Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి

ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి

- Advertisement -

– మహమ్మారి మళ్లీ వచ్చే అవకాశం
– జాగ్రత్తగా ఉండండి
– బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు
– మాతంగి స్వర్ణలత భవిష్యవాణి
నవతెలంగాణ-బేగంపేట్‌

‘ఈ ఏడాది వర్షాలు బాగా కురుస్తాయి.. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయి.. కానీ రాబోయే రోజుల్లో మహమ్మారి వెంటాడుతుంది.. అగ్నిప్రమాదాలు కూడా సంభవిస్తాయి.. జాగ్రత్తగా ఉండాలి’ అని మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. అలాగే ‘నాకు పూజలు చేసి రక్తం చూపించండి’ అని అన్నారు. సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాలు వైభవోపేతంగా కొనసాగాయి.. రెండో రోజు సోమవారం వేడుకల్లో ప్రధాన ఘట్టమైన ‘రంగం’ కార్యక్రమం జరిగింది. పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత ఎప్పటిలాగే భవిష్యవాణి వినిపించారు. మహంకాళి బోనాల ఉత్సవంతో సంతృప్తి చెందావా తల్లీ?.. అని అర్చకులు ఆమెను అడగ్గా.. ‘ప్రజలంతా డప్పు చప్పుళ్లతో ఆనందోత్సాహాల నడుమ తనకు బోనాలు సమర్పించారు. వచ్చిన ప్రతి బోనాన్నీ సంతోషంగా అందుకున్నాను. మీ అందరినీ సంతోషంగా సమానంగా చూస్తాను. కాలం తీరితే ఎవరు ఏది అనుభవించాలో అది అనుభవిస్తారు.. నేను అడ్డు రాను. బాలబాలికలను విచ్చలవిడిగా వదిలేస్తున్నారు.. కానీ నేను కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నాను. ప్రతి ఏటా ఉత్సవానికి ఏదో ఒక ఆటంకం కల్పిస్తున్నారు.. నన్ను ఎవరూ లెక్కచేయడం లేదు’ అని ఆగ్రహించారు. ‘రాశులకొద్దీ రప్పించుకుంటున్నారు.. గోరంతైనా తనకు దక్కడం లేదు.. సక్రమంగా పూజలు చేయడం లేదు.. అయినా నేను అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నా’ అని అన్నారు. ‘జరుగుతున్న పరిణామాల్లో నా పాత్ర ఉంటుంది.. నా రూపాన్ని పెట్టడానికి కూడా అడ్డుపడుతున్నారు.. నాకు ఎవరైతే ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తారో వాళ్లు రక్తం కక్కుకుంటారు. నాకు పూజలు చేసి రక్తం చూపించండి.. ఏటికొక్కసారి నాకు ఇలా పూజలు జరిపించాలి. నన్ను కొలిచే నా అక్కచెల్లెలు అందరికీ అండదండగా ఉంటాను’ అని అన్నారు.తర్వాత మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. సికింద్రాబాద్‌ మహంకాళి బోనాల జాతర బాగా జరిగిందని తెలిపారు. ప్రతి ఏడాది కంటే ఈసారి ఎక్కువ మంది వచ్చారని.. అమ్మవారికి జరగాల్సిన అన్ని పూజలూ ప్రభుత్వం పక్షాన చేస్తామని చెప్పారు. అమ్మవారు కోరుకున్నట్టు బలి విషయంలో ప్రభుత్వం ఆలోచన చేస్తుందని తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణకు తప్పనిసరి చర్యలు చేపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ హరిచందన దాసరి, అధికారులు పాల్గొన్నారు. అనంతరం పోతురాజుల విన్యాసాలు మేళతాళాలతో అంబారీ ఊరేగింపు ఘనంగా సాగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -