నష్టపరిహారం చెల్లించనందుకే..
హర్షం వ్యక్తం చేసిన రైతులు
నవతెలంగాణ – జగిత్యాల
పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వేలైన్ కోసం సేకరించిన భూములకు రైతులకు నష్టపరిహారం చెల్లించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో.. కోర్టు ఆదేశాల మేరకు జగిత్యాల రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోని సామగ్రిని గురువారం జప్తు చేశారు. ఈ చర్యపై బాధిత రైతులు హర్షం వ్యక్తం చేశారు. సుమారు 23 ఏండ్ల క్రితం పెద్దపల్లి-నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల పరిధిలో రైతుల నుంచి సుమారు 100 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ప్రభుత్వం ఎకరాకు కేవలం రూ.1.30 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించింది.
విలువైన భూములు కోల్పోతున్నామని రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించగా, 2010లో న్యాయస్థానం ఎకరాకు రూ.10లక్షల నష్టపరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఆర్డీవో హైకోర్టును ఆశ్రయించగా 2014లో న్యాయస్థానం విచారణ జరిపి పరిహారాన్ని ఎకరాకు రూ.15 లక్షలకు పెంచుతూ ఆదేశించింది. మరోసారి ప్రభుత్వం తరపున ఆర్డీవో సుప్రీంకోర్టుకు వెళ్లగా, 2018లో సర్వోన్నత న్యాయస్థానం సివిల్ కోర్టు ఉత్తర్వులను సమర్థిస్తూ ఎకరాకు రూ.10లక్షల నష్టపరిహారంతో పాటు ఇతర చార్జీలను రైతులకు చెల్లించాలని స్పష్టం చేసింది.
ఆలస్యం కారణంగా జప్తు..
సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పటికీ ఇంతవరకు రైతులకు పూర్తిస్థాయిలో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించలేదు. దాంతో బాధిత రైతులు తిరిగి కోర్టును ఆశ్రయించారు. ఆగ్రహం వ్యక్తం చేసిన సివిల్ కోర్టు గురువారం జగిత్యాల ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని జప్తు చేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు కోర్టు సిబ్బంది ఆర్డీవో కార్యాలయంలోని సామగ్రిని జప్తు చేశారు.
జగిత్యాల ఆర్డీవో కార్యాలయ సామగ్రి జప్తు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES