Friday, March 20, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్‌

రూ.2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్‌

- Advertisement -

ప్రతి ఏటా ఉగాదికి ప్రజా బడ్జెట్‌ విడుదల
తమ ప్రతిపాదనలను ప్రభుత్వ బడ్జెట్‌లో తీసుకోవాలి : ఉగాది వేడుకల్లో కల్వకుంట్ల కవిత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
2026-27 సంవత్సరానికి గాను రూ.2,15,200 కోట్లతో తెలంగాణ జాగతి ప్రజా బడ్జెట్‌ 2026-27ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విడుదల చేశారు. గురువారం హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఉగాది వేడుకల్లో కవిత, అనిల్‌ దంపతులు, జాగృతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు. వేద పండితులు పంచాంగ శ్రావణం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్‌లో తమ బడ్జెట్‌ ప్రతిపాదనలను తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అధికారంలో ఎవరున్నా సరే… ఇకనుంచి ప్రతి ఏటా ఉగాది నాడు తెలంగాణ జాగృతి ప్రజా బడ్జెట్‌ను విడుదల చేస్తుందని ఆమె ప్రకటించారు.

ప్రజల నుంచి వచ్చిన సూచనల మేరకే తాము ఈ ప్రజా బడ్జెట్‌ను కేటాయించినట్టు కవిత తెలిపారు. ప్రజా బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్ద పీట వేసినట్టు చెప్పారు. విద్యారంగానికి రూ.30 వేల కోట్లు, వైద్య, ఆరోగ్య శాఖకు రూ.25 వేల కోట్లు, యూనివర్సిటీ విద్యకు రూ.2 వేల కోట్లు, వృద్ధులు, వికలాంగులు సహా ఇతర పింఛన్లకు రూ.25 వేల కోట్లు, ఇందిరమ్మ ఇండ్లకు రూ.20 వేల కోట్లు, తెలంగాణ ఉద్యమకారులకు ఇండ్లు, అమరవీరుల కుటుంబాలకు పెన్షన్లకు రూ.5 వేల కోట్లు, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12 వేల ఆర్థిక సాయం అందజేయడానికి రూ.100 కోట్లు కేటాయించారు. 18 ఏండ్లు నిండిన యువతులకు స్కూటీల పంపిణీకి రూ.5 వేల కోట్లు, రైతులు, కౌలు రైతులకు ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతు భరోసా ఇవ్వడంతో పాటు రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం అందించడానికి రూ.35 వేల కోట్లు, 16 లక్షల మంది యువతకు రాజీవ్‌ యువ వికాసం సాయం చేయడానికి రూ.5 వేల కోట్లు, బీసీల సంక్షేమానికి రూ.20 వేల కోట్లు ప్రజా బడ్జెట్‌ లో ప్రతిపాదించారు.

ఎస్సీల సంక్షేమానికి రూ.18 వేల కోట్లు, ఎస్టీల సంక్షేమానికి రూ.10 వేల కోట్లు, మైనారిటీల సంక్షేమానికి రూ.5 వేల కోట్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్‌ సాయంతో పాటు తులం బంగారం ఇవ్వడానికి రూ.10 వేల కోట్లు, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాల కోసం రూ.10 వేల కోట్లు కేటాయిస్తే బాగుంటుందని తెలిపారు. 50 ఏండ్లు నిండిన కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.500 పింఛన్‌ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రూ.5,500 కలిపి ఇస్తుందనీ, దీనిని సద్వినియోగం చేసుకొని లక్ష మంది కళాకారులకు పింఛన్‌ ఇవ్వడానికి రూ.100 కోట్లను ప్రజా బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. ఇదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయింపులు జరిపిన తర్వాత కూడా రూ.లక్ష కోట్ల మిగులు ఉంటుందని కవిత అన్నారు. మిగిలిన రూ.లక్ష కోట్లతో ప్రభుత్వం తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్య తనివ్వాల్సిన అవసరముందన్నారు.

వెలుగుమట్ల తరహాలో భవిష్యత్‌ పోరాటాలు
భవిష్యత్తులో తమ పోరాటాలు వెలుగుమట్ల పోరాటం తరహాలోనే ఉంటాయని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉగాది వేడుకల సందర్భంగా మీడియా ప్రతినిధులతో ఆమె ఇష్టాగోష్టిగా మాట్లాడారు. భవిష్యత్తులో విశారదన్‌, ప్రజా సంఘాలు,సీపీఐ(ఎం), సీపీఐ (ఎంఎల్‌ ) న్యూడెమోక్రసీ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందనీ, మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీని ప్రకటిస్తామని చెప్పారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నామనీ, తన పోరాటం డాడీ,మోడీ, చిన్న మోడీపై ఉంటుందన్నారు. తనకు ఎవరితోనూ రాజీ లేదనీ, కొత్త పార్టీ సక్సెస్‌ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పేరు విషయంలో టెక్నికల్‌ అంశాలు అన్ని సెట్‌ అవుతాయన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీతో తనకున్న విబేధాలను కాంగ్రెస్‌, సీఎం రేవంత్‌ అవకాశంగా తీసుకుంటున్నారనీ, అసెంబ్లీలో సైతం వాడుకుంటున్నారని తెలిపారు.

శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటనకు ముందే జాతీయ స్థాయి నేతలను కలవాలని భావిస్తున్నట్టు తెలిపారు. నూతన పార్టీ కేంద్ర కార్యాలయం కోసం అనుకూలమైన స్థలం చూస్తున్నట్టు చెప్పారు. తనకు బేషజాలు లేవనీ, అందరిని కలుపుకుపోవాలని నిర్ణయించుకున్నట్టు వెల్లడించారు. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మంలో కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యమంలో పని చేసిన యువతకు అవకాశం ఇస్తామనీ, కొత్త పార్టీలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నుంచి తనను పోటీ చేయాలని కోరుతున్నారని కవిత తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం ఉంటుందనీ, తాను బీఆర్‌ఎస్‌కు దూరం అయ్యాక నిజామాబాద్‌ జిల్లాలో బీఆర్‌ఎస్‌ పూర్తిగా నష్టపోయిందని తెలిపారు.

ప్రజలకు మంచి జరగాలి
ఈ ఏడాది తెలుగు ప్రజలు, తెలంగాణ ప్రజలకు మంచి జరగాలని కవిత ఆకాంక్షించారు. సనాతన ధర్మం ఎంతో గొప్పదనీ, ఆ సంస్కతి గౌరవాన్ని ప్రతి ఒక్కరూ కాపాడాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -