Thursday, February 26, 2026
E-PAPER
Homeఆటలునెగ్గితే చాలదు.. అంతకుమించి!

నెగ్గితే చాలదు.. అంతకుమించి!

- Advertisement -

జింబాబ్వేతో భారత్‌ సూపర్‌ ఢీ నేడు
భారీ విజయంపై కన్నేసిన సూర్యసేన


డిఫెండింగ్‌ చాంపియన్‌, ఆతిథ్య టీమ్‌ ఇండియా నేడు అగ్ని పరీక్షకు సమాయత్తం అవుతోంది. దక్షిణాఫ్రికా చేతిలో దారుణ ఓటమి చవిచూసిన భారత్‌.. నేడు జింబాబ్వేపై అదిరే విజయంపై కన్నేసింది. బుణాత్మక నెట్‌రన్‌ను మెరుగు పర్చుకునేందుకు సూర్యసేన నేడు భారీ విజయం సాధించాలనే తపనతో కనిపిస్తోంది.

సూపర్‌8 గ్రూప్‌-1లో నేడు తొలుత దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ తలపడనున్నాయి. సెమీస్‌ మార్గం సుగమం చేసుకునేందుకు సఫారీలు విజయం సాధించాలని భారత్‌ కోరుకుంటోంది. ఒకవేళ వెస్టిండీస్‌ నెగ్గితే.. భారత సమీకరణాలు మరింత సంక్లిష్టం కానున్నాయి.

నవతెలంగాణ-చెన్నై

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ సూపర్‌8లో నేడు ఆతిథ్య భారత్‌.. జింబాబ్వేతో తలపడనుంది. సహజంగా ఈ మ్యాచ్‌పై పెద్దగా అంచనాలు, ఆందోళన కలిగించే సమీకరణాలు ఉండవు. కానీ, సూపర్‌8 దశ తొలి మ్యాచ్‌లో ఎదురైన భంగపాటు.. భారత్‌కు ఈ మ్యాచ్‌ను అత్యంత ప్రతిష్టాత్మకం చేసింది. 76 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన టీమ్‌ ఇండియా.. నేడు తొలుత బ్యాటింగ్‌ చేస్తే జింబాబ్వేను 100 ప్లస్‌ పరుగుల తేడాతో ఓడించాలనే ప్రణాళికతో బరిలోకి దిగుతోంది. సెమీఫైనల్‌కు చేరుకునేందుకు భారత్‌కు విజయం మాత్రమే సరిపోదు, అంతకుమించి దంచికొట్టాల్సిందే. చెన్నై చెపాక్‌ స్టేడియంలో భారత్‌, జింబాబ్వే సూపర్‌8 పోరు నేడు.

విధ్వంసానికి సరైన తరుణం
టీ20 ప్రపంచకప్‌ ముంగిట భారత బ్యాటర్లు విధ్వంసక ఇన్నింగ్స్‌లు నమోదు చేశారు. 300 పరుగులు సైతం సాధ్యమే అనే రీతిలో రెచ్చిపోయారు. ప్రపంచకప్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో తేలిపోయినా.. ఇక చావోరేవో తేల్చుకోవాల్సిన తరుణంలో బ్యాటర్లు చెలరేగాల్సిన అవసరం ఏర్పడింది. అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌లు టాప్‌ ఆర్డర్‌లో మెరిస్తే భారీ స్కోరుకు తిరుగుండదు. కానీ ఈ ఇద్దరు ఆఫ్‌ స్పిన్‌కు దాసోహం అవటం ఆందోళన కలిగిస్తోంది. స్పిన్‌పై 200 పైచిలుకు స్ట్రయిక్‌రేట్‌ కలిగిన అభిషేక్‌ శర్మ సైతం తడబాటుకు గురవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కుటుంబ అత్యవసర పరిస్థితి కోసం జట్టును వీడిన రింకు సింగ్‌ అందుబాటులో లేకుంటే.. బ్యాటింగ్‌ లైనప్‌లో మార్పులు చూడవచ్చు. కుడి, ఎడమ కాంబినేషన్‌ కోసం సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా తీసుకునే ఆలోచన లేకపోలేదు. తిలక్‌ వర్మ టాప్‌ ఆర్డర్‌ నుంచి లోయర్‌ ఆర్డర్‌కు మారనున్నాడు. సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యలు ధనాధన్‌ మేనియా చూపించాలని అనుకుంటున్నారు. బౌలింగ్‌ విభాగం తొలి నుంచి మెరుగ్గా ఉంది. బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌లు అద్భుతంగా రాణిస్తున్నారు. వరుణ్‌ చక్రవర్తితో కలిసి అక్షర్‌ పటేల్‌ నేడు స్పిన్‌ బాధ్యతలు పంచుకోనున్నాడు. శివం దూబె, హార్దిక్‌ పాండ్యలు ఐదో బౌలర్‌ కోటాను పూర్తి చేయనున్నారు.

మరో విక్టరీ వేటలో!
గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన జింబాబ్వే.. సూపర్‌8లో మరో సంచలన విజయం కోసం ఎదురుచూస్తోంది. శ్రీలంకతో మెప్పించిన జింబాబ్వే.. భారత పిచ్‌లపై తడబడుతోంది. ఆ జట్టులో మారుమణి, బ్రయాన్‌ బెనెట్‌, మేయర్స్‌ మంచి ఫామ్‌లో ఉన్నారు. బ్యాటింగ్‌ సగటుతో పాటు మంచి స్ట్రయిక్‌రేట్‌ గణాంకాలు నమోదు చేశారు. కెప్టెన్‌ సికందర్‌ రజా, రయాన్‌ బర్ల్‌, టోనీలతో మిడిల్‌ ఆర్డర్‌లో ఆశావహంగా కనిపిస్తోంది. స్లో పిచ్‌లపై విశేష ప్రభావం చూపించే జింబాబ్వే.. చెపాక్‌లో నల్ల మట్టి పిచ్‌పై మాయ చేయాలని అనుకుంటోంది. బ్రాడ్‌ ఎవాన్స్‌, బ్లెస్సింగ్‌ ముజరబాణి, రిచర్డ్‌లు బంతితో భారత్‌ను ఇరకాటంలో పడేందుకు సిద్ధమవుతున్నారు.

పిచ్‌, వాతావరణం
చెపాక్‌ స్పిన్‌ స్వర్గధామంగా నిలిచిన పిచ్‌. కానీ ఆధునీకరణ తర్వాత చెపాక్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తోంది. ఇక్కడ స్ట్రయిక్‌రేట్‌, సగటు రెండూ మెరుగ్గా ఉన్నాయి. నేడు భారత్‌, జింబాబ్వే మ్యాచ్‌కు నల్ల మట్టి పిచ్‌ను వాడుతున్నారు. నేడు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండనుంది. టాస్‌ నెగ్గిన జట్టు తొలుత బౌలింగ్‌ ఎంచుకునేందుకు మొగ్గుచూపవచ్చు. కానీ నెట్‌ రన్‌రేట్‌ దృష్ట్యా భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు ఎదురుచూస్తోంది.

తుది జట్లు (అంచనా)
భారత్‌ : అభిషేక్‌ శర్మ, సంజు శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), శివం దూబె, హార్దిక్‌ పాండ్య, రింకు సింగ్‌/ తిలక్‌ వర్మ, అక్షర్‌ పటేల్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, జశ్‌ప్రీత్‌ బుమ్రా.
జింబాబ్వే : మరుమణి (వికెట్‌ కీపర్‌), బ్రియాన్‌ బెనెట్‌, మేయర్స్‌, రయాన్‌ బర్ల్‌, సికందర్‌ రజా (కెప్టెన్‌), టోనీ, ముసెకివ, బ్రాడ్‌ ఎవాన్స్‌, గ్రేమీ క్రీమర్‌, బ్లెస్సింగ్‌ ముజరబాణి, రిచర్డ్‌ నరవ.

టీ20 ప్రపంచకప్‌లో నేడు

దక్షిణాఫ్రికా x వెస్టిండీస్‌
వేదిక : అహ్మదాబాద్‌, టైమ్‌ : మ|| 3
భారత్‌ x జింబాబ్వే
వేదిక : చెన్నై , టైమ్‌ : రా|| 7
స్టార్‌స్పోర్ట్స్‌ నెట్‌వర్క్‌లో ప్రసారం..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -