Tuesday, October 28, 2025
E-PAPER
Homeజాతీయంజగన్‌ రోడ్డు పర్యటనకు అనుమతి లేదు

జగన్‌ రోడ్డు పర్యటనకు అనుమతి లేదు

- Advertisement -

హెలికాప్టర్‌ ద్వారా వెళ్తామంటే పరిశీలిస్తాం : ఎస్‌పి తుహిన్‌ సిన్హా

అనకాపల్లి : మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఈ నెల 9న విశాఖపట్నం నుంచి నర్సీపట్నం రోడ్డు పర్యటనకు ప్రజల భద్రత దృష్ట్యా అనుమతించేదిలేదని అనకాపల్లి జిల్లా ఎస్‌పి తుహిన్‌ సిన్హా తెలిపారు. అనకాపల్లి ఎస్‌పి కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నర్సీపట్నం నియోజకవర్గం పరిధి మాకవరపాలెంలో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల సందర్శనకు విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో సుమారు 63 కిలోమీటర్లు ప్రయాణానికి పోలీస్‌ సెక్యూరిటీ ఇవ్వడం సాధ్యం కాదన్నారు. ఈ జాతీయ రహదారి ప్రధాన కూడళ్లయిన లంకెలపాలెం, కొత్తూరు, తాళ్లపాలెం, డైట్‌ కళాశాల జంక్షన్‌, మర్రిపాలెంలో వేలాదిమంది పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు.

జగన్మోహన్‌రెడ్డికి జడ్‌ కేటగిరి భద్రత ఉన్నందున ఈ మార్గంలో జన సమీకరణ జరిగితే పరిశ్రమల ఉద్యోగులు, ఫార్మా ఉద్యోగులు, అంబులెన్సులకు తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశముందని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ ద్వారా విశాఖ నుంచి మాకవరపాలెం వెళ్లేందుకు దరఖాస్తు పెడితే పరిశీలిస్తామని చెప్పారు. ప్రజలు పెద్ద ఎత్తున గుమిగూడడం, గుంపులుగా చేరడాన్ని అనుమతించేది లేదన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ ఎస్‌పి ఎం దేవప్రసాద్‌, నర్సీపట్నం డిఎస్‌పి పి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

లేఖ ద్వారా తెలియజేశాం : విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి
మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విశాఖ పర్యటనకు పోలీసు భద్రత ఇవ్వలేమని లేఖ ద్వారా తెలిపినట్లు విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. కమిషనర్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆ రోజున ఐసిసి ఉమెన్స్‌ వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ విశాఖ వేదికగా జరగనున్న సందర్భంగా పెద్ద మొత్తంలో ప్రేక్షకులు మ్యాచ్‌కు హాజరయ్యే ఆస్కారం ఉందని ఇంటెలిజెన్స్‌ ద్వారా తమకు సమాచారం అందిందని తెలిపారు. ఈ క్రమంలో మొత్తం పోలీస్‌ సిబ్బందిని స్టేడియం వైపు ఇప్పటికే మోహరించామని చెప్పారు. ఇటీవల తమిళ నాడులో సినీ నటుడు విజయ్ రోడ్‌ షో మాదిరిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉన్నందున ఈ పర్యటనకు పోలీస్‌ అనుమతి ఇవ్వలేకపోతున్నామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -