‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’ ప్రదానోత్సవ వేడుకలో బాలకృష్ణ
రూ.50 లక్షల విరాళం
బాలకృష్ణ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కామారెడ్డి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా తెలంగాణతోపాటు ఏపీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద బాధితులకు అండగా నిలవాలని బాలయ్య కోరారు. అగ్ర నటుడు బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (గోల్డ్ ఎడిషన్)లో ఆయన పేరు చేరింది. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ పురస్కారానికి ఎంపికైన తొలి హీరోగా బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేయటం విశేషం. హీరోగా ఆయన సినీ ప్రస్థానం 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. శనివారం హైదరాబాద్‌లో జరిగిన వేడుకలో బాలకృష్ణ ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి బండి సంజరుతోపాటు, ఏపీ మంత్రి నారాలోకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ,’నా తల్లిదండ్రుల తర్వాత నా అభిమానులు, సినీ దర్శక, నిర్మాతలే నాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు. అందరికీ నేను రుణ పడి ఉన్నాను. ఏపీలోనూ ఫిల్మ్ ఇండిస్టీని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తెలుగు సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్ళింది. మన సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా చూపించుకోగలుగుతున్నాం. మనమంతా గర్వించే సమయమిది. ఇలాంటి అరుదైన గౌరవం అందించిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ధన్యవాదాలు’ అని అన్నారు.
‘ఒక చరిత్ర రాయాలన్నా, దాన్ని తిరిగి రాయాలన్నా ఒక్క బాలయ్యబాబుతోనే సాధ్యం. 50 ఏళ్ళు సినిమా రంగంలో, అదే విధంగా రాజకీయాల్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి ఆయన. ఆయనలోని మానవత్వానికి నిదర్శనం బసవతారకం ఆస్పత్రి. ఆయనకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించడం తెలుగు జాతికి గర్వకారణం’ అని ఏపీ మంత్రి నారాలోకేశ్ చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజరు మాట్లాడుతూ,’ఈ అరుదైన గౌరవం బాలకృష్ణకు లభించడం తెలుగు ప్రజలకు గర్వకారణం. ఆయనలో భోళాతనం, గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం, నచ్చకపోతే రుద్రతాండవం. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి’ అని తెలిపారు.
బాలకృష్ణ నటనా ప్రతిభకు, ఆయన అసాధారణ విజయాలకు గుర్తింపుగా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సొంతం చేసుకోవడం అభినందనీయం. ఇకపై కూడా ఆయన మరిన్ని రికార్డులు క్రియేట్ చేయాలి. – అమితాబ్ బచ్చన్
‘ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు.. కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. ఇలాంటి డైలాగులు బాలయ్య తప్పితే ఎవ్వరూ చెప్పినా బాగుండదు. ఆయనకు ఆయనే పోటీ. ఆయనకు ఎవరూ పోటీ లేరు. బాలకృష్ణ సినిమా బాగా ఆడుతుందంటే కేవలం ఆయన అభిమానులు మాత్రమే కాదు అందరి హీరోల అభిమానులూ సంతోష పడతారు. అది ఆయన స్ట్రెంత్. ఆయన మిగిలిన 50ఏళ్ళు కూడా ఇలాగే సినిమాలు చేయాలి. – రజనీకాంత్
హీరోగా 50 ఏళ్ళ సినీ ప్రస్థానం పూర్తి చేసుకున్న బాలకృష్ణకు ఈ పురస్కారం లభించడం తెలుగు సినిమా పరిశ్రమకు గర్వకారణం. – నిర్మాత దిల్‌రాజు
50 ఏళ్ళుగా సినిమాని, వచ్చిన అవకాశాల్ని బాలకృష్ణ నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్ని ఆయన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇది ఇంతటితో ఆగేది కాదు. ఇంకా ఆయన ఎన్నో సాధిస్తారు. – దర్శకుడు బోయపాటి శ్రీను
బాలమ్యబాబు 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో ‘వీరసింహారెడ్డి’ సినిమాతో నేనూ ఉండటం గర్వంగా భావిస్తాను.త్వరలోనే బాలయ్య 2.0ని చూడబోతున్నారు.
– దర్శకుడు బాబీ
బాలయ్య సినిమాలకు పని చేస్తుంటే ఏదో ఒక ఫ్యూరిటీ ఉంటుంది. చెప్పలేనంత ఎనర్జీ వస్తుంది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మాత్రమే కాదు ‘అఖండ 2’తో మరిన్ని రికార్డులు వస్తాయి. – సంగీత దర్శకుడు తమన్
బాలమ్య బాబు ఎప్పుడూ రికార్డ్ బ్రేకరే. ఇకపై కూడా ఆయన మరిన్ని రికార్డులను బ్రేక్ చేయాలని ఆశిస్తున్నా.
– నిర్మాత డి.సురేష్‌బాబు
బాలకృష్ణ నటుడిగానే కాదు వ్యక్తిగానూ ఉన్నతమైన వ్యక్తిత్వం కలవారు. నేను ఎన్టీఆర్, బాలకృష్ణ సరసన రకరకాల పాత్రల్లో నటించాను. బాలకృష్ణ డెడికేషన్ ఇప్పటి యంగ్ జనరేషన్‌కు స్ఫూర్తి. – నటి జయసుధ