నవతెలంగాణ-హైదరాబాద్: స్పెయిన్ తరహాలోనే ఇటలీ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్‌పై దాడులకు అమెరికా యుద్ధ విమానాలకు తమ దేశ గగనతలం నుంచి అనుమతి లేదని పేర్కొంది. ఈ మేరకు మంగళవారం ఇటలీ రక్షణ మంత్రి గైడో క్రోసెట్టో ప్రకటన విడుదల చేశారు.
సిసిలీలోని ‘నేవల్ ఎయిర్ స్టేషన్ సిగోనెల్లా’ వంటి స్థావరాల వినియోగం, దీర్ఘకాలంగా అమల్లో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాల పరిధిలోని లాజిస్టికల్, సాంకేతిక మద్దతుకు మాత్రమే పరిమితమై ఉంటుందని ఇటలీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇరాన్ పై దాడులకు కోసం ఇటలీ గడ్డను వినియోగించుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అయితే అటువంటి అనుమతి కోసం ఎవరూ అభ్యర్థించలేదని ఇటలీ ప్రధానమంత్రి మెలోని ‘RTL రేడియో’తో మాట్లాడుతూ పేర్కొన్నారని తెలియజేశారు. తాము పశ్చిమాసియా యుద్ధంలో భాగస్వామిగా ఉండము, ఇరాన్‌పై దాడులకు తాము వ్యతిరేకమన్నారు.
కాగా, అమెరికా విమానాలకు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్టు స్పెయిన్ సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. ఇరాన్‌తో జరుగుతోన్న యుద్ధంలో పాలుపంచుకొనే విమానాలను అనుమతించమని ఆ దేశ రక్షణ మంత్రి మార్గరెటా రొబెల్స్ సోమవారం వెల్లడించారు .ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ చేస్తోన్న యుద్ధాన్ని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఈ దేశంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆ దేశంతో వాణిజ్యాన్ని నిలిపేస్తామని హెచ్చరించారు..



