వ్యక్తులపై కాదు.. పాలసీలపైనే మా పోరాటం
కొండగట్టు అంజన్నతోనే నాకు పునర్జన్మ
రెండు రాష్ట్రాల సమన్వయంతో ఆలయ అభివృద్ధి
జగిత్యాల జిల్లా కొండగట్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో ఆలయ అభివృద్ధి పనులు
96 గదుల వసతి సముదాయ నిర్మాణానికి శంకుస్థాపన
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
‘నాలో ఉన్న తెగువ, తెగింపు, పోరాట పటిమ నేర్పింది తెలంగాణే.. నా పోరాటం వ్యక్తులపై కాదు.. పాలసీలపైనే ఉంటుంది’ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. శనివారం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. గతంలో విద్యుత్ ప్రమాదం నుంచి అంజన్నే తనను కాపాడారని, కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లో తనకు కావాల్సిన పోరాట పటిమ, చైతన్యం, తెగింపు అన్నీ తెలంగాణ నేల నుంచే వచ్చాయి’ అని అన్నారు. ఓటమికి భయపడకుండా ప్రజల కోసం నిలబడే తత్వం ఇక్కడి ప్రజల స్ఫూర్తి నుంచే తనకు వచ్చిందన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, నిరంతరం ప్రజల మధ్య ఉంటూ పోటీ చేయడం అలవాటు చేసుకోవాలని అన్నారు. రాజకీయాల్లో తనకు వ్యక్తిగతంగా ఎవరూ శత్రువులు లేరని పవన్ స్పష్టం చేశారు. జనసేన పోరాటం ఎప్పుడూ విధానాల (పాలసీల) పరంగానే ఉంటుందని, అందులో ప్రజా ప్రయోజనాలే పరమావధి అని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ‘జనసైనికులు’ ఎల్లప్పుడూ ముందుండాలని సూచించారు. వంద మైళ్ల ప్రయాణం ఒక్క అడుగుతోనే మొదలవుతుందని, జనసేన ప్రయాణం ఇప్పుడు బలంగా సాగుతోందని అన్నారు.
అభివృద్ధిలో రెండు రాష్ట్రాల సహకారం
కొండగట్టు ఆలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కొండగట్టు గిరిప్రదక్షిణ మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తాను స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు. కొండగట్టు ఆలయానికి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం టీటీడీ కేటాయించిన రూ.35.19 కోట్లతో పలు అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ భూమిపూజ చేశారు. ఇందులో భాగంగా 96 గదులతో కూడిన భారీ వసతి సముదాయం (ధర్మశాల), సందర్శకుల కోసం ప్రత్యేకంగా దీక్ష విరమణ మండప నిర్మాణానికి శంకస్థాపన చేశారు. ఈ పర్యటనలో తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, టీటీడీ చైర్మెన్ బిఆర్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
నేను సెంట్రలిస్టుని.. : పవన్‌కళ్యాణ్
‘నాకు ఏ సిద్ధాంతమూ లేదంటారు. నాకు ఫలానా సిద్ధాంతం ఏదైనా ఉందని చెప్పాలంటే నేను లెఫ్టిస్టునో, రైటిస్టునో కావచ్చు. కానీ నేను సెంట్రలిస్టును. ఎందుకంటే డబ్బు ఉన్న వాడే ఉండకూడదు అని చెప్పే కమ్యూనిస్టు సిద్ధాంతమే సరైందయితే.. కమ్యూనిస్టు దేశం చైనానే క్యాపిలటిస్టుగా మారింది. అందుకే నేను సెంట్రలిస్టు సిద్ధాంతాన్ని ఒక ప్రయోగంగా తీసుకుని ముందుకు వెళ్తున్నా. అది పనిచేయడం వల్లే నేను ఉప ముఖ్యమంత్రిని అయ్యాను.’ అని పవన్ తన కార్యకర్తల ప్రత్యేక సమావేశంలో వ్యాఖ్యానించారు. దేశంలో మెజార్టీ ప్రజలంతా పాటించే హిందూ ధర్మం గురించి మాట్లాడినంత మాత్రాన తాను ముస్లిములకు వ్యతిరేకం కాదని, నేను ఏ వర్గానికో, ఏ మతానికో కొమ్ముకాయనని తెలిపారు. హిందూ దేవుళ్లపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని తప్పు అన్నందుకు తన మీద మత ముద్ర వేస్తున్నారన్నారు.
సుమారు అరగంటకుపైగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ తెలంగాణ సాయుధ పోరాటం గురించి, ఆదిలాబాద్ అటవి తల్లిబాట, నల్లమల యురేనియం తవ్వకాల వ్యతిరేక పోరాటం ఇలా పలు అంశాలపై మాట్లాడారు. తనకు బలహీనమైన వ్యక్తులు వేల మంది అవసరం లేదని, పార్టీ కోసం బలంగా నిలబడే వంద మంది ఉన్నా చాలంటూ కార్యకర్తలకు హితబోధ చేశారు.
పోరాట పటిమ, తెగింపు నేర్పింది తెలంగాణే..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



