బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే వేళ దేశం ప్రతిసారీ కొన్ని సుపరిచితమైన సన్నివేశాలతో నిండిపోతుంది. పార్లమెంట్ భవనం చుట్టూ భద్రత పెరుగుతుంది. మార్కెట్లు చురుగ్గా స్పందిస్తాయి. టీవీ స్టూడియోల్లో ”ప్రత్యక్ష పన్నులు”, ”పరోక్ష పన్నులు” వంటి పదాలు మంత్రాల్లా జపించబడతాయి. పత్రికా కార్యాలయాల్లో ”రూపాయి రాకడ, పోకడ” అంటూ గ్రాఫిక్స్, ఇన్ఫోగ్రాఫ్స్ సిద్ధమవుతుం టాయి. అంతిమంగా ఇన్వెస్టర్లు సంతృప్తి పడ్డారా? మార్కెట్‌కు సంకేతం ఏమిటి? ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి, వేతన జీవికి ఊరట లభించిందా లేదా.. చర్చంతా ఇదే. కానీ ఈ అంకెలు సంఖ్యల హడావుడిలో… ఈ బడ్జెట్ ఎవరిని సురక్షితం చేస్తోంది? ఎవరిని అభద్రతలోకి నెట్టేస్తోంది? అనే ప్రశ్న మాత్రం క్రమంగా మాయమవుతుంటుంది. బడ్జెట్ అనేది జమా ఖర్చుల లెక్కల పుస్తకం కాదు. అది ప్రభుత్వ ఆర్థిక విధాన ప్రకటన. ఏ వర్గానికి రక్షణ కల్పించబడిందో, ఏ వర్గాన్ని మార్కెట్ దయకు వదిలేసిందో చెప్పే ప్రభుత్వ ప్రాధాన్యాల నమోదు పత్రం. విచిత్రమేమిటంటే, అందులో చెప్పినవాటికంటే, చెప్పకుండా వదిలేసినవే ఎక్కువ నిజాలను బయటపెడతాయి.
సంఖ్యలు మాట్లాడతాయని అంటారు కానీ, బడ్జెట్‌లో అసలు మాట్లాడేది సంఖ్యలు కావు, ఎంపికలు. ఎక్కడ ఖర్చు పెరిగింది? ఎక్కడ తగ్గింది? ఏ సమస్యను గణాంకాల భాషలో కప్పిపుచ్చారు? ఏ వర్గాలను మౌనంగా విస్మరించారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడే బడ్జెట్ అసలు రాజకీయ స్వరూపం బయటపడుతుంది. ప్రభుత్వాలు బడ్జెట్‌ను ఎప్పుడూ ‘వృద్ధి’, ‘విశ్వాసం’, ‘స్థిరత్వం’ వంటి పదాలతో నిర్వచించడానికి ప్రయత్నిస్తాయి. కానీ ఆ పదాలు నిజజీవితంలోకి ఎలా అనువదించబడుతున్నాయన్నదే అసలు ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాలి. బడ్జెట్‌ను చదవడం అంటే అంకెలను లెక్కించడం కాదు, ఎంపికలను గుర్తించడం. ఒక వైపు పన్ను రాయితీలు, మరోవైపు పన్నుల భారాలు. ఒక వైపు కార్పొరేట్ రక్షణ, మరోవైపు సంక్షేమం, ఉపాధి కుదింపు, ప్రజా సేవలపై ఖర్చు తగ్గింపు. ఒక వైపు ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, మరోవైపు ప్రయివేటీకరణ, ఇవన్నీ యాదృచ్ఛిక నిర్ణయాలు కావు. ఒక నిర్దిష్ట ఆర్థిక దృష్టికోణానికి చెందిన స్పష్టమైన ఎంపికలు. ఏ రంగానికి ఎంత కేటాయించాలన్నదానికంటే, ఏ రంగాన్ని ఎంత నిర్లక్ష్యం చేయాలన్నదే దాని అసలు భాష. ఇటీవలి బడ్జెట్ పత్రాలను పరిశీలిస్తే ఒక ధోరణి స్పష్టంగా కనిపిస్తుంది.
ప్రత్యక్ష పన్నుల ద్వారా సంపన్నుల నుంచి వసూలు చేసే ఆదాయం స్థిరంగా తగ్గుతోంది. అదే సమయంలో పరోక్ష పన్నుల వాటా పెరుగుతోంది. అంటే ఆదాయం ఉన్న చోటు నుంచి కాదు, వినిమయం జరిగే చోటు నుంచి వసూళ్లు జరుగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. వినియోగదారులైన ప్రజల నుంచే ప్రభుత్వం ‘పైసా వసూల్’ చేస్తోంది. ప్రజల జీవనానికి తప్పనిసరి అవసరాలైన వాటిపై పన్నులభారం పెరగడమంటే సమస్త జీవన వ్యయం పెరుగుతుందన్నమాట. బడ్జెట్ రోజున పార్లమెంటులో వినిపించే సంఖ్యలు, శాతాలు, లక్ష్యాలు దేశం అభివృద్ధి దిశలో పరుగులు తీస్తున్నట్లు టీవీలు, పత్రికల్లో మనకో రంగుల చిత్రాన్ని చూపిస్తాయి. కానీ, ఆ చిత్రం దాచే నిజాలు తెలియాలంటే మీడియాలో కాదు, మార్కెట్‌లో చూడాలి. చేతిలో సంచి, జేబులో రెండు వేల రూపాయలతో మార్కెట్‌కు వెళ్లిన ఒక వేతనజీవి, వారం రోజులకు సరిపడా సరుకులు కొనుగోలు చేసి ఇంటికి చేరుకుంటాడు. బియ్యం, పప్పులు, వంటనూనె, సబ్బులు, కూరగాయలు.. ఇలా ఉన్నంతలో నిత్యావసరాలన్నీ తెచ్చుకుంటాడు.
కానీ మరుసటి వారం అదే వ్యక్తి, అదే సంచి, అదే రెండు వేలతో మళ్లీ మార్కెట్‌లో అడుగు పెడితే.. గతవారం వచ్చిన సరుకులన్నీ ఇప్పుడు రావు. కొన్నింటిని తీసేస్తేనే మిగతావి వస్తాయి. సంచి నిండదుగానీ, డబ్బు మాత్రం పూర్తిగా ఖర్చవుతుంది. అంటే జీతాల వృద్ధి రేటు ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా పెరగదు. కానీ వినియోగ సరుకుల ధరలు మాత్రం నిత్యం పెరుగుతూనే ఉంటాయి. అందువల్ల బడ్జెట్ రోజున మీడియాలో కనిపించే ”వృద్ధి రేటు” అతని జేబులోకి ప్రవేశించదు. ఇది ఏ ఒక్కరి వ్యక్తిగత అనుభవమో కాదు. దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాల రోజువారీ ఆనుభవం. బడ్జెట్‌లో వృద్ధి శాతాలు, పెట్టుబడుల గణాంకాలు ఎంత అందంగా కనిపించినా, సామాన్యుడి సంచిలో సరుకులు భారమవుతున్నాయన్న నిజాన్ని దాచలేవు. ఆదాయం పెరగనిచోట ధరలు పెరగడం అంటే పేదల జీవితాలను దోచుకోవడమే. బడ్జెట్ పత్రాల్లో ”ఇన్ఫ్లేషన్ మేనేజ్‌మెంటు” అన్న పదం పదేపదే కనిపిస్తుంది. కానీ, ధరలను అదుపుచేసి, ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించే ప్రత్యక్ష చర్యలు కనిపించవు.
అలాగే వ్యవసాయరంగం వైపు చూద్దాం. బడ్జెట్‌లో వ్యవసాయానికి కేటాయింపులు పెరిగాయని ప్రభుత్వం చెబుతుంది. కానీ ఆ సంఖ్యలను విడదీసి చూస్తే వాస్తవం బయటపడుతుంది. పెద్ద భాగం పాత బాకీల చెల్లింపులకు, పథకాల కొనసాగింపునకే సరిపోతుంది.
రైతు ఆదాయాన్ని స్థిరపరిచే చర్యలైన కనీస మద్దతు ధర, మార్కెట్ లభ్యత, అతడి భద్రతకు హామీ ఇచ్చే చర్యలేవీ బడ్జెట్‌లో ప్రాధాన్యంగా కనిపించవు. అత్యంత కీలకమైన అంశం కనీస మద్దతు ధర. బడ్జెట్ ప్రసంగాల్లో ఇది ప్రస్తావనకు వస్తుంది. కానీ బడ్జెట్ డాక్యుమెంట్‌లో చట్టబద్ధ హామీనిచ్చే కేటాయింపులు, విధాన నిర్ణయాలు కనిపించవు. బడ్జెట్‌లో లేని ఈ హామీయే రైతు జీవితంలో ఉన్న అతిపెద్ద అస్థిరతకు ప్రధాన కారణం. ఇది క్రమం తప్పక ఉద్దేశపూర్వక విస్మరణకు గురయ్యే అంశం. అదే కార్పొరేట్ రంగానికి వస్తే దృశ్యం పూర్తిగా మారిపోతుంది. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలు, మౌలిక సౌకర్యాలు, విధాన సడలింపులు ఇవన్నీ బడ్జెట్‌లో స్పష్టంగా లిఖితపూర్వకంగా ఉంటాయి. దీన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం ఒక వాదన చేస్తుంది. ”కార్పొరేట్ రంగానికి ఇచ్చే పన్ను రాయితీలు, విధాన సడలింపులు చివరికి ఉద్యోగాలుగా మారతాయి” అని. ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ బడ్జెట్ పత్రాలు, ఉపాధి గణాంకాలు ఈ వాదనకు మద్దతు ఇవ్వడం లేదు. గత బడ్జెట్‌లలో కార్పొరేట్ పన్నులు తగ్గాయి. ప్రోత్సాహకాలు పెరిగాయి. కానీ అదే కాలంలో ఉద్యోగాల సృష్టి జరగలేదు సరికదా స్థిరంగా తగ్గింది.
ఎందుకంటే ఈ బడ్జెట్‌లు పెట్టుబడిని ఉపాధితో కట్టిపడేసే షరతులు విధించడం లేదు. ఫలితంగా ఉద్యోగాలు సృష్టించకుండానే పెట్టుబడులు లాభాలు సాధిస్తూ రక్షణ పొందుతున్నాయి. బడ్జెట్‌లో స్పష్టమైన షరతులు లేకపోతే, పెట్టుబడి లాభాల వైపు మాత్రమే ప్రవహిస్తుంది. ఉపాధి వైపు కాదు. భారత బడ్జెట్‌లు వరుసగా ఇదే నిరూపిస్తున్నాయి. ఇదేదో యాదృచ్ఛిక ఆర్థిక వైఫల్యం కాదు. మార్క్స్ చెప్పినట్టు, పెట్టుబడిదారీ వ్యవస్థలో రాజ్యం ఎప్పుడూ తటస్తంగా ఉండదు. అది ఎప్పుడూ ఒక పక్షం వహిస్తుంది. ఒక వర్గ ప్రయోజనాలను సంస్థాగతంగా రక్షిస్తుంది. బడ్జెట్ ఆ రక్షణను అమలు చేస్తుంది. నిరుద్యోగంపై బడ్జెట్ వైఖరి ఈ వర్గపక్షపాతాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఉపాధికి కేటాయింపులు ఉన్నట్లే కనిపిస్తాయి. కానీ, అవి అవసరానికి సరిపడే స్థాయిలో ఉండవు. పని దినాల పెంపు, వేతనాల సవరణ, ఉపాధి హామీ వంటి అంశాలపై బడ్జెట్ మౌనం పాటిస్తుంది. ఇది నిర్లక్ష్యం కాదు. ఒక వ్యూహం. మార్క్స్ చెప్పిన ‘రిజర్వ్ ఆర్మీ ఆఫ్ లేబర్’ భావనను అర్థం చేసుకోకుండా బడ్జెట్ విధానాలను అర్థం చేసుకోవడం అసాధ్యం.
నిత్యం ఉద్యోగం కోసం ఎదురుచూసే కోట్లాదిసైన్యం ఉండటం పెట్టుబడికి లాభం. ఎందుకంటే ఉద్యోగం దొరకాలంటే కార్మికుడు తక్కువ వేతనానికి, తక్కువ హక్కులకు ఒప్పుకోవాలి. కార్మికుడికి బేరమాడే శక్తి ఉండకూడదు. నిరుద్యోగాన్ని పరిష్కరించకపోవడం మాత్రమే కాదు, దాన్ని ఓ అవకాశంగా ఉపయోగించుకోవడాన్ని కూడా ఇక్కడ మనం గమనించాలి. ఈ సైన్యం ఇలా పెరుగుతున్నంతకాలం, కార్మికులు తక్కువ వేతనాలకు, తక్కువ హక్కులకు అంగీకరించాల్సిందే. పెట్టుబడికి కావాల్సిందీ, బడ్జెట్ చేస్తుందీ అదే. ఇక్కడ అంబేద్కర్ ఆలోచనలను కూడా గుర్తు చేసుకోవాలి. అంబేద్కర్ దృష్టిలో రాజకీయ ప్రజాస్వామ్యం మాత్రమే సరిపోదు. ఆర్థిక ప్రజాస్వామ్యం, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ స్వేచ్ఛ ఖాళీ నినాదంగా మిగిలిపోతుంది. భారత బడ్జెట్‌లు మాత్రం ప్రజాస్వామ్యాన్ని ఓటు హక్కుకు పరిమితం చేస్తూ, ఆర్థిక, సామాజిక సమానత్వం అనే మూలసూత్రాన్ని నిరాకరిస్తున్నాయి. దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన వర్గాలకు కేటాయింపులు ఉన్నట్లే కనిపించినా, అవి కేవలం పథకాలుగా, ప్రభుత్వాల దయగా మారుతున్నాయి.
ఇది పౌరులను హక్కుదారులుగా కాక లబ్దిదారులుగా మార్చే రాజకీయ వ్యూహం. ఉపాధి, భూమి, మార్కెట్ లభ్యత వంటి నిర్మాణాత్మక మార్పులకు బడ్జెట్ మద్దతు బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే దాని ఉద్దేశం ప్రజల సాధికారత కాదు, ఓ నియంత్రిత సహాయం మాత్రమే. విద్య, ఆరోగ్య రంగాల్లో కూడా బడ్జెట్ ధోరణి ఇదే దిశలో ఉంది. ప్రభుత్వ రంగానికి కేటాయింపులు పరిమితంగా ఉంటే, ప్రయివేటు రంగానికి అనుకూల విధానాలు విస్తరిస్తున్నాయి. ఇది ”సమర్థత” పేరుతో జరుగుతున్న ప్రయివేటీకరణ. కానీ దీని ఫలితం ఏమిటంటే.. చదువు, ఆరోగ్యం వంటివన్నీ హక్కుల నుంచి సరుకులుగా మారిపోతున్నాయి. సరుకు అంటే కొనగలిగినవారికే లభిస్తుంది కదా. గ్రామాల నుంచి పట్టణాలకు వలసను కూడా ఇదే థీసిస్‌లో చూడాలి. వ్యవసాయం లాభదాయకం కాకపోతే, గ్రామీణ ఉపాధికి బడ్జెట్ మద్దతు లేకపోతే, వలస అనివార్యం అవుతుంది. ఇది సహజ ఆర్థిక పరిణామం కాదు, బడ్జెట్‌లో తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితం. జీఎస్టీ తర్వాత చిన్న వ్యాపారుల పరిస్థితి కూడా ఇదే వర్గపక్షపాతాన్ని చవిచూస్తోంది. నియమాలు, రిటర్న్స్, పెనాల్టీల వంటివన్నీ చిన్న వ్యాపారులకు భారంగా, పెద్ద సంస్థలకు విధాన సౌలభ్యాలుగా మారుతున్నాయి.
ఈ అన్ని అంశాలను కలిపి చూస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. భారత బడ్జెట్ ప్రజల జీవన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు రూపొందించబడటం లేదు. ఆ సంక్షోభాన్ని సహజమైనదిగా, తప్పనిసరై నదిగా మలచి, కార్పొరేట్ లాభాలను రక్షించే రాజకీయ సాధనంగా అది పనిచేస్తోంది. ఇది స్పష్టమైన వర్గపక్షపాతంతో తీసుకుంటున్న విధానపరమైన నిర్ణయం. ఆర్థిక నిపుణుల విశ్లేషణలే కాదు, ప్రజల జీవితానుభవం కూడా నిరూపిస్తున్న నిజమిది. సంపన్నులపై న్యాయమైన పన్నులు, యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు చట్టబద్ధ మద్దతు ధర, ప్రభుత్వ విద్య, ఆరోగ్య రంగాల బలోపేతం.. ఇవన్నీ అసాధ్యమైనవేమీ కావు. అయినా అవి సాధ్యం కావడంలేదంటే కారణం వనరుల కొరత కాదు, రాజకీయ ఇష్టాల లేమి. బడ్జెట్‌లో ప్రతిబింబించేది అదే. అది రాజ్యం ఎవరితో నిలబడిందో చెప్పే స్పష్టమైన సంకేతం. ప్రజల శ్రమతో సృష్టించిన సంపద ప్రజల జీవితాల్లో భద్రతగా, గౌరవంగా మారినప్పుడే అది ప్రజల బడ్జెట్ అవుతుంది. లేనట్టయితే, ప్రతి బడ్జెట్ కొత్త సంఖ్యలతో వచ్చినా, పాత వర్గ రాజకీయాన్నే తిరగరాస్తుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే.. బడ్జెట్ అనేది కేవలం ఆర్థిక పత్రం మాత్రమే కాదు. అది రాజ్యం ఎవరిపక్షాన నిలిచిందో చెప్పే రాజకీయ ప్రమాణ పత్రం. ఆ ప్రమాణం మారనంతవరకు, ”వృద్ధి” అనే పదం ప్రజల జీవితాల్లోకి ప్రవేశించదు.
రమేష్ రాంపల్లి



