క్వింటాలుకు రూ.5,500ల నుంచి రూ.5,800 పలుకుతున్న వైనం
నవతెలంగాణ – మల్హర్ రావు
సన్న రకం బియ్యంలో అత్యంత సన్న రకమైన జై శ్రీరాం బియ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రస్తుతం క్వింటాలు బియ్యంను రూ.5,500 నుంచి రూ.5,800 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. పాతవి అయితే మరో రూ.వెయ్యి అదనంగా వసూలు చేస్తున్నారు. జైశ్రీరాం రకం బియ్యం బీపీటీ, హెచ్ఎంటీల కంటే ఎక్కువ సన్నగా ఉండటంతో ఈరకం బియ్యంను ఆహారంలో తీసుకోవడానికి అనేక మంది ఇష్టపడుతున్నారు. గడచిన వర్షాకాల సీజనులో మండలంలో దాదాపు 8వేల ఎకరాల్లో జై శ్రీరాం రకం ధాన్యంను రైతులు సాగు చేశారని అంచనా.మార్కెట్లో క్వింటాలు ధాన్యంను రూ.3వేల వరకు విక్రయించారు.కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే బోనస్ వర్తిస్తుందని తెలిసినా రైతులు వ్యాపారులకే విక్రయించి ఎక్కువ లాభం పొందారు.
మిల్లర్లు కూడా జై శ్రీరాం రకం ధాన్యం కొనుగోళ్లకు మొగ్గుచూపారు.ఈ రకం వరి ధాన్యం తాడిచెర్ల, పెద్దతూoడ్ల,కొండంపేట,ఎడ్లపల్లి, మల్లారం గ్రామాల్లో ఎక్కువగా సాగు అయ్యింది. ధాన్యంను వ్యాపారులు దిగుమతి చేసుకున్నారు. ఎగుమతులకు డిమాండ్ ఉన్నా స్థానికంగానే అనేక మంది జై శ్రీరాం రకంను కోరుతుండటంతో ఈ రకం బియ్యంను ఇక్కడే వ్యాపారులు విక్రయిస్తున్నారు. ఈ రకం బియ్యంకు బెంగు ళూర్, హైదరాబాద్లలో ఎక్కువగా డిమాండ్ ఉంది. జై శ్రీరాం రకం వరి విత్తనంను ప్రైవేటు కంపెనీలు అందుబాటులో ఉంచుతున్నాయి. యాసంగి సీజనులో ఈరకం సాగు చేయడానికి అనువైన పరిస్థితి కాకపోవడంతో వర్షాకాలం సీజనులోనే సాగు చేస్తున్నారు. ఏదేమైనా మార్కెట్లో డిమాండ్ పెరగడం, ధర ఆశాజనకంగా ఉండటంతో జై శ్రీరాం రకం వరి ధాన్యం పండించిన రైతులు, నిలువ చేసుకున్న వ్యాపారుల పంట పండినట్లే అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.



