పశ్చిమ బెంగాల్ హైదరాబాద్ లకు మధ్య సుమారు నూరేళ్ల క్రితమే సాంస్కతిక సంబంధాలు ఏర్పడినవి. ప్రధానంగా మనకు బెంగాల్ నుండి రవీంద్రనాథ్ ఠాగూర్, అఘోరనాథ చటోపాధ్యాయ ఆ తర్వాత ధీరేన్ గంగూలీ వంటి వారు హైదరాబాద్ వచ్చి తమదైన సాంస్కతిక పరమైన ముద్ర వేశారు. వీరి నడుమన మరొక వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే జె.ఎఫ్. మదన్. ఈయన భారతీయ సినిమా పితామహులలో ఒకరుగా చరిత్రకెక్కారు. ఈ జె.ఎఫ్. మదన్ వలననే హైదరాబాద్‌కు సినీ కెమెరా మొదట పరిచయమైంది.
ఆయన పూర్తి పేరు జంషెడ్జి ఫ్రామ్జి మదన్. జె.ఎఫ్. మదన్‌గా పేరు పొందిన ఆయన బొంబాయిలో 1857 ఏప్రిల్ 27 న జన్మించారు. తొలి రోజుల్లో ఆల్ఫ్రెడ్, కొరింథియన్ అన్న నాటక సమాజాలను ఆయన నిర్వహించాడు. ఆ తర్వాత సంచార నాటకశాలను దేశమంతా తిప్పుతూ మదన్ థియేటర్స్ అన్న సంస్థను నడిపారు. 1890లో పార్సి థియేటర్ ద్వారా పార్సీ నాటకాల ప్రదర్శనతో ఆయన భారతీయ నాటక రంగ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందాడు. 1902 లో కలకత్తాకు వెళ్లి అక్కడ ఎలిఫిన్ట్ స్టోన్ బయోస్కోప్ కంపెనీ అన్న సంస్థను స్థాపించాడు. కలకత్తాలోని మైదాన్‌లో తన తొలి నిశ్శబ్ద చిత్రాల ప్రదర్శనను ప్రారంభించాడు. తన సంచార సినీ టెంట్ హాల్స్ ద్వారా ఆ కాలం నాటి సైలెంట్ సినిమాలను బొంబాయి, పూనా, కలకత్తా వంటి నగరాలలో అసంఖ్యాకమైన ప్రదర్శనలు నిర్వహించాడు. అప్పటి బ్రిటిష్ ఇండియాలోని బర్మా, శిలోన్ అంతటా మదన్ థియేటర్స్ తన ప్రదర్శనలను నిర్వహించింది.
1905లో జ్యోతి సర్కార్ బెంగాల్ విభజన ఉద్యమంతో సహా నిశ్శబ్ద చిత్రాలను నిర్మించడం వాటిని ప్రదర్శించడం మొదలుపెట్టాడు. 1913లో దాదా ఫాల్కే తొలి భారతీయ మూకీ ”రాజా హరిశ్చంద్ర” తీసిన తర్వాత బొంబాయి, మద్రాస్, పూనా వంటి నగరాలతో పాటు కలకత్తాలో కూడా సైలెంట్ చిత్రాలు నిర్మాణానికి ఎక్కడికక్కడ ఔత్సాహికులు పూనుకోవడం ప్రారంభించారు. ఆ క్రమంలో జె.ఎఫ్. మదన్ కలకత్తాలో తొలిసారిగా 1917లో ”సత్యవాది రాజా హరిచంద్ర” అన్న సైలెంట్ చిత్రాన్ని రూపొందించాడు. ఆ తర్వాత” బిల్వ మంగళ” (1919) అనే మరో మూకీ కూడా తీశారు. ఈ రెండు సైలెంట్ చిత్రాలు తీయకమునుపే జె.ఎఫ్. మదన్ 1907లో కలకత్తాలో ఎలిఫెంట్ స్టోన్ పిక్చర్ ప్యాలెస్ అన్న థియేటర్‌ను నిర్మించాడు. దేశంలో నిర్మించబడిన మొట్టమొదటి పర్మినెంట్ సినిమా హాల్ ఇదే. ఆ తర్వాత ఈ థియేటర్ పేరు చాప్లిన్ సినిమాగా మారింది. పదేళ్ల క్రితం కోలకతా మున్సిపల్ కార్పొరేషన్ వారు రోడ్డు విస్తరణలో భాగంగా దీనిని కూల్చివేసి కాలగర్భంలో కలిపి వేశారు. 1919 నాటికి ఈ ఎల్ఫన్ స్టోన్ థియేటర్ ”మదన్ థియేటర్స్ లిమిటెడ్” లో విలీనమైంది.
ఈ మదన్ థియేటర్స్ సంస్థ బెంగాలీలో అత్యంత ప్రజాదరణ పొందిన రచనలను వేదిక మీదికి నాటకాలుగా తీసుకువచ్చింది. అలా 1920 -1930ల మధ్యకాలంలో మదన్ థియేటర్స్ భారతీయ నాటక రంగంలో ఒక ప్రధాన స్రవంతిగా తన ప్రస్థానాన్ని సాగించింది. ఈ కాలం నాటికి వచ్చిన సాంకేతిక పరిణామ వికాసాన్ని ఇష్టంగా పరిశీలిస్తున్న హైదరాబాద్ స్టేట్ ఫోటోగ్రఫీ, రేడియో గ్రామ్ వంటి వాటిని అప్పటికే సొంతం చేసుకుని ఉన్నది. మరోవైపు సినిమా పుట్టుక దానికి పెరుగుతున్న జనాదరణను కూడా నిశితంగా గమనించింది. దీని పర్యవసానంగానే 1908లో హైదరాబాదులో వచ్చిన మూసీ నది వరదల బీభత్సకరమైన దశ్యాలను చిత్రీకరించడానికి సాక్షాత్తు ఆనాటి నిజాం మీరు ఉస్మాన్ అలీ ఖాన్ స్వయంగా పూనుకున్నాడు. ఆయన పిలుపు మేరకు ఈ మూసి వరదల దశ్యాలను చిత్రీకరించినది జె.ఎఫ్. మదన్ బృందమే. అయితే ఈ మూసి వరదల దశ్యాలను చిత్రీకరించింది జె.ఎఫ్. మదన్ బృందం కాదు, బొంబాయి కి చెందిన ఎక్సెల్షియర్ సినిమాటోగ్రాఫ్ సంస్థకు చెందిన ఒక కెమెరామెన్ వచ్చి వాటిని దృశ్యబద్దం చేశారని మరికొందరు రాస్తున్నారు.
అయితే ఇందుకు ఎలాంటి ఆధారాలు మనకు లభించడం లేదు. మరి జె.ఎఫ్. మదన్ బృందమే అనడానికి బలమైన కారణం ఏమిటంటే జె.ఎఫ్. మదన్‌తో 1908 నాటి పరిచయం కారణంగానే ఆ తర్వాత 1922లో కలకత్తా నుండి ధీరేన్ గంగూలీ అన్న బెంగాలీ వాడు హైదరాబాదుకు వచ్చి తొలిసారిగా సైలెంట్ సినిమాలను నిర్మించాడు. కలకత్తాకే చెందిన ధీరేన్ గంగూలీ ఫోటోగ్రఫీలో అతను సాధించిన ప్రతిభను దృష్టిలో ఉంచుకొని సినిమా రంగంలోకి ఆహ్వానించాడు జె.ఎఫ్. మదన్. ధీరేన్ రూపొందించిన ”భవనేర్ అభివ్యక్తి” అన్న ఫోటోగ్రాఫికల్ ఆల్బమ్‌ను చూసి అప్పటికే హైదరాబాద్ నిజాం ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న అతన్ని ” నీ ప్రతిభా ప్రావీణ్యాలు అన్నీ కూడా ఇప్పుడిప్పుడే అభివృద్ధిలోకి వస్తున్న సినిమాల నిర్మాణానికి ఉపయోగపడుతుంది’ అని తిరిగి కలకత్తాకు రప్పించి సినిమాలు తీసే ప్రయత్నాలు చేశాడు మదన్. ధీరేన్ గంగూలి, రవీంద్రనాథ్ ఠాగూర్‌కి దగ్గర బంధువు. ఠాగూర్ రాసిన ”శాక్రిఫైజ్” నాటకం అప్పటికే బెంగాల్ అంతట ప్రఖ్యాతమై ఉన్నది. దానికి సంబంధించిన హక్కులను ధీరేన్ ద్వారా మదన్ రాబట్టాడు.
మదన్ పిలుపుమేరకు హైదరాబాదు నుండి తిరిగి కలకత్తాకు వెళ్లిన ధీరేన్ గంగూలి అక్కడ శాక్రిఫైజ్ నాటకాన్ని సినిమాగా తీయడానికి మదన్‌తో కలిసి ప్రయత్నాలు ప్రారంభించారు. సినిమా నాటక రంగాలలో పూర్తిగా వ్యాపార ధోరణి అనుసరించే మదన్ ఆలోచనలు ధీరేన్‌కు నచ్చలేదు. దాంతో వారు విడిపోయారు. ఈ నేపధ్యంలోనే ఆ తర్వాత 1922లో గంగూలీ ఏడవ నిజాం పిలుపు మేరకు హైదరాబాదుకు వచ్చి సైలెంట్ సినిమాలు నిర్మించాడు. ఐతే ధీరేన్ గంగూలీతో ఏర్పడిన విభేదం జె.ఎఫ్. మదన్ హైదరాబాదు అనుబంధానికి ఎలాంటి విఘాతం కలిగించలేదు. ధీరేన్ గంగూలీ 1922లో హైదరాబాదుకు వచ్చి తన సైలెంట్ సినిమాల నిర్మాణం కొనసాగిస్తున్న సమయంలో జే.ఎఫ్.మదన్ కూడా హైదరాబాదుకు వచ్చి రెండు సినిమా థియేటర్లను నిర్మించాడు. వీటితోపాటు మరికొన్ని సినిమా థియేటర్లు కూడా హైదరాబాదులో నిర్మాణమైనవి. ఒకవైపు ధీరేన్ గంగూలీ నిర్మించిన థియేటర్లు, మరోవైపు జేఎఫ్ మదన్ తదితరుల థియేటర్లు ఆ కాలంలో దేశ, విదేశీ సైలెంట్ చిత్రాల ప్రదర్శనకు ప్రధాన వనరులుగా ఉండేవి. అయితే ధీరేన్ గంగూలీ థియేటర్లు కాకుండా మిగతా అన్ని థియేటర్లపై జె.ఎఫ్. మదన్ ఆజమాయిషీ ఉండేది.
ధీరేన్ గంగూలి తన థియేటర్లో సినిమాల ప్రదర్శనకు వారానికి 500 రూపాయలు వసూలు చేస్తుండగా, అదే జె.ఎఫ్.మదన్ థియేటర్లలో వారానికి 900 రూపాయలు వసూలు చేసేవారు. మదన్ థియేటర్స్ వారు వసూలు చేసే ఈ అధిక మొత్తం చెల్లించడానికి చాలామంది ఎగ్జిబిటర్లు వెనుకాడే వారు. మదన్ తన థియేటర్ల అద్దె పెంచడానికి కారణం ఏమిటంటే 1940 వరకు కూడా నిజాం సర్కారు సినిమా థియేటర్లకు వినోదపు పన్ను విధించేవారు కాదు. పైగా వాటిపై సర్కారు ఆజమాయిషి కూడా ఉండేది కాదు. అయితే ఆ తర్వాత 1941 డిసెంబరు 12న నిజాం ప్రభుత్వము థియేటర్లపై వినోదపు పన్ను విధించడం ప్రారంభించింది. 1922,1923 సంవత్సరాలలో ధీరేన్ గంగూలీ హైదరాబాదులో తీసినంత కాలము జేఎఫ్ మదన్ సినిమా థియేటర్లు ఇక్కడ నడిచినవి. కానీ ఇంతలోనే అనారోగ్యంతో బాధపడుతూ తన 63వ ఏట 1923 జూన్ 28న జె.ఎఫ్. మదన్ కలకత్తాలో కన్నుమూశాడు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో జె.ఎఫ్. మదన్ సైలెంట్ చిత్రాల కాలంలో కలకత్తాలో నిర్వహించిన భూమిక అత్యంత కీలకమైనది. తన మదన్ థియేటర్ సంస్థ ద్వారా ”నల దమయంతి” (1920), ”ధ్రువ చరిత్ర”, ”రత్నావళి”, ” సావిత్రి సత్యవాన్”, ”విషవృక్ష”, వంటి సైలెంట్ సినిమాలను నిర్మించాడు. ఆయన మరణాంతరం ఈ సంస్థ కొనసాగి ”జమై షాష్టి” (11.04.1931) అన్న మొట్టమొదటి బెంగాలీ టాకీని కూడా నిర్మించి చరిత్రలో తన స్థానాన్ని నిలుపుకున్నది. దేశంలో1896 నుండి 1932 వరకు కొనసాగిన సైలెంట్ సినిమాల యుగంలో జె.ఎఫ్. మదన్ నిర్వహించిన భూమికలో తెరకెక్కిన హైదరాబాదు కూడా తన స్థానాన్ని ఏర్పరచుకోవడంతో మన తెలంగాణ సినీ చరిత్రకు ఒక కొత్త చేర్పుగా చెప్పుకోవాలి.
(వ్యాసకర్త తెలంగాణ సినీ చరిత్రకారుడు)
- హెచ్ రమేష్ బాబు, 7780736386



