Monday, February 2, 2026
E-PAPER
Homeజాతీయంమళ్ళీ కార్పొరేట్ల భజనే..

మళ్ళీ కార్పొరేట్ల భజనే..

- Advertisement -

– పేదోడి ఊసే లేదు
– నిరుద్యోగులను గాలికొదిలేశారు
– ఉద్యోగులకు నిరాశనే
– సామాన్యుల పథకాలకు అరకొర నిధులు

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం మరోసారి కార్పొరేట్ల పక్షపాతిని ప్రదర్శించింది. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ వరుసగా తొమ్మిదో సారి ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ కార్పొరేట్ల భజన కొనసాగగా.. ప్రయివేటీకరణకు పట్టం కట్టారు. ‘వికసిత్‌ భారత్‌-2047′ లక్ష్య సాధన దిశగా ఈ బడ్జెట్‌ ఒక నిర్ణయాత్మక ముందడుగు’ అంటూ ఆర్థికసంవత్సరం 2026ౄ27 బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించిన మంత్రి ఆచరణలో దానికి పూర్తి భిన్నంగా వ్యవహరించారు. గంటన్నర పాటు సాగిన ప్రసంగంలో వికసిత్‌ భారత్‌లో కార్పొరేట్ల ప్రోత్సాహకాలకు మాత్రమే పెద్దపీట వేయగా.. మొత్తం బడ్జెట్‌లో పేదలు, సామాన్యులు అనే పదాన్ని ఒక్కసారి కూడా ఉపయోగించకపోవడం గమనార్హం.

రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలకు మొండి చెయ్యి చూపారు. ఉపాధి హామీకి మరోసారి నిధులు ఎండగట్టింది. ఉపాధిహామీతోపాటు, ఆహారసబ్సిడీ, విద్య, గ్రామీణాభివృద్ధి ఇలా అన్ని రంగాలకు నిధులను కోత పెట్టడమో, తగ్గించడమో చేసింది. ఉపాధి హామీకి కేటాయింపులు తగ్గించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం మరింత పెరగనుంది. మధ్య తరగతి, ఉద్యోగులకు పన్ను మినహాయింపు పరిమితి పెంచకుండా మోడి సర్కార్‌ ఆ వర్గాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. సామాన్యుల పథకాలకు అరకోర నిధులను కేటాయించి సంపన్నులకు ఇచ్చిన ప్రయోజ నాలతో పోలిస్తే ఇది మహాసముద్రంలో నీటిబొట్టంత కావడం విశేషం!.

బడా కంపెనీలకు మేత
ఇక మధ్యతరగతి జీవి పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమతమవుతున్న వారికి ఇన్‌కమ్‌ టాక్స్‌ శ్లాబులలో మార్పు చేయకుండా ప్రభుత్వం చుక్కలు చూపించింది. మరోవైపు దేశ మౌలిక సదుపాయాల కోసం రూ.12.2 లక్షల కోట్లు కేటాయించామని ప్రభుత్వం గొప్పగా చెబుతోంది. అయితే.. ఈ వేల కోట్లు నేరుగా వెళ్లేది ఎవరి జేబుల్లోకి అనేది స్పష్టమవుతోంది. జాతీయ రహదారులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు కట్టే బడా కార్పొరేట్‌ కాంట్రాక్టర్లకే ఈ కేటాయింపులు తాంబూలంలా మారాయి.

అప్పుల ఊబిలోకి దేశం..
కార్పొరేట్ల ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం దాదాపు రూ.17.2 లక్షల కోట్ల అప్పు చేయాలని నిర్ణయించడం ఆర్థిక వేత్తలను కలవరపెడుతోంది. దీని ప్రభావం నేరుగా స్టాక్‌ మార్కెట్‌పై పడింది. సామాన్యుడు తన భవిష్యత్తు కోసం దాచుకున్న ఇన్వెస్ట్‌మెంట్లు, ఒక్క రోజులోనే రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైపోయాయి. స్థూలంగా ఈ బడ్జెట్‌ అద్దంలో కార్పొరేట్‌ కంపెనీల ముఖాలు నవ్వుతుంటే, సామాన్యుడి కళ్లు మాత్రం చెమ్మగిల్లాయి. అభివృద్ధి అనే రంగుల ప్రపంచాన్ని చూపిస్తూ, ఆకలి, నిరుద్యోగం వంటి ప్రాథమిక సమస్యలను ప్రభుత్వం బుట్టదాఖలు చేసిందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అంతిమంగా అంకెల గారడీలో నలిగిన సామాన్యుడు.. కార్పొరేట్లకు కురిసిన కాసుల వానగా బడ్జెట్‌ తీరు ఉంది..

రైతులకు మొండిచేయి!
తమ పంటకు గిట్టుబాటు ధర దక్కుతుందని, పీఎం కిసాన్‌ నిధి పెరిగి పెట్టుబడి భారానికి కాస్త ఊరట లభిస్తుందని ఆశపడ్డ అన్నదాతకు ఈ బడ్జెట్‌ పెద్ద షాక్‌ ఇచ్చింది. గడిచిన ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న రూ.6,000 పెంపు ఊసే లేదు. రైతుకు నేరుగా లబ్ది చేకూర్చే పథకాల కంటే.. డిజిటల్‌ అగ్రి మిషన్‌ పేరిట టెక్నాలజీ వైపు నిధులు మళ్లించారు. దీనివల్ల లాభపడేది సాగు చేసే రైతు కంటే రైతు డేటాను అమ్ముకునే కార్పొరేట్‌ కంపెనీలేనన్నది స్పష్టమవుతోంది.

కార్పొరేట్లకు చౌక కార్మికులు

దేశంలో నిరుద్యోగిత తాండవిస్తుంటే కొత్త ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి కానీ భారీ ఉపాధి పథకాల గురించి కానీ బడ్జెట్‌లో స్పష్టత కరువైంది. దీనికి బదులుగా పెద్ద కంపెనీలలో ఇంటర్న్‌షిప్‌ కోటాలను ప్రకటించారు. అంటే ప్రభుత్వ బాధ్యతను విస్మరించి, యువతను కార్పొరేట్‌ సంస్థల వద్ద తక్కువ జీతానికి పని చేసే యంత్రాలుగా మారుస్తున్నారు. గ్రామీణ పేదల జీవనాధారమైన ఉపాధి హామీ పథకానికి నిధుల పెంపు లేకపోవడం పేదరికంపై ప్రభుత్వం చేస్తున్న దాడిగా కనిపిస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -