– టైటిల్ వేటలో 32 క్లబ్ జట్లు
– నేటి నుంచి ఫిఫా క్లబ్ ప్రపంచకప్
రూ.8614 కోట్ల భారీ ప్రైజ్‌మనీ
ఫిఫా ప్రపంచకప్‌ను తలదన్నె సమరం సాకర్ అభిమానుల ముందుకొచ్చింది. 21వ సీజన్‌కు సరికొత్తగా ముస్తాబైన ఫిఫా క్లబ్ ప్రపంచకప్ నేటి నుంచి ఆరంభం కానుంది. తొలిసారి ప్రపంచ వ్యాప్తంగా 32 క్లబ్ జట్లు పోటీపడుతున్న ఈ మెగా ఈవెంట్‌కు రూ.8614 కోట్ల భారీ నగదు బహుమతి అందిస్తున్నారు. విజేత రూ.1076 కోట్ల రికార్డు ప్రైజ్‌మనీ అందుకోనుండగా.. ఇంటర్ మయామి ఆతిథ్యం ఇస్తున్న టోర్నమెంట్‌లో మాంచెస్టర్ సిటీ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతోంది.
నవతెలంగాణ-మయామి (యుఎస్‌ఏ)
ప్రపంచ సాకర్‌లో క్లబ్ ఫుట్‌బాల్ మేనియా తారాస్థాయికి చేరుకుంది. ఇప్పటివరకు ఐదు ఖండాల నుంచి 32 జట్లు ఫిఫా ప్రపంచకప్‌లో మాత్రమే పోటీపడగా.. ఇక నుంచి అదే తరహా ఫార్మాట్‌లో ఫిఫా క్లబ్ ప్రపంచకప్‌లోనూ మేటి జట్లు బరిలోకి దిగుతున్నాయి. ప్రసారదారులు, స్పాన్సర్లను ఆకట్టుకోవటంతో పాటు భారీ స్థాయిలో ఆదాయ ఆర్జనకు ప్రణాళిక రచించిన ఫిఫా.. 7 జట్లతో సాదాసీదాగా సాగుతున్న క్లబ్ ప్రపంచకప్ రూపు రేఖలను మార్చివేసింది. 32 జట్లు, అన్ని ఖండాల నుంచి మేటి క్లబ్ జట్లకు ప్రాతినిథ్యం కల్పించింది. టోర్నమెంట్ ప్రైజ్‌మనీని కనీవినీ ఎరుగని రీతిలో ప్రకటించింది. ఫలితంగా, ఫిఫా ప్రపంచకప్ మేనియాతో సమవుజ్జీగా నిలిచే ఫిఫా క్లబ్ వరల్డ్‌కప్ అభిమానుల ముందుకు వచ్చింది. నేటి నుంచి ఆరంభం కానున్న ఫిఫా క్లబ్ ప్రపంచ కప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంటర్ మమామి, అల్ అహ్లీలు మయామిలోని హార్డ్‌రాక్ స్టేడియంలో తలపడను న్నాయి. ఇంటర్ మయామి జట్టుకు సాకర్ సూపర్‌స్టార్ లియోనల్ మెస్సీ సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.
కండ్లుచెదిరే ప్రైజ్‌మనీ
ఫిఫా క్లబ్ ప్రపంచకప్ నయా ఫార్మాట్ లక్ష్యం కమర్షియల్ సక్సెస్. అందుకు తగినట్టుగానే నిర్వాహకులు రికార్డు స్థాయిలో రూ.8614 కోట్ల (1 బిలియన్ అమెరిన్ డాలర్లు) నగదు బహుమతి ప్రకటించారు. 32 జట్లు పోటీపడుతున్న టోర్న మెంట్‌లో విజేతగా నిలిచే క్లబ్ జట్టు రూ.1076 కోట్ల (125 మిలియన్ అమెరికన్ డాలర్లు) భారీ ప్రైజ్‌మనీ దక్కించుకోనుంది. రన్నరప్‌గా నిలిచే జట్టు రూ.538 కోట్లు (62.5 మిలియన్ అమెరికన్ డాలర్లు) అందుకోనుంది. టోర్నమెంట్‌లో పోటీ పడిన ప్రతి జట్టు ఆకర్షణీయ మొత్తంలో నగదు బహుమతి అందుకునేలా ప్రైజ్‌మనీ సిద్ధం చేశారు.
30 రోజులు 63 మ్యాచులు
ఫిఫా క్లబ్ ప్రపంచకప్‌లో ఖండాల వారీగా జట్లను ఎంపిక చేశారు. యూరోప్ నుంచి 12 క్లబ్‌లు, దక్షిణ అమెరికా నుంచి 6 క్లబ్‌లు, ఆఫ్రికా నుంచి 4 క్లబ్‌లు, ఆసియా నుంచి 4 క్లబ్‌లు, ఉత్తర అమెరికా నుంచి 5 క్లబ్‌లు, ఓసియానా (ర్యాంకింగ్స్ నుంచి) ఓ క్లబ్ జట్టు.. ప్రపంచకప్‌కు అర్హత సాధిం చాయి. 30 రోజుల పాటు జరుగనున్న మెగా టోర్నమెంట్‌లో 63 మ్యాచులు జరుగుతాయి.
గ్రూప్ దశలో 32 జట్లను 8 గ్రూప్‌లుగా విభజించారు. ప్రతి గ్రూప్‌లో నాలుగు జట్లు పోటీపడతాయి. టాప్-2 జట్లు గ్రూప్ దశ నుంచి ముందంజ వేస్తాయి. ఆ తర్వాత ప్రీ క్వార్టర్‌ఫైనల్, క్వార్టర్‌ఫైనల్, సెమీఫైనల్ నాకౌట్ దశలు ఉంటాయి. జులై 13న టైటిల్ పోరు షెడ్యూల్ చేశారు.
11 నగరాలు, 12 వేదికలు
ఫిఫా క్లబ్ ప్రపంచకప్ 63 మ్యాచులకు అమెరికాలోని 12 స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మేరకు నిర్వాహకులు అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యాప్తంగా స్టేడియాలను ఎంపిక చేశారు. న్యూయార్క్‌లోని మెట్‌లైఫ్ స్టేడియంలో జులై 13న ఫైనల్ మ్యాచ్ జరుగనుండగా.. ఫ్లోరిడాలోని మయామి హార్డ్‌రాక్ స్టేడియంలో టోర్నమెంట్ నేడు ఆరంభ మ్యాచ్ జరుగుతుంది. లాస్ ఏంజెలెస్, చార్లెటె, అట్లాంటా, ఫిలాండెల్ఫియ, సీయటెల్, ఓర్లాండో (రెండు స్టేడియాలు), నాశ్‌విలె, సిన్సినాటి, వాషింగ్టన్ డీసీ నగరాలు క్లబ్ ప్రపంచకప్ మ్యాచ్‌లకు వేదిక కానున్నాయి. నేడు జరుగనున్న ఆరంభ వేడుకల్లో అమెరికా ర్యాప్ సింగర్స్ ఫ్రెంచ్ మోంటానా, స్వే లీలు పాటలతో అలరించనుండగా.. వికినా, రికెలియోలు సైతం ఓపెనింగ్ సెర్మానీలో ఆట పాటలతో సందడి చేయనున్నారు.
32 జట్లు-8 గ్రూప్‌లు
గ్రూప్-ఏ : పాల్మెరాస్, పోర్టో, ఆల్ ఆల్హీ, ఇంటర్ మయామి సీఎఫ్
గ్రూప్-బి : పారిస్ సెయింట్ జెర్మన్, అథ్లెటికో మాడ్రిడ్, బొటాఫోగో, సీయటిల్ సౌండర్స్ ఎఫ్‌సీ
గ్రూప్-సి : బేయర్న్ మ్యూనిచ్, ఆక్లాండ్ సిటీ, బోకా జూనియర్స్, బెనిఫికా
గ్రూప్-డి : ఫ్లెమెంగో, ఈస్పరెన్స్ డీ ట్యూనిస్, చెల్సియా, లాస్ ఏంజెలెస్ ఎఫ్‌సీ
గ్రూప్-ఈ : రివర్ ప్లేట్, ఊర్వ రెడ్ డైమండ్స్, మోనెటరీ, ఇంటర్ మిలాన్
గ్రూప్-ఎఫ్ : ఫ్లూమినెన్సె, బొరొసియా డార్ట్‌మండ్, ఉల్సాన్ హెచ్‌డీ, మామెలోడి సన్‌డౌన్స్
గ్రూప్-జి : మాంచెస్టర్ సిటీ, వ్యడాడ్ ఏసీ, ఆల్ ఎన్, జువెంటస్
గ్రూప్-హెచ్ : రియల్ మాడ్రిడ్, అల్ హిలాల్, పిచుకా, రెడ్ బుల్ సాల్జ్‌బర్గ్ న
క్లబ్ సమరానికి వేళాయె
- Advertisement -
- Advertisement -