Tuesday, February 10, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుపంపకాలే పంపకాలు

పంపకాలే పంపకాలు

- Advertisement -

ముగిసిన ఎన్నికల ప్రచారం
చివరి రోజు హాట్‌ హాట్‌ కామెంట్లు
మూడు రోజుల ముందు నుంచే మొదలైన పంపకాలు
ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల పంపకాలు చాలా వరకు పూర్తి
మొదలైన అధికార పార్టీ తాయిలాల ఎర
రూ.1500 నుంచి మొదలు… ప్రతిష్టాత్మకమైన చోట రూ. 5 వేల వరకు…
అండర్‌ కోర్‌ ఆపరేషన్‌ లో ముఖ్య నేతలు… మారుతున్న సమీకరణాలు
పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలోని 2,996 వార్డులకు ఫిబ్రవరి 11న పోలింగ్‌ జరగనుంది. ఎన్నికలకు సంబంధించి 48 గంటల ముందు సోమవారం సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ ప్రచారానికి తెరపడింది. చివరి రోజు ప్రచారం హోరాహోరీగా సాగింది. అధికార, ప్రతిపక్షాలు హాట్‌ హాట్‌ కామెంట్లు చేసుకున్నాయి. రోడ్‌ షోలు, ర్యాలీలతో పార్టీలు హోరెత్తించాయి. ఇప్పటికే ప్రచార పర్వం మొదలైంది. విపక్షాలు ముందస్తు ఎత్తుగడతో మూడు రోజులు ముందు నుంచే పంపకాలు మొదలుపెట్టాయి.

అధికారపక్షం నుంచి ఒత్తిళ్లు ఉంటాయని కారణంతో మూడు రోజుల ముందుగానే పంపిణీలు షురూ చేశారు. కొన్నిచోట్ల అధికార పక్షం సైతం ముందస్తు పంపకాలు మొదలుపెట్టింది. ఓటుకు రూ.1500 మొదలు… ప్రతిష్టాత్మకమైన చోట రూ. 5,000 వరకు పంచుతున్నారు. అధికార, విపక్ష ముఖ్య నేతలు ఇప్పటికే అండర్‌ కోర్‌ ఆపరేషన్లు మొదలుపెట్టారు. తద్వారా ఆయా వార్డులు, డివిజన్‌లలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. నిన్నటి వరకు గెలుస్తాడు అనుకున్న అభ్యర్థి… పంపకాలపర్వం, ఆ వార్డులో ముఖ్యులతో ప్రధాన నేతలు చర్చిస్తుండటం మూలంగా రాజకీయ పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.

అంత రహస్యమే..
ఎన్నికల బహిరంగ ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు రహస్య ప్రచారానికి తెరలేపారు. పోలింగ్‌ సమయం దగ్గర పడడంతో ఓటర్‌ టు ఓటర్‌ను కలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లు తీసుకురావాడానికి ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఇక ఇన్నీ రోజులు చేసిన ప్రచారం ఒక తంతు అయితే.. ఇప్పడు నిర్వహించే తతంగం ఒకఎత్తు. నేరుగా ఓటర్‌ ఇంటికే వచ్చి.. ఆ ఇంట్లో ఎంత మంది ఓటర్లు ఉన్నారు. ఓటుకు ఎంత అనే బేరసారాలు చేస్తున్నారు. అలాగే కుల సంఘాల వారీగా పెద్దలతో మంతనాలు జరుగుతూ వారి ఓట్లు గంపగుత్తగా కొనుగోలు చేస్తున్నారు. ఇంటింటికీ మద్యం, మటన్‌, చికెన్‌ పంపిణీ చేస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి అన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు.

గ్రేటెడ్‌ కమ్యూనిటీ ఓటర్లు టార్గెట్‌..
గ్రేటెడ్‌ కమ్యూనిటీ ఓటర్లను టార్గెట్‌గా తీసుకుని.. ఆ కమ్యూనిటీ పెద్దలతో అభ్యర్థులు, పార్టీల నాయకులు మంతనాలు జరుపు తున్నారు. గ్రేటెడ్‌ కమ్యూనిటీలో ఉండే ఓటర్లు కొంత చైతన్యవంతులుగా ఉంటారని.. వారు ఎవరికి హామీ ఇస్తే.. వారికి పక్కాగా ఓట్లు వేస్తారన్న నమ్మకంతో వారి ఓట్లే టార్గెట్‌గా అభ్యర్థులు పోటాపోటీ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ప్రతీ ఓటు కీలకం కావడం తో ఓటర్‌ లిస్టును సైతం జల్లెడ పడుతున్నారు.

చివరిలో పొత్తుల విచ్ఛిన్నం..
నిన్నటి వరకు కలిసి ఉన్న పార్టీల మధ్య సైతం పొత్తులు విచ్ఛిన్నమవుతున్నాయి. కొన్నిచోట్ల బీజేపీ, జనసేన మధ్య వివాదాలు తలెత్తుతున్నాయి.మహబూబాబాద్‌లో కాంగ్రెస్‌ – సీపీఐ పొత్తు చెడడంతో సీపీఐ, బీఆర్‌ఎస్‌ తో జతకట్టింది. టికెట్ల పంపిణీ విషయంలో జగిత్యాల, హుజూరాబాద్‌ వంటి చోట్ల కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి జ్వాలలు చెలరేగాయి. రాష్ట్రవ్యాప్తంగా 14 వార్డుల్లో అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇందులో మెజారిటీ స్థానాలు కాంగ్రెస్‌ గెలుచుకుంది.

మూడు రోజుల ముందే పంపకాలు
వైరాలో ఓటర్లకు మూడ్రోజుల ముందు నుంచే రూ.500 అడ్వాన్స్‌, స్వీట్లు, చికెన్‌, చీరల పంపకాలు మొదలయ్యాయి. మిగిలిన అన్ని మున్సిపాలిటీలకూ పంపిణీ వ్యవహారం వ్యాపించింది. కొన్ని వార్డుల్లో ఓటుకు రూ.500 చొప్పున పంపిణీ చేస్తుండగా, ఆయా స్థానిక పరిస్థితులను బట్టి రూ.వెయ్యి నుంచి వైరాలో రూ.5 వేల వరకు పంపిణీ మొదలు పెట్టినట్టుగా సమాచారం. ఏదులాపురంలో కొన్ని చోట్ల రూ.2 వేల చొప్పున పంపిణీ ప్రారంభించారు. ప్రచారంలో పాల్గొన్న వారికి రూ.400 చొప్పున ఇస్తూ మందు, బిర్యానీతో సరిపెడుతుండగా చివరి రోజు రూ.500 వరకూ ఇచ్చారు. ఉమ్మడికొత్తగూడెం కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీల్లోని పలు వార్డుల్లో కొన్ని చోట్ల ఓటుకు రూ.2 వేల చొప్పున పంపిణీని ప్రారంభించగా, మరికొన్ని వార్డుల్లో రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు పంపిణీ చేస్తున్నారు.

విమర్శలు ప్రతి విమర్శలతో సాగిన ప్రచారం
పది రోజుల నుంచి రసవత్తరంగా జరుగుతున్న ప్రచారాన్ని చివరి రోజు తారాస్థాయికి ఆయా పార్టీల ముఖ్య నేతలు తీసుకెళ్లారు. రెండేళ్లలో చేసిన అభివద్ధి పనులను వివరిస్తూ కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులు ప్రచారం చేయగా, అంతకుముందు తాము మొదలుపెట్టిన పనులను కాంగ్రెస్‌ కొనసాగించింది తప్ప.. కొత్త పనులేవీ చేయలేదని బీఆర్‌ఎస్‌ లీడర్లు కౌంటర్‌ చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలతో సాగిన ప్రచారానికి సోమవారం భారీ ర్యాలీలు, రోడ్‌ షోలతో ముగింపు పలికారు.

చివరి రోజు హాట్‌ హాట్‌ కామెంట్స్‌.. ఎవరున్నా మా కోసం రావాల్సిందే : ఓవైసీ
చివరి రోజు ఆయా పార్టీల నేతలు హాట్‌ హాట్‌ కామెంట్లు చేశారు. కరీంనగర్‌లో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఓవైసీ మాట్లాడుతూ అధికారంలో ఎవరున్నా మా దగ్గరకు రావాల్సిందేనని వ్యాఖ్యానించారు. జూబ్లీహిల్స్‌లో మేం లేకుండా గెలవలేదన్నారు. దానికి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. అక్బరుద్దీన్‌ వ్యాఖ్యలను ఖండించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్‌ లో చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారాయి.

ఓ పార్టీని ఉద్దేశించి ‘ చందాలు, దందాలు చేస్తానంటే….పడుద్ది’ అని హెచ్చరించారు. ఇటువంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఎన్నికల తర్వాత ఇలాంటి తింగరి వేషగాళ్లపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మిగిలిన చోట్ల కూడా మంత్రులు ప్రత్యర్ధులను ఉద్దేశించి, స్వపక్ష శ్రేణులు, ఓటర్లలో ధైర్యం నింపేందుకు ఇటువంటి కామెంట్స్‌ చేయగా… ప్రత్యర్థి పార్టీల నేతలు సైతం దీటుగా స్పందించడం గమనార్హం.

కొన్నిచోట్ల వింత ప్రలోభాలు
కొన్నిచోట్ల వింత ప్రలోభాలు పెడుతున్నారు. నగదుతో పాటు ఒకవైపు ప్రచారం జరుగుతుండగానే ముందస్తుగానే ఓటర్లకు తాయిలాలు, గిఫ్టుల పంపిణీపై అభ్యర్థులు దృష్టిపెట్టారు. ఓటరు మహాశయులను ఆకట్టుకునేందుకు మద్యం, చికెన్‌ తోపాటు స్వీట్‌ ప్యాకెట్లు, చీరలు, జాకెట్‌ పీసులు, బొట్టు బిల్లల ప్యాకెట్లు, గుర్తుతో కూడిన కీ చైన్లు.. ఇలా రకరకాల రూపాల్లో వస్తువులను కూడా అందిస్తున్నారు. మరికొందరు అభ్యర్థులు తమ వార్డులో ఎవరైనా పెళ్లి చేసుకుంటే రూ.10,000, ఆడపిల్ల పుడితే రూ.5,000 ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తామని బాండ్‌ పేపర్లపై హామీలు ఇస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -