కాంగ్రెస్ పాలనను తప్పుపట్టిన ‘కాగ్’
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ప్రజాపాలన బహుబాగుందంటూ స్వోత్కర్ష చేసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) షాకిచ్చింది. బడ్జెట్ రూపకల్పనల్లో చూపుతున్న అంకెలకు, క్షేత్రస్థాయిలో ఖర్చులకు మధ్య భారీ అంతరం ఉందని తేల్చిచెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సర కాగ్ నివేదికను సోమవారం కాగ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వ నిర్వాకాలను పూర్తిగా ఎండగట్టింది. దీనితో ప్రభుత్వం తప్పును చెప్పుకోవడం ఇష్టంలేక, శాసనసభ, శాసనమండలిలోని మీడియా గ్యాలరీలోని విలేకరులకు 2022 నాటి కాగ్ నివేదికలను పంపిణీ చేశారు. అదే సమయంలో శాసనసభ్యులు, మండలి సభ్యులకు 2024-25 కాగ్ నివేదికలను పుస్తకాల రూపంలో అందచేశారు. ఈ నివేదికల ప్రకారం బడ్జెట్ అంచనాలు రూ. 2,21,242 కోట్లు కాగా, వాస్తవ గణాంకాలు కేవలం రూ. 1,67,804 కోట్లు మాత్రమేనని కాగ్ ఎత్తిచూపింది. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం 76శాతం అంచనాలను మాత్రమే చేరగలిగింది.
అలాగే ఆదాయ వ్యయం రూ. 2,20,945 కోట్లు కాగా, వాస్తవ గణాంకాలు రూ. 1,77,224 కోట్లు మాత్రమే. 2024-25లో ఆదాయ లోటు రూ. 9,420 కోట్లకు పెరిగిందని ఆందోళన వ్యక్తంచేసింది. బడ్జెట్‌లో ప్లాన్ చేసిన ఖర్చుకు, వాస్తవ ఖర్చుకు పొంతనే లేదని ఆక్షేపించింది. రెవెన్యూశాఖలో బడ్జెట్ రూ.40,453 కోట్లు ఉంటే, ఖర్చు రూ. 50,978 కోట్లు చేసారని, వాస్తవ బడ్జెట్‌కంటే రూ.10,525 కోట్లు (21శాతం) అధికంగా ఎలా ఖర్చు చేస్తారని నిలదీసింది. 2023-24లో రాష్ట్ర ఆదాయం రూ. 1,11,798 కోట్లు కాగా, 2024-25 నాటికి రూ. 1,09,233 కోట్లకు తగ్గినట్టు గుర్తించింది. దాదాపు పన్ను వసూళ్లు, ఆర్థిక వృద్ధి మందగమనం వల్ల రూ.2,565 కోట్లు తగ్గుదల ఉందని తెలిపింది. అదే సమయంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల వాటా రూ.3,308 కోట్లు పెరిగిందని వివరించింది.
2023-24లో కేంద్రం నుంచి వచ్చిన పన్నుల వాటా రూ.23,742 కోట్లు కాగా, 2024-25లో ఆ మొత్తం రూ. 27,050 కోట్లకు పెరిగిందని తెలిపింది. 2024-25లో ఎఫ్‌ఆర్‌బీఎమ్ పరిధిని జీఎస్‌డీపీలో 32.80శాతం ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారనీ, కానీ వాస్తవానికి దాన్ని దాటి 34.29 శాతానికి పెంచి, రూ. 5,62,662 కోట్ల అప్పులు చేసి, ఆర్థిక క్రమశిక్షణను ఉల్లంఘించారని కాగ్ ఆక్షేపించింది. 2024-25లో జీఎస్‌డీపీ వృద్ధి రేటును 10.6 శాతంగా అంచనా వేసి, కేవలం 9 శాతం మాత్రమే సాధించగలిగారని తెలిపింది.జీఎస్టీ, ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ, వాహన పన్నులు సహా అనేక ఆర్థిక విభాగాల్లో ఆదాయ వనరుల్లో తగ్గుదల నమోదైనట్టు కాగ్ తెలిపింది. వాహన పన్ను రూ. 7,095 నుంచి రూ.6,992 కోట్లకు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం రూ. 14,296 కోట్ల నుంచి రూ.8,473 కోట్లకు తగ్గాయని పేర్కొంది.
ఎస్‌ఓటీఆర్ రూ. 1,11,798 కోట్ల నుంచి రూ.1,09,233 కోట్లకు తగ్గినట్టు గణించింది. మొత్తంగా స్టేట్ సొంత ఆదాయంతోపాటు నాన్-టాక్స్ రెవెన్యూ కూడా తగ్గి ఆదాయ వనరుల సమీకరణలో విఫలమయ్యారని ఎత్తిచూపింది. పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.4,054 కోట్లు, హైద్రాబాద్ మెట్రో వాటర్ సప్లరు బోర్డు, మిషన్ భగీరథ, స్వచ్ఛ భారత్ మిషన్‌కు రూ.1386 కోట్లు, నియోజకవర్గాల అభివృద్ధి కోసం రూ. 1,201 కోట్ల సొమ్మును ఖర్చు చేయలేదని కాగ్ స్పష్టంచేసింది. సాంఘీక సంక్షేమ శాఖకు రూ. 25,971 కోట్లు కేటాయిస్తే, కేవలం రూ. కేవలం 9,721 కోట్లు (37శాతం) మాత్రమే ఖర్చు చేశారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలను కాగ్ సునిశితంగా ఎత్తిచూపింది. ప్రభుత్వ ప్రణాళికలు మార్చుకోవాలని దిశానిర్దేశం చేసింది. అనేక ప్రభుత్వ శాఖలు ‘కాగ్’ ఆడిట్‌కు సహకరించలేదని ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా కండ్లు తెరవండి
మాజీమంత్రి టీ హరీశ్‌రావు
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ‘కాగ్’ కడిగిపారేసిందని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష డిప్యూటీ లీడర్ టీ హరీశ్‌రావు చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ పూర్తిగా ఊహాజనితమైందే తప్ప, వాస్తవాలకు ఏమాత్రం దగ్గరగా లేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందనీ, భారీగా అప్పులు తెచ్చారే తప్ప, ఆస్తులు పెంచలేకపోయారని ఎద్దేవా చేశారు. దళిత, బలహీన వర్గాలపై సీఎం ప్రేమ వట్టిదేనని ‘కాగ్’ గణాంకాలు స్పష్టం చేశాయని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని హితవు పలికారు.



