Friday, February 6, 2026
E-PAPER
Homeజాతీయంఅంత ఈజీ కాదు…

అంత ఈజీ కాదు…

- Advertisement -

వెనిజులా చమురు కొనుగోలుపై నిపుణుల అంచనా
ఖర్చు తడిసి మోపెడవుతుంది
ఆర్థికంగా నష్టపోతాం… రిఫైనరీల లాభాలు పడిపోతాయని హెచ్చరిక

న్యూఢిల్లీ : భారత్‌తో వాణిజ్య ఒప్పందం కుదిరిందని, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును ఆ దేశం పూర్తిగా నిలిపివేస్తుందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేసి, దానికి బదులుగా వెనిజులా చమురును అమెరికా నుంచి కొంటామని భారత ప్రధాని నరేంద్ర మోడీ హామీ ఇచ్చారని కూడా ట్రంప్‌ తెలిపారు. అయితే రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని కానీ, వెనిజులా చమురును అమెరికా నుంచి కొంటామని కానీ భారత్‌ ఇప్పటి వరకూ ధృవీకరించలేదు.

తమ చమురు కొనుగోలుపై భారత్‌ నుంచి ఎలాంటి సంకేతం రాలేదని రష్యా తెలిపింది. వాస్తవానికి రష్యా నుంచి చమురు కొనుగోలుకు స్వస్తి చెప్పి వెనిజులా చమురును కొనడం అంత తేలికైన పని కాదు. ఈ వ్యవహారం అనేక అంశాలతో ముడిపడి ఉంది. ఇంధన మార్కెట్‌ పరిణామాలు, ఖర్చులు, భౌగోళిక పరిస్థితులు, చమురు స్వభావం వంటి అనేక అంశాలు మన నిర్ణయాలను సంక్లిష్టం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. అసలు రష్యా చమురుకు వెనిజులా చమురు ప్రత్యామ్నాయం అవుతుందా, అది మన ఇంధన అవసరాలను తీరుస్తుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది.

రష్యా నుంచి పెరిగిన దిగుమతులు
రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేయాలని ట్రంప్‌ చాలా కాలంగా భారత్‌పై ఒత్తిడి తెస్తున్నారు. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసిన తర్వాత ఆ దేశపు ముడి చమురు ధరపై అమెరికా, యూరోపియన్‌ యూనియన్‌ పరిమితి విధించాయి. యుద్ధానికి అవసరమైన నిధులు రష్యాకు అందకుండా చేసే ఉద్దేశంతో అవి ఈ చర్య తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ సహా అనేక ఇతర దేశాలు రష్యా నుంచి చౌకగా పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేయడం మొదలు పెట్టాయి. యుద్ధానికి ముందు రష్యా చమురులో కేవలం రెండున్నర శాతాన్ని మాత్రమే కొనుగోలు చేసిన భారత్‌, ఇప్పుడు చైనా తర్వాత రష్యా చమురును అత్యధికంగా వినియోగిస్తున్న రెండో దేశంగా నిలిచింది. ప్రస్తుతం మన దేశపు చమురు అవసరాలలో 30 శాతాన్ని రష్యా తీరుస్తోంది.

వెనిజులా చమురుపై ట్రంప్‌ పెత్తనం
రష్యా నుంచి భారత్‌ పెద్ద ఎత్తున చమురును కొనుగోలు చేయడంపై ఆగ్రహించిన ట్రంప్‌ పాతిక శాతం మేర ప్రతీకార సుంకాలు విధించారు. దీంతో అమెరికా సుంకాలు యాభై శాతానికి చేరాయి. అనంతరం రష్యాలోని రెండు అతి పెద్ద చమురు కంపెనీలపై కూడా ఆయన ఆంక్షలు విధించారు. ఈ సంస్థలతో వ్యాపారం చేసే దేశాలు, కంపెనీలపై కూడా సెకండరీ ఆంక్షలు విధిస్తానని బెదిరించారు. వెనిజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురో అపహరణ తర్వాత వెనిజులా చమురు రంగంపై ట్రంప్‌ పెత్తనం చెలాయించడం మొదలు పెట్టారు. చమురు అమ్మకానికి సంబంధించిన సొమ్ముపై నియంత్రణ సాధించారు.

కారకాస్‌ వద్ద అపార నిల్వలు
ప్రపంచ దేశాలన్నింటిలోనూ వెనిజులా వద్దే చమురు నిల్వలు అధికంగా ఉన్నాయి. దాని వద్ద 303 బిలియన్‌ బ్యారళ్ల చమురు ఉన్నదని అంచనా. అమెరికా వద్ద ఉన్న చమురు నిల్వలతో పోలిస్తే ఇది ఐదు రెట్లు అధికం. ఒక బ్యారల్‌ అంటే 159 లీటర్ల ముడి చమురుకు సమానం. బ్యారల్‌ చమురుతో 73 లీటర్ల పెట్రోల్‌ తయారవుతుంది. చమురును రిఫైండ్‌ చేసి అనేక ఉత్పత్తులు తయారు చేయవచ్చు. ట్రంప్‌ ఎంతగా ఒత్తిడి తెచ్చినప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును భారత్‌ పూర్తిగా నిలిపివేయలేదు. హెచ్‌పీసీఎల్‌, ఎంఆర్‌పీఎల్‌, హెచ్‌ఎంఈఎల్‌ వంటి ప్రముఖ రిఫైనరీలు మాత్రం రష్యా చమురు కొనుగోలును పూర్తిగా ఆపేశాయి. ఐఓసీ, బీపీసీ, రిలయన్స్‌ ఇండిస్టీస్‌ వంటివి త్వరలోనే ఆ బాట పట్టబోతున్నాయి.

ప్రత్యామ్నాయాలు వెతుకుతున్న ప్రభుత్వం
గతంలో మన దేశం వెనిజులా చమురును ఎక్కువగానే వినియోగించింది. అయితే అమెరికా ఆంక్షల కారణంగా దిగుమతులు ఆగిపోయాయి. వెనిజులా చమురును కొనుగోలు చేస్తే రవాణా ఛార్జీలు తడిసిమోపెడవుతాయి. పైగా వెనిజులా చమురు ఖరీదు ఎక్కువే. ఫలితంగా దిగుమతుల బిల్లు పెరిగిపోతుంది. రష్యా నుంచి ప్రస్తుతానికి దిగుమతులు తగ్గిపోవడంతో చమురు కొనుగోలుకు సుమారు 40 దేశాలు ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి. ఇప్పటికే మధ్యప్రాచ్య దేశాలు, ఒపెక్‌ దేశాల నుంచి భారత్‌ చమురును కొనుగోలు చేస్తోంది. అమెరికా నుంచి కూడా చమురు కొనుగోలు పెరిగింది.

రష్యా దిగుమతులు ఆపేస్తే…
రష్యా చమురు దిగుమతులను భారత్‌ పూర్తిగా నిలిపివేస్తే ఆర్థికంగా నష్టపోతామని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఇంధన ధరలు, చమురు ద్రవ్యోల్బణం పెరుగుతాయని తెలిపారు. చమురు మార్కెట్‌ నుంచి రష్యాను పూర్తిగా తప్పిస్తే ప్రపంచ దేశాలు భరించలేవని హెచ్చరించారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుందని చెప్పారు. రష్యా చమురు చౌకగా లభిస్తుండడంతో భారత రిఫైనరీలు కొద్దోగొప్పో లాభాలు పొందుతున్నాయి. దాని కొనుగోలు ఆగిపోతే ఎక్కువ ధర పెట్టి వెనిజులా లేదా అమెరికా చమురును కొనాల్సి వస్తుంది. అప్పుడు ముడి పదార్ధాల ధరలు పెరిగి లాభాల మార్జిన్‌ పడిపోతుంది. ఈ భారం అంతిమంగా వినియోగదారుల పైనే పడుతుంది. కాబట్టి రష్యా చమురు కొనుగోలును పూర్తిగా ఆపేయడం అంత తేలికైన విషయం కాదు. మన దేశానికి చెందిన ప్రైవేటు కంపెనీ ‘నయారా ఎనర్జీ’లో రష్యా ఇంధన సంస్థ రోస్‌నెఫ్ట్‌కు వాటాలు ఉన్నాయి. ప్రధాని ఇలాకా గుజరాత్‌లో ఈ సంస్థ ఓ రిఫైనరీని నడుపుతోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -