుకోకపోతే దాడులు తప్పవు అంటూ హెచ్చరించారు.
‘అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి 10నెలల్లోనే నేను ఎనిమిది యుద్ధాలు ముగించా. కంబోడియా- థారులాండ్‌, పాకిస్థాన్‌- భారత్‌ మధ్య అణు యుద్ధం జరిగేదే. నా జోక్యం లేకపోతే 3.5 కోట్ల మంది చనిపోయేవారని పాకిస్థాన్‌ ప్రధాని అన్నారు. నేను అధ్యక్షుడిగా ఉన్నట్లయితే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం జరిగేది కాదు. రెండు దేశాల మధ్య జరుగుతున్న హింసను ఆపేందుకు మా ప్రభుత్వం కషి చేస్తోంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే భారత్‌ యుద్ధాన్ని ప్రస్తావిస్తున్నప్పడు తాను లేకపోతే పాక్‌ ప్రధాని చనిపోయి ఉండేవారని ట్రంప్‌ నోరు జారారు. కానీ వెంటనే 3.5 కోట్ల మంది యుద్ధంలో చనిపోయే వారని పాక్‌ ప్రధాని తనతో చెప్పినట్లు వెల్లడించారు.

అక్రమ వలసలు తగ్గాయి : ట్రంప్‌
అమెరికా గతంలో కన్నా ఇప్పుడు మెరుగ్గా, సుసంపన్నంగా మారిందని ట్రంప్‌ అన్నారు. ‘గత తొమ్మిది నెలల్లో అక్రమంగా విదేశీయలు ఎవరూ అమెరికాలోకి ప్రవేశించలేదు. చట్టబద్ధంగా అమెరికాకు వచ్చే వారిని ఎల్లప్పుడూ అనుమతిస్తాం. అక్రమ వలసలను, ప్రాణాంతక ఫెంటానిల్‌ను అమెరికా సమర్థవంతంగా అడ్డుకుంది. ఇక జో బైడెన్‌ పాలనలో దేశ చరిత్రలోనే అత్యంత దారుణమైన ద్రవ్యోల్బణాన్ని చూశాం. కానీ 12నెలల్లో నా పరిపాలన ఐదు సంవత్సరాల కనిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణాన్ని తగ్గించింది. 2025 చివరి మూడు నెలల్లో ఇది 1.7 శాతానికి తగ్గింది. గత ప్రభుత్వం నాలుగేండ్లలో అమెరికాకు ఒక ట్రిలియన్‌ డాలర్ల కంటే తక్కువ పెట్టుబడులు తీసుకొస్తే ఒక్క సంవత్సరంలోనే నా ప్రభుత్వం 18 ట్రిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు సాధించింది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్‌ మదురో నిర్బంధం తర్వాత ఆ దేశం నుంచి 80 మిలియన్‌ బ్యారల్స్‌కు పైగా చమురు అమెరికాకు వచ్చింది’ అని ట్రంప్‌ వివరించారు.

ఇరాన్‌కు ట్రంప్‌ వార్నింగ్‌
ఇరాన్‌ తన అణు, క్షిపణి సామర్ధ్యాలను పెంపొందించుకునే ప్రయత్నాలను తిరిగి ప్రారంభిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ఆరోపించారు. ఇలాంటి వాటికి అనమతించకూడదనేది అమెరికా విధానమని తెలిపారు. దౌత్యపరమైన పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తానని ఆయన చెబుతున్నప్పటికీ అవసరమైతే కఠిన నిర్ణయాలకు వెనుకాడబోనని హెచ్చరించారు. ‘యూరప్‌, విదేశాల్లోని మా స్థావరాలను లక్ష్యంగా చేసుకునే క్షిపణులను వారు ఇప్పటికే అభివృద్ధి చేశారు. త్వరలో అమెరికాను కూడా చేరుకునే క్షిపణుల తయారీలో ఉన్నారు. దౌత్యపరంగా సమస్యను పరిష్కరించడమే నా ఉద్దేశం. కానీ ప్రపంచంలో అగ్రగామి ఉగ్రవాద ప్రోత్సాహక దేశం అణ్వాయుధాలను కలిగి ఉండటానికి నేను ఎప్పటికీ అనుమతించను. అలా జరగకూడదు’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం
ప్రపంచ దేశాలపై అమెరికా విధించిన సుంకాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ట్రంప్‌ అన్నారు. అయితే దాదాపు అన్ని దేశాలు తమతో కుదుర్చుకున్న ఒప్పందాలను కొనసాగించాలని కోరుకుంటున్నాయని చెప్పారు. దశాబ్దాలుగా మనల్ని మోసం చేసిన దేశాలు ఇప్పుడు మనకు వందల బిలియన్‌ డాలర్లు చెల్లిస్తున్నాయని పేర్కొన్నారు. ఆధునిక ఆదాయ పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికే టారిఫ్‌లు విధించినట్టు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. ‘బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్‌’తో అమెరికన్లకు ఉపశమనం కలిగిందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో దీనిని వ్యతిరేకించిన డెమొక్రాట్లను తీవ్రంగా విమర్శించారు. ప్రజలను బాధ పెట్టడానికి వారు పెద్ద ఎత్తున పన్నులు పెంచాలని కోరుకుంటున్నారని ట్రంప్‌ ఆరోపించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -