మదురోకు ట్రంప్ తాజా హెచ్చరిక
ముందు మీ సమస్యలపై దృష్టి పెట్టండి : వెనిజులా నేత హితవు
వాషింగ్టన్ : వెనిజులా నేత నికొలస్ మదురోకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరిక జారీ చేశారు. మదురో గద్దె దిగితే మంచిదని హితవు పలికారు. ఫ్లోరిడాలోని తన మార్-ఏ-లాగో రిసార్ట్‌లో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడుతూ వెనిజులాపై ఒత్తిడిని మరింత పెంచుతానని చెప్పారు. మదురోను పదవీచ్యుతుడిని చేయడమే లక్ష్యమా అని అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ ‘అదే జరుగుతుందని అనుకుంటున్నాను. ఏం చేయాలో నిర్ణయించుకోవాల్సింది ఆయనే. పదవిని వదిలేస్తే మంచిదని అనుకుంటున్నా. ఏదో ఒకటి చేస్తాం’ అని అన్నారు. ‘ఆయన ఏదో ఒకటి చేయాలనుకుంటే…దృఢంగా వ్యవహరిస్తే…అలా వ్యవహరించడం ఆయనకు అదే చివరిసారి అవుతుంది’ అని బెదిరింపు ధోరణిలో చెప్పారు.
ఇదిలావుండగా అమెరికా తీర గస్తీ దళం వెనిజులా తీరంలోని చమురు ట్యాంకర్‌ను వరుసగా రెండో రోజు కూడా వెంటాడింది. ‘అది కదులుతోంది. మేము దానిని పట్టుకుంటాం’ అని ట్రంప్ చెప్పారు. ఇప్పటి వరకూ స్వాధీనం చేసుకున్న రెండు నౌకలను, వాటిలోని నాలుగు మిలియన్ బ్యారళ్ల వెనిజులా చమురును తమ వద్దే వ్యూహాత్మక నిల్వలుగా ఉంచుకోవడమో లేదా అమ్మడమో చేస్తామని తెలిపారు.
ట్రంప్ తాజా హెచ్చరికపై మదురో ఘాటుగా స్పందించారు. ఆయన ప్రసంగాన్ని ప్రభుత్వ టెలివిజన్ ప్రసారం చేసింది. కారకాస్‌ను బెదిరించడానికి బదులు ట్రంప్ ముందు తన దేశ సమస్యలపై దృష్టి పెట్టాలని మదురో సూచించారు. ‘ఆయన అమెరికా ఆర్థిక, సామాజిక అంశాలపై దృష్టి పెడితే మంచిది. ప్రపంచం కూడా సంతోషిస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా వెనిజులా అభ్యర్థన మేరకు సంక్షోభంపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి మంగళవారం సమావేశమైంది. అయితే వివరాలు తెలియరాలేదు. రష్యా, చైనా దేశాలు వెనిజులా విజ్ఞప్తిని సమర్ధించాయి.
గద్దె దిగితే మంచిది
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



