– పోడు భూములపై ఫారెస్టు అధికారుల దాడులు ఆపాలి
– హక్కు పత్రాలు వెంటనే ఇవ్వాలి
– లేదంటే హైదరాబాద్ వరకు ఆదివాసీలతో దండయాత్ర : తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం నేతలు బండారు రవికుమార్,కారంపుల్లయ్య
– అడుగడుగునా పోలీసుల అడ్డంకులు
– సంఘం ఆధ్వర్యంలో ఐటీడీఏ కార్యాలయం ముట్టడి
నవతెలంగాణ-ఏటూరునాగారం ఐటీడీఏ
ఆదివాసీ గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించి, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఎస్టీ కుల సర్టిఫికెట్లు, పోడు భూములకు పట్టాలివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బండారు రవికుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కారంపుల్లయ్య డిమాండ్ చేశారు. లేకుంటే హైదరాబాద్ వరకు ఆదివాసీలతో దండయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఏను ముట్టడించారు. ముందుగా ఏటూరునాగారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం నుంచి సుమారు మూడు వేల మంది వలస ఆదివాసీ గిరిజనులతో ఐటీడీఏ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ గేటు ఎదుట సుమారు రెండు గంటల పాటు ఆదివాసీలు వారి సమస్యలపై పీవో స్పందించాలంటూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రాకు అందజేశారు. గిరిజన సంఘం వెల్లడించిన సమస్యలపై పీవో సానుకూలంగా స్పందించారు. వలస ఆదివాసీలకు కుల, నివాస ధ్రువీకరణ పత్రా లను ఇవ్వడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లకు అర్హుల జాబితాను ఐటీడీఏ కోటాలో మంజూరు చేస్తామన్నారు. కాగా, ధర్నా జరగనీయకుండా పోలీసులు అనేక అడ్డంకులు కల్పించారు. ఈ సందర్భంగా బండారు రవికుమార్, కారం పుల్లయ్య మాట్లాడుతూ.. ఆదివాసీలు వారి సమస్యలను పరిష్కరించుకోవడానికి ఐటీడీఏకు వస్తుండగా వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాల పోలీసులు అడుగడుగునా వారిని అడ్డగించి ఐటీడీఏకు వెళ్లొద్దంటూ హెచ్చరించారని తెలిపారు. పోలీసుల బెదిరింపులను లెక్క చేయకుండా సమస్యల పరిష్కారం కోసం ఆదివాసీలు ఐక్యమవ్వడం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గిరిజనులకు హక్కు పత్రాలు ఇస్తామని చెప్పి ఎన్నికల్లో గెలిచిన సీతక్క తన హామీని మరిచిపోయిందని, పైగా వారిపై ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయిస్తూ, గిరిజనుల ఇండ్లను కూలగొట్టించడం దారుణమని అన్నారు. అర్హులైన ఆదివాసీలందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, ఫారెస్ట్ అధికారులు చేస్తున్న దాడులను ఆపాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ అధికారులనూ ఫారెస్టు అధికారులు లెక్కచేయకుండా గిరిజను లను భయభ్రాంతులకు గురి చేస్తు న్నారని అన్నారు. ఫారెస్టు అధికారు లను నియంత్రించాల్సిన బాధ్యత మంత్రి సీతక్కపై ఉంద న్నారు. వాజేడు మండలం మండపాక వద్దనున్న ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న వారికి కరెంటు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. గిరిజనులను అడవుల నుంచి వెళ్లగొట్టడానికి జీవో 49 తీసుకొచ్చి వారిపై తరచూ దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవో 49ను ఉపసంహ రించు కోవాలని, జీవో 3ను పునరుద్ధ రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుగ్గి చిరంజీవి, గొంది రాజేష్, జిల్లా కమిటీ సభ్యులు జడ్జరి దామోదర్, పూణేమ్ నగేష్, కురుసం చిరంజీవి, ఓకే ప్రభాకర్, కోరం చిరంజీవి, కురుసం శాంతి కుమారి, ఇరుప శ్రీను, అల్లం అశోక్, తోలం కృష్ణయ్య, కొట్టే కృష్ణారావు, కరం నాగేశ్వర రావు, పాయంకుమారి, తదితరులు పాల్గొన్నారు.
ఆదివాసీల అభివృద్ధికి ఐటీడీఏ బాధ్యత వహించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES