విచారణకు హాజరైన ఏపీ మాజీ సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అక్రమాస్తుల కేసులో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. న్యాయమూర్తి ఎదుట విచారణకు వచ్చారు. విజయవాడ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు వచ్చి అక్కడి నుంచి నాంపల్లిలోని కోర్టుకు ఆయన చేరుకున్నారు. విచారణ అనంతరం జగన్ అక్కడి నుంచి లోటస్‌పాండ్‌కు వెళ్లిపోయారు. మరోవైపు ఆ పార్టీ నేత పేర్ని నాని, మరో ముగ్గురు నేతలను కోర్టు లోపలికి పోలీసులు అనుమతించలేదు. దీంతో వారు గేట్ వద్దే నిలుచున్నారు.
ఈ కేసులో 2013 సెప్టెంబర్ నుంచి జగన్ బెయిల్‌పై ఉన్నారు. ఇప్పుడు కూడా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరగా సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. ఆరేండ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరవడం లేదనీ, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ తెలిపింది. దీంతో ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే ఆయన కోర్టుకు హాజరయ్యారు.



