Sunday, November 2, 2025
E-PAPER
Homeజోష్తండ్రి ప్రోత్సాహంతోనే సాధ్యమైంది

తండ్రి ప్రోత్సాహంతోనే సాధ్యమైంది

- Advertisement -

చిన్నతనంలో చదువులో అంతంత మాత్రమే రాణించిన ఓ అబ్బాయి ఎదిగే క్రమంలో తల్లిదండ్రులు, మేనమామ ప్రోత్సాహంతో ఉన్నత చదువులు అభ్యసించి గ్రూప్‌ వన్‌ లో రాష్ట్ర స్థాయిలో 11వ ర్యాంకు సాధించి జోగులాంబ గద్వాల జిల్లా ట్రైనీ డిప్యూటీ కలెక్టర్‌ గా విధులు నిర్వహిస్తున్న నన్నూరి మనోజ్‌ కుమార్‌ రెడ్డి విజయప్రస్థానం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది.

కుటుంబ నేపథ్యం: తండ్రి వెంకటరామరెడ్డి వ్యవసాయంతో పాటు ఫార్మా డిస్ట్రిబ్యూషన్‌ వ్యాపారం చేస్తుండగా, తల్లి విజయలక్ష్మి నల్గొండ జిల్లా గట్టు ఉప్పల్‌ మండలం నామాపురం ఎంపీపీఎస్‌ లో ఎస్జిటి గా విధులు నిర్వహిస్తున్నారు. అక్క సాధన అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం గుడపూర్‌ స్వగ్రామం కాగా వీరి కుటుంబం ప్రస్తుతం హైదరాబాదులో స్థిరపడింది.
విద్యాభ్యాసం: మనోజ్‌ కుమార్‌ రెడ్డి నల్లగొండ పట్టణంలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. ఈ సమయంలో చదువులో అంతంత మాత్రమే రాణించారు. సూర్యాపేటలో మేనమామ గుత్తికొండ రమేష్‌ రెడ్డి నిర్వహిస్తున్న పాఠశాలలో చేరి ఆయన ప్రోత్సహంతో మెరిట్‌ విద్యార్థిగా పేరు తెచ్చుకున్నారు. ఆరు నుంచి పదవ తరగతి వరకు అక్కడ చదివి 9.8 జిపిఏ సాధించి మంచి ర్యాంకర్‌ గా నిలిచారు. హైదరాబాదులో ఇంటర్మీడియట్‌ విద్యనభ్యసించి 971 మార్కులతో సత్తా చాటారు. టీకేఆర్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ చదివిన మనోజ్‌ కుమార్‌ రెడ్డి 72% మార్కులతో కళాశాల ఈసీఈ బ్రాంచ్‌ టాపర్గా నిలిచాడు. ఢిల్లీలోని ఇగ్నో విశ్వవిద్యాలయంలో ఎంఏ (సోషియాలజీ) పూర్తి చేసారు.

ఢిల్లీలో సివిల్స్‌ కు శిక్షణ: 2019లో ఢిల్లీలో మనోజ్‌ కుమార్‌ రెడ్డి సివిల్స్‌ కు శిక్షణ తీసుకున్నారు. 2020, 2021లో రెండుసార్లు కరోనా బారిన పడినప్పటికీ, తాత సత్యనారాయణ రెడ్డి మరణం బాధ పెట్టినప్పటికీ సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాయడం జరిగింది. ప్రిలిమ్స్‌ లోనే అపజయం వెక్కిరించినా అధైర్య పడకుండా మళ్ళీ ప్రయత్నించమని తండ్రి ప్రోత్సహించారు. గొప్ప స్థాయికి చేరుకునే ప్రతిభ కుమారుడిలో ఉందని వెంకట రామరెడ్డి అప్పటినుంచి మనోజ్‌ కుమార్‌ ని ‘సారు’ అని పిలవడం ప్రారంభించారు. తనపై తండ్రికి ఉన్న అపారమైన నమ్మకాన్ని వమ్ము చేయరాదనే దడ సంకల్పంతో మనోజ్‌ కుమార్‌ రెడ్డి సివిల్స్‌ తో పాటు గ్రూప్స్కు కూడా ప్రిపేర్‌ కావడం ప్రారంభించారు. 2022లో సివిల్స్‌ లో ప్రిలిమ్స్‌ పాస్‌ అయినప్పటికీ మెయిన్స్‌ దాటలేకపోయారు. ఐఎఫ్‌ఎస్‌ కూడా ప్రయత్నించినప్పటికీ మెయిన్స్‌ లో వెనుతిరగాల్సి వచ్చింది. గ్రూప్‌ వన్‌ పరీక్షకు కోర్టు అడ్డంకులు మొదలు కావడంతో గ్రూప్‌-2, గ్రూప్‌ -3 పరీక్షలను సైతం రాయడం జరిగింది. మరోపక్క తండ్రి చేస్తున్న ఫార్మా వ్యాపారానికి చేదోడు వాదోడుగా నిలుస్తూ ముందుకెళ్లడం జరిగింది.

తన కళాశాలకు తానే ముఖ్యఅతిథిగా: మనోజ్‌ కుమార్‌ రెడ్డి గ్రూప్‌ వన్‌ లో రాష్ట్రస్థాయిలో 11వ ర్యాంకు సాధించి, గ్రూప్‌-2 లో 186, గ్రూప్‌-3 లో 337 ర్యాంకులు సాధించడం పట్ల సోషల్‌ మీడియాలో పలువురు విమర్శించారు. తాను సివిల్స్‌ సాధించే లక్ష్యంతో సాధన చేశానని, అది గ్రూప్‌ వన్‌ కు బాగా ఉపయోగపడిందన్నారు. గ్రూప్‌ -2, 3 పోటీ పరీక్షలను నామమాత్రంగా చదివి రాయడం జరిగిందని దాంతో మంచి ర్యాంకులు సాధించలేకపోయానని తెలియజేశారు. ఈ విషయంలో కొంతమంది సోషల్‌ మీడియాలో చేసిన విమర్శలకు కొంత బాధపడినప్పటికీ అందుకు కారణం ఏంటో ఇప్పటికైనా వాళ్లకు తెలుస్తుందన్నారు. తాను గ్రూప్‌ వన్‌ లో మంచి ర్యాంక్‌ సాధించడంతో ఈ ఏడాది ఏప్రిల్‌ 4న బిటెక్‌ చదివిన కళాశాల వార్షికోత్సవానికి ముఖ్యఅతిథిగా తనను ఆహ్వానించడం గర్వకారణంగా ఉందన్నారు. వేదికపై నుంచి విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలా ప్రసంగించే అవకాశం కళాశాల యాజమాన్యం తనకివ్వడం సంతోషాన్ని కలిగించిందన్నారు.

సివిల్స్‌ సాధించడమే ధ్యేయం: నల్గొండలో తాను ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న సమయంలో ఓసారి పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా అప్పటి ఎస్పీ గారు ముఖ్యఅతిథిగా రావడంతో ఆయనకు ప్రతి ఒక్కరూ ఎంతో గౌరవం ఇవ్వడాన్ని గమనించానని చెప్పారు. ఉన్నత స్థాయికి ఎదిగితే సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఆ సమయంలో తన తండ్రి తెలియజేసినట్లు చెప్పారు. దాంతో తాను సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. శిక్షణ డిప్యూటీ కలెక్టర్‌ గా విధులు నిర్వహిస్తూనే సమయం దొరికినప్పుడల్లా సివిల్స్కు సాధన చేస్తున్నానన్నారు.
యువత ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలి: ప్రస్తుతం సమాజంలో ఎక్కువ శాతం యువత తాత్కాలిక సంతోషాల కోసం పరుగులు తీస్తున్నట్లు మనోజ్‌ కుమార్‌ రెడ్డి గమనించానన్నారు. యువత సెల్‌ ఫోన్లను అనవసరంగా వినియోగించకుండా, వ్యసనాల బారిన పడకుండా నైతిక విలువలతో కూడిన జీవనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. మనం గొప్ప స్థాయికి వెళ్లాలనే తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చడమే కాక, సమాజ అభ్యున్నతికి తమ వంతు కృషి చేయాలనే దృడ సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఉన్నత లక్ష్యాలతో ముందుకెళ్లాలని సూచించారు. ఇందుకు ఇంటర్‌ స్థాయి నుంచి తమకు ఇష్టమైన సబ్జెక్టులలో రాణిస్తూ ప్రణాళిక బద్ధంగా చదివితే అనుకున్న స్థాయికి ఎదగవచ్చని తెలియజేశారు.

మెరుగైన సేవలందించడమే కర్తవ్యం: సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు కనీస అవసరాలు సమకూరేలా మనోజ్‌ కుమార్‌ రెడ్డి తన వంతుగా కృషి చేస్తానన్నారు. ఏఐ వంటి సాంకేతిక విషయాల్లో అట్టడుగు వర్గాల ప్రజలకు సైతం ప్రభుత్వం నుంచి అవసరమైన పూర్తిస్థాయి సహకారం అందినప్పుడు మన రాష్ట్రం అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధిస్తుందన్నారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు నిర్వహిస్తున్న తెలంగాణ రైసింగ్‌ విజన్‌ 2047 ప్రజాభిప్రాయ సేకరణలో తాను కూడా పాల్గొని సలహాలు, సూచనలు చేసినట్లు చెప్పారు . ప్రతి పౌరుడు కూడా ఈ సర్వేలో పాల్గొని తమ అమూల్యమైన సలహాలను తెలియజేయాలని మనోజ్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. తాను శిక్షణ పొందే ఏడాది కాలంలో జోగులాంబ గద్వాల జిల్లా అక్షరాస్యత విషయంలో మెరుగుపడేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానన్నారు.

  • ఉప్పల శ్రీనివాసరెడ్డి
    94402 32904
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -