ప్రధాని మెలోనీపై వెల్లువెత్తిన ప్రజాగ్రహం
అడుగడుగునా దిగ్బంధనాలు…. పోలీసులతో ఘర్షణలు
సమ్మెతో స్తంభించిన ప్రజా రవాణా
రోమ్ : ఇటలీలోని పలు నగరాలు సోమవారం పాలస్తీనా అనుకూల ప్రదర్శనలతో మార్మోగిపోయాయి. పాలస్తీనా దేశాన్ని గుర్తించేందుకు ప్రధాని జియార్జియా మెలోనీ నిరాకరించడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాది మంది ప్రజలు రోడ్లపై కదం తొక్కుతూ తమను అడ్డుకున్న పోలీసులతో ఘర్షణకు దిగారు. రహదారులు, ఓడరేవులను దిగ్బంధించారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న మారణహోమాన్ని నిరసిస్తూ ‘ప్రతి దానినీ అడ్డుకోండి’ అంటూ కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త సమ్మె జరిగింది. మిలన్ నగరంలో నల్ల దుస్తులు ధరించిన ప్రదర్శకులు పాలస్తీనా పతాకాలు చేతపట్టుకొని సెంట్రల్ స్టేషన్‌లో ప్రవేశించారు. కిటికీ అద్దాన్ని ధ్వంసం చేశారు. పోలీసులపై కుర్చీలు విసిరారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మిలన్ స్టేషన్ వద్ద జరిగిన ఘర్షణలో 60 మంది పోలీస్ అధికారులు గాయపడ్డారని, పది మందిని అరెస్ట్ చేశారని ప్రభుత్వ మీడియా తెలిపింది.
పాలస్తీనా ప్రజలకు సంఘీభావం తెలుపుతూ కార్మికులు ఓడరేవుల్లో కార్యకలాపాలను అడ్డుకున్నారు. గాజాపై ప్రధాని మెలోనీ అనుసరిస్తున్న వైఖరిని ఆయన రాజకీయ ప్రత్యర్థులు తీవ్రంగా నిరసించారు. గాజాలో ఇజ్రాయిల్ సాగిస్తున్న హింస సిగ్గుచేటు అని మండి పడ్డారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో పాలస్తీనా దేశానికి అనుకూలంగా ఇటలీ ఓటు వేసింది. అయితే ప్రధాని మెలోనీ మాత్రం పాలస్తీనాను గుర్తించడానికి నిరాకరిస్తు న్నారు. కాగా వెనిస్ ఓడరేవులో కూడా ప్రదర్శకులను అడ్డుకోవడానికి పోలీసులు నీటి ఫిరంగులను ఉపయోగిం చారు. జెనోవా, లివోర్నో, త్రిస్టే నగరాల్లోని ఓడరేవుల్లో కార్మికులు నిరసన ప్రదర్శనలు జరిపారు. గాజాలో హమా స్‌కు వ్యతిరేకంగా జరుపుతున్న యుద్ధంలో ఉపయో గించడానికి తమ ఓడరేవుల ద్వారా ఆయుధాలు, ఇతర సరఫరాలు రవాణా అవుతుండడంపై మండిపడిన కార్మికు లు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. బోలోగ్నాలో ప్రదర్శకులు హైవేని దిగ్బంధించారు. వాహనాలను అడ్డుకొని పోలీసులతో ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించారు.
రాజధాని రోమ్‌లో వేలాది మంది పాలస్తీనా అనుకూలవాదులు రైల్వే స్టేషన్ వద్దకు చేరుకొని ప్రదర్శన నిర్వహించారు. ప్రధాన రింగ్ రోడ్డును దిగ్బంధించారు. ‘పాలస్తీనాకు విముక్తి కల్పించాలి’, ‘ప్రతి దానినీ అడ్డుకోండి’ అంటూ నినాదాలు చేశారు. దక్షిణాన ఉన్న నాపుల్స్ నగరంలో ప్రదర్శకులు, పోలీసుల మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రధాన రైల్వే స్టేషన్‌లోకి ప్రవేశిం చేందుకు నిరసనకారులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకు న్నారు. అయినప్పటికీ కొందరు వారి కన్నుగప్పి రైల్వే పట్టాల పైకి చేరుకున్నారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జెనోవా నగరంలో వేలాది మంది ప్రజలు పాలస్తీ నా పతాకాలతో ప్రదర్శన జరిపారు. నిరసన ప్రదర్శనల కారణంగా దేశంలో ప్రజా రవాణా స్తంభించి పోయింది. మిలన్‌లోని కీలక మెట్రో లైనును మూసివేశారు. తురిన్, బోలోగ్నా నగరాలలో యూనివర్సిటీ విద్యార్థులు తరగతి గదులలోకి అధ్యాపకులు రాకుండా అడ్డుకున్నారు. ఒకవైపు ఐరాస సర్వసభ్య సమావేశంలో పలు దేశాలు పాలస్తీనాను గుర్తిస్తుండగా మరోవైపు అనుకూల ప్రదర్శనలతో ఇటలీ మార్మోగిపోయింది. ప్రదర్శనకారులు విధ్వంసానికి పాల్పడ్డా రంటూ ప్రధాని మెలోని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ఇలాంటి చర్యలతో గాజా ప్రజల జీవితాలలో ఒక్క మార్పు కూడా రాదని శాపనార్థాలు పెట్టారు.