నవతెలంగాణ-హైదరాబాద్: అవసరమైతే దేశం కోసం మరోసారి బుల్లెట్లను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సీ) అధ్యక్షుడు ఫరూక్‌అబ్దుల్లా మంగళవారం పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో రాళ్లు రువ్వడం, ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ఎన్‌సీ యత్నిస్తోందన్న బీజేపీ వాదనను ఆయన ఖండించారు. ఎన్‌సీ పార్టీ బ్లాక్ అధ్యక్షులు, కార్యదర్శుల రెండు రోజుల సమావేశం సందర్భంగా ఆయన జమ్ము చేరుకున్న సంగతి తెలిసిందే. ఎన్‌సీ, పీడీపీ అశాంతిని పెంచుతున్నాయని, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని, రాళ్లురువ్వడాన్ని పునరుద్ధరించేందుకు యత్నిస్తున్నాయన్న బీజేపీ నేత వ్యాఖ్యలను ఖండించారు.
జమ్ముకాశ్మీర్‌ను కొత్తగా విభజించాలన్న పిలుపును తిరస్కరించారు. అటువంటి డిమాండ్లను ”మూర్ఖత్వం, అజ్ఞానం” గా అభివర్ణించారు. 2019లో ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించబడిన లడఖ్, తిరిగి జమ్ముకాశ్మీర్‌లో చేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకాశ్మీర్‌లో అదనపు జిల్లాల ఏర్పాటును కొట్టిపారేశారు. పిర్‌పంజాల్, చీనాబ్ లోయలకు ప్రత్యేక విభాగాల డిమాండ్‌ను ఆయన విమర్శించారు. దీనిని ‘డిక్సన్ ప్రణాళిక’లో భాగంగా అభివర్ణించారు. భారత్ – పాకిస్తాన్‌ల మధ్య జమ్ముకాశ్మీర్ వివాదాన్ని పరిష్కరించే లక్ష్యంతో 1950 సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా మాజీ ప్రధాన న్యాయమూర్తి, ఐక్యరాజ్యసమితి ప్రతినిధి ఒవెన్ డిక్సన్ ఈ ప్రతిపాదనను రూపొందించారని గుర్తు చేశారు.
పిర్‌పంజాల్ – చీనాబ్ లోయలకు డివిజన్ హోదా, మరిన్ని జిల్లాల ఏర్పాటు కోరుతూ పిడిపి అధ్యక్షురాలు ముఫ్తీ ఇచ్చిన పిలుపును ఆయన కొట్టిపారేశారు. ఇది గతంలోని డిక్సన్ ప్రణాళికలో భాగమని అన్నారు. చాలామంది రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని కోరుకుంటారని, కానీ వారు ఎప్పటికీ విజయం సాధించలేరని అన్నారు. లడఖ్‌ను వేరు చేయాలని తాము కోరుకోలేదని అన్నారు. వేరు చేయడం వల్ల లడఖ్ ప్రజలకు దక్కిన ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రపాలిత ప్రాంత హోదా తమకు వద్దని, తిరిగి జమ్ముకాశ్మీర్‌లో కలిసిపోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.



